ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు 

Yechury's death is a huge loss for the party– సీతారాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
 విద్యార్థి దశ నుండి అంచలంచెలుగా ఎదిగిన కామ్రేడ్ సీతారాం ఏచూరి దేశంలోని వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను బలోపేతం  చేసేందుకు కృషి చేశాడు. సమకాలీన కాలంలో వామపక్ష, కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యుత్తమ నాయకుల్లో ఆయన ఒకరుగా పని చేశారని, ఏచూరి మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ అన్నారు. శుక్రవారం దుబ్బాక మండల కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి  చిత్రపటానికి పూలమాలు వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ 1974లో సీపీఐ(ఎం) పార్టీలో చేరిన ఏచూరి 50 సంవత్సరాల కాలంలో సీపీఐ(ఎం) పార్టీకి అనేక సేవలందించారని గుర్తు చేశారు. ఏచూరి  నిరంతరం పేదలు,శ్రామిక ప్రజల కోసం,ఈ దేశంలో విప్లవం కోసం జీవితాంతం పని చేసిన మహనీయుడని అన్నారు. నిరంతరం విప్లవ చైతన్యాన్ని,రాజకీయ,కర్తవ్యాన్ని బోధించిన మహనీయుడని కొనియాడారు.మూడు పర్యాయాలు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమం నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ సీపీఐ(ఎం) పార్టీ జాతీయ కార్యదర్శి గా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. విప్లవ రాజకీయాలు,అధ్యయనంలో ఆచరణలో నిబద్ధత ఆశయంపై అంకిత భావంతో పని చేశారని కొనియాడారు.
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని దేశ పరిస్థితులకు అన్వయించడంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను కూడా అధిగమించి ముందుకు నడిపించారని అన్నారు. కార్మిక,కర్షక ఉద్యమాల్లో, ఉద్యోగుల ఆందోళనలో, సరళీకృత ఆర్థిక ఉదారవాద విధానాలపై పోరాడటంలో, ప్రజాస్వామిక పోరాటాల్లో ముఖ్యంగా మతతత్వ వ్యతిరేక పోరాటంలో, దళిత,ఆదివాసి గిరిజన హక్కుల రక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారన్నారు. లౌకిక ప్రజాస్వామిక పార్టీలను ఏకం చేయడంలో ఆయన కృషి చాలా గొప్పదని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా అనేక విషయాల పట్ల లోతైన చర్చలు చేసి మతతత్వ విభజన రాజకీయాలను ఎండగడుతూ భారతీయత అంటే ఏమిటో తెలియజేసిన తీరు చాలా గొప్పదని కొనియాడారు. పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటెరియన్ సభ్యుడిగా గుర్తింపు పొందారని, రాజకీయ సైదాంతిక విషయాలు,ఆర్థిక విశ్లేషణ మొదలైన అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేస్తూ సూటిగా విశ్లేషించే గొప్ప నాయకుడని కొనియాడారు. పార్టీ కార్యకర్తల పట్ల ఎంతో ప్రేమతో స్నేహంతో వ్యవహరించేవారని ఇలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం సీపీఐ(ఎం) పార్టీ మరియు వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి గారు నడిచిన మార్గంలో ఆశయానికి అంకితం అవటమే ఆయనకు మనందరం అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు లక్ష్మీనరసయ్య,ఎండి సాజిద్,లావణ్య,రాణి,సత్యం, సౌందర్య,లక్ష్మి, బాలమణి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.