ఏచూరి జీవితం…యువతరానికి దారిదీపం!

Yechury's life...a beacon for the younger generation!కమ్యునిస్టు యోధుడు,విద్యావేత్త, మహోన్నత వ్యక్తిత్వం మూర్తీభవించిన బడుగుల పక్షపాతిగా 72 ఏండ్ల సుదీర్ఘ జీవితాన్ని సామాజిక న్యాయస్థాపనకు అంకితం చేసిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ఆ పార్టీకే కాదు, వామపక్ష ఉద్యమానికి, దేశానికి తీరనిలోటు. ఎందుకంటే ఏచూరి జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఏచూరి సీతారామ్‌ 12 ఆగష్టు 1952న ప్రభుత్వ అధికారి ఏచూరి కల్పకం – ఇంజనీర్‌ సర్వేశ్వర సోమయాజీ దంపతులకు మద్రాసులోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబారు దేశ్‌ముఖ్‌ శిష్యురాలిగా తల్లి కల్పకం నేర్పిన సామాజిక న్యాయ బాధ్యతలను అర్థం చేసుకున్నారు. ఆమె సోదరుడు పూర్వ ఐఏఎస్‌ అధికారి, చీఫ్‌ సెక్రటరీ మోహన కందా మేనల్లుడుగా సీతారామ్‌ రాజకీయాల పట్ల చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకున్నారు.హైదరాబాద్‌ ‘ఆల్‌ సేయింట్స్‌ స్కూల్‌’లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసిన ఏచూరి ఆ తర్వాత ‘నిజామ్‌ కాలేజీ’లో తదనంతర విద్యాభ్యాసం ఢిల్లీలో కొనసాగింది. 1970లో ఢిిల్లీ ‘ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్‌’లో సిబిఎస్సీ చదివి పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి, ఢిల్లీ యూనివర్సిటీ ‘సేయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ’లో బి ఏ ఆనర్స్‌ (ఆర్థిక శాస్త్రం), ‘జెఎన్‌యూ’లో ఎంఎ ఎకనామిక్స్‌ ప్రథమ శ్రేణిలో పట్టాలు పొందారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిలో నిరసనల్లో పాల్గొని అరెస్టయ్యారు. హిందూస్తానీ టైమ్స్‌ పత్రికలో సంపాదకీయ వ్యాసాలు రాయడంలో మన సీతారామ్‌ మేధో సంపత్తిలో దిట్ట. కుమారుడు అశీష్‌ 34వయేటా 2021లో కరోనాతో మృతిచెందాడు.ఆ బాధను తొందరలోనే దిగమింగుకుని ప్రజాసేవలోనే నిరంతరం నిమగమయ్యాడు. కుమార్తె అఖిల హిస్టరీ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
యాభైఏండ్ల క్రితం జెఎన్‌యూలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన సీతారాం ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తదనంతరం జాతీయ అధ్యక్షుడిగా తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. 1970ల్లో జెఎన్‌యూ పర్యటనను వ్యతిరేకించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి యూనివర్సిటీ విద్యార్థుల కోరికలు వినిపిస్తూ రాజీనామా చేయాలని ముందుండి ధైర్యంగా పోరాడారు. జెఎన్‌యూ ఎన్నికల్లో మూడుసార్లు గెలిచి అధ్యక్షుడిగా నాయకత్వ పటిమ చూపారు. 1975లో సీపీఐ(ఎం)లో చురుకైన కార్యకర్తగా చేరి 1984లో పార్టీ సెంట్రల్‌ కమిటీలో సభ్యుడిగా ఎదిగారు. 1985,1988లో సెంట్రల్‌ సెక్రటేరియట్‌, 1992లో పొలిట్‌ట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.1996లో యూపిఏ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆ కాలంలోనే అణుఒప్పందానికి వ్యతిరేకంగా కూటమి నుంచి వైదొలిగారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా లౌకికపార్టీలను ఐక్యం చేసి ‘ఇండియా’ కూటమి నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించారు. పార్టీలన్నింటినీ ఐక్యం చేసి ఒక్కతాటికి తీసుకు రావడానికి కృషి చేశారు. ఆ ఫలితం ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైంది. వెరసి బీజేపీ మెజార్టీ కోల్పోవడమే.
19 ఏప్రిల్‌ 2015 నుంచి నేటి వరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ప్రజలకు అమూల్య సేవలందించారు. 2015-17 వరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2017లో రాజ్యసభలో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు, అత్యంత ప్రతిభ కలిగిన రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయగల ఆకర్షణీయ వ్యక్తిత్వం స్వంతం చేసుకున్న ఏచూరి నిజాయితీకి ప్రతిరూపంగా నిలబడ్డారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న చురుకైన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మరణానంతరం పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి (ఏయిమ్స్‌- ఢిల్లీ) అందించాల్సిందిగా కోరుకున్న ఏచూరి ప్రదర్శించిన విలువలు, నడిచిన సన్మార్గం దేశానికే మార్గదర్శకం. కామ్రేడ్స్‌ సుర్జిత్‌ సింగ్‌, జ్యోతి బసు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొన్న ఏచూరి జీవిత చరమాంకం మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. రాజకీయ పరిపక్వత, నైతిక ప్రవర్తన, నీతి నియమాలు, ఆయన అర్థ శతాబ్దపు జీవన ప్రస్థానం నేటి యువభారతానికి దారిదీపం.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037