అవుననటానికి కాదనటానికి….

Yes to no...అత్తాకోడండ్ల మీద మస్తు సామెతలు వింటుంటాం. ‘అవుననటానికీ, కాదనటానికి అత్త పెత్తనమే గాని కోడలికి ఏమి ఉంటది’ అనేది ఒకటి. ఉమ్మడి కుటుంబంలో ఏ నిర్ణయం అయినా అత్తదే ఫైనల్‌ ఉంటది. కోడలు ఇన్వాల్వ్‌మెంట్‌ ఉండకపోవచ్చు. ఒకనాటి కాలంలో ఇలా నడిచింది. ఆ కాలంలోనే ‘అత్తకాలం కొన్ని రోజులు, కోడలు కాలం కొన్ని రోజులు’ అనే సామెత కూడా ఉంది. అత్త ముసలిది అయిన తర్వాత కోడలు ఆ తర్వాత కాలంలో ఆధిపత్యం వహించిన అత్తను సైసకపోవచ్చు. సైసుడు అంటే సహించకపోవడం. ఎక్కడైనా పెత్తనాలకు వ్యతిరేకంగా ప్రతీకారాలు ఉండే ఉంటాయి. అయితే కొన్ని బంధాల స్వభావం అలానే ఉంటుంది. అందుకే ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు’ అంటారు. అట్లాగే ‘ఓపిక లేని అత్తకు వంగలేని కోడలు’ అని కూడా చలామణిలో ఉన్న మాట. పెద్దమనుషులు అవుతుంటే ఓపికలు ఉండవు. అట్లా లేని వాళ్లకు వంగలేని కోడలు దొరికిందట. వంగలేకపోవడం అంటే పనికి వంగలేకపోవడం అని అర్థం. అత్తా కోడలు సమన్వయంతో ఉంటేనే సంసారాలు సరిగ్గా నడుస్తాయి. ఈ కథలన్నీ వినడానికి ఓపిక కావాలి. అన్నట్టు ‘ఓపని వానికి కోరికలు ఎక్కువ, ఒల్లని వానికి ఆటలు ఎక్కువ’ అనే సామెత కూడా ఉంది. ఓపిక ఉంటేనే పనులవుతాయి. కోరికలు ఎక్కువ ఉంటే ఎట్లా. అట్లాగే ఒల్లని వానికి అంటే వద్దు అనే వారికి ఆటలు ఎక్కువ అన్నారు. మరొక సామెత ‘ఓనమాలు రావు గాని మిత్తి లెక్కలు కడతడు’. అ ఆ ఇ ఈ లు రాకున్నా వడ్డీ ఎంత అయితదో సులువుగా లెక్క చేసే వాళ్ళు ఉంటారు. వాళ్లు మనస్సులోనే వాళ్లదైన పద్ధతిలో లెక్కలు చేస్తారు. పక్కా చేస్తారు కూడా. చదువు రావకపోవడం అంటే అక్షరాలు మాత్రమే రావు జీవన చైతన్యం అందరికీ ఉంటుంది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479