– కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తున్న అంతర్జాతీయ సమాజం
– ప్రజల హక్కుల రక్షణపై ఐరాస ఆశాభావం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ బదులిస్తూ ‘భారత్ సహా ఎన్నికలు జరిగే ఏ దేశంలో అయినా రాజకీయ, పౌర హక్కులు సహా ప్రజలందరి హక్కులకు రక్షణ లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. స్వేచ్ఛాయుత, నిస్పక్షపాత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాము’ అని చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా ఇంతకుముందే స్పందించింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా, సకాలంలో చట్టపరమైన ప్రక్రియలు జరగాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది. తన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారని, దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం సవాలుగా మారిందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల గురించి కూడా తమకు తెలుసునని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. అయితే మిల్లర్ వ్యాఖ్యలు అవాంఛనీయమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మన ప్రజాస్వామ్య, చట్టపరమైన ప్రక్రియలలో విదేశీ ఆరోపణలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కావని ఆయన చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ కూడా స్పందించింది. కేజ్రీ అరెస్టు గురించి తెలిసిందని జర్మనీ విదేశాంగ శాఖ తెలిపింది. ‘న్యాయ వ్యవస్థ స్వతంత్రత, మౌలిక ప్రజాస్వామిక సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసుకు కూడా వర్తిస్తాయని మేము భావిస్తున్నాం’ అని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తుల మాదిరిగానే కేజ్రీవాల్ కూడా నిస్పాక్షిక, స్వేచ్ఛాయత విచారణకు అర్హుడని వ్యాఖ్యానించింది. కాగా అమెరికా, జర్మనీ దౌత్యవేత్తల ను తన కార్యాలయానికి పిలిపించిన విదేశాంగ శాఖ ఆయా దేశాల స్పందనపై నిరసన తెలియజేసింది.