
నవతెలంగాణ – కంటేశ్వర్
పసుపు క్వింటాలకు రూ.18వేలు మద్దతు ధర నిర్ణయించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగాధరప్పా, పల్లపు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి. దేవేందర్ సింగ్, ఈ సాయిలు ల బృందం సందర్శించింది. పసుపు రైతులు, అధికారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పసుపు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారన్నారు. పసుపు పంట ఖరీదైంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి రేటు ఉన్నప్పటికీ దుంప తెగుళ్లు మర్రాకు తెగుళ్ల వల్ల దిగుబడి 30% తగ్గిపోయిందనీ అన్నారు. ఎకరాకు సుమారు రూ. లక్ష 50 వేల వరకు ఖర్చవుతుందనీ అన్నారు. అడ్తిదారులు కుమ్మక్కై ధరలను తగ్గించి రైతులను నిలువున మోసం చేస్తున్నారనీ అన్నారు. మార్కెట్‌లో మాత్రం క్వింటాలుకు రూ.8 -12వేలు మాత్రమే రైతులకు లభిస్తున్నదన్నారు. తేమ పేరుతో కోతలు పెడుతున్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదనీ అన్నారు. దీనివల్ల పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ అన్నారు. ఈ సంవత్సరం మార్కెట్ కు 2వేల క్వింటాళ్లు పసుపు పంట వచ్చిందన్నారు. పసుపు కొనుగోళ్లకు పసుపు బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాలనీ అన్నారు. పసుపు మద్దతు ధర రూ.18వేలు నిర్ణయించాలని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు పోరాటం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస మద్దతు ధర హామీలను నిలబెట్టుకోవాలనీ అన్నారు. మార్క్‌ఫెడ్ ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతులు ఆకుల నరేష్, కుంట నగేష్ రెడ్డి, రాజేశ్వర్, గడ్డం పెద్దదేవన్న తదితరులు పాల్గొన్నారు.