– రెండు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు
– గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు
– వెల్లడించిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సును దాటిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైసల్మర్, అజ్మీర్, మాండ్ల, రాయిపూర్‌తో పాటు ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం గుండా వెళుతూ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 78.3 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో రెండు మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.