ఏచూరి మృతి వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు

Adilabadనవతెలంగాణ-ఆసిఫాబాద్‌
సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయి కృష్ణ , డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ పోస్ట్‌ మెట్రిక్‌ బాలుర హాస్టల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంతాప సభకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినంతరం మాట్లాడుతూ ఏచూరి మరణం యావత్‌ భారతదేశానికి తీరనిలోటని, ఒక కమ్యూనిస్టు విప్లవకారున్ని దేశం కోల్పోయిందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐలో కొనసాగి తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఇప్పటి వరకు విద్యార్థి యువజన ప్రజల పక్షాన, కార్మిక, కర్షక, రైతాంగాల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై గలమెత్తారన్నారు. విద్యార్థి హక్కులపై పోరాడుతూనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ ముందు ధైర్యంగా నిలబడి కొట్లాడారన్నారు. విద్యార్థి సంఘంలో పనిచేస్తు అనేక ఉద్యమాలు పోరాటాలు గురించి అధ్యయనం చేస్తూనే ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలకు అండగా నిలిచారన్నారు. అలాంటి నేత దేశానికి దొరకడం చాలా అరుదని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వసాకే సాయికుమార్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గెడం టీకానంద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు నితీన్‌, డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి సతీష్‌, వడ్లూరి శ్రీకాంత్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు భారతి, మంజుల, డివైఎఫ్‌ఐ కళాశాల అధ్యక్షులు అరవిందు, నాయకులు కార్తీక్‌ పాల్గొన్నారు.