– బ్యారేజీలకు లీకేజీలు..
– వరుస ఘటనలతో అయోమయం..
– బయటపడుతున్న కాళేశ్వరం లోపాలు
నవతెలంగాణ-భూపాలపల్లి/మహాదేవపూర్
కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. అన్నారం సరస్వతీ బ్యారేజీలో నీరు ఉబికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలు బీటలు పట్టిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అన్నారం సరస్వతీ బ్యారేజీలోని 28నుంచి 40 పిల్లర్ల మధ్య బుంగ పడినట్టు తెలిసింది. వరద నీరు విడుదలయ్యే ప్రదేశంలో 2 గేట్ల నుంచి నీరు ఉబికి వస్తున్నట్టు గమనించిన ఇంజినీరింగ్ ఆధికారులు.. వెంటనే అప్రమత్తమై ఇసుక సంచులు వేసి ఊటను ఆపే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఇసుక నీటితోపాటు పైకి వస్తే ప్రమాదమేనని అధికారులు భావిస్తున్నారు. కాగా 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజీని నిర్మించగా.. ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరు ఉంది. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ అక్టోబర్ 22న 2ఫీట్ల మేర కుంగిపోయిన విషయం విధితమే. 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ కుంగింది. దానికి ఇరువైపులా ఉన్న 19,21 పిల్లర్లపై ఎఫెక్ట్ పడింది. కేంద్ర బృందం కూడా బ్యారేజీని పరిశీలించే తప్ప ఇంకా ఏమీ తేల్చిచెప్పలేదు. అయితే ప్రాజెక్టు నిర్మాణ దశలోనే నిర్మాణ లోపాలున్నాయని గతంలో ప్రచారం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలో వరుస సంఘటనలు చోటుచేసుకోవడంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా, ఏటా జరిగే మెయింటెనెన్స్‌లో భాగంగా ఇలా చేస్తామని, గతేడాది కూడా ఇలానే లీకేజీ చేసి పరిశీలించామని ఇంజినీరింగ్ అధికారులు తెలపడం గమనార్హం.
బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు : ఏ యాదగిరి, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, అన్నారం బ్యారేజీ
అన్నారం బ్యారేజీపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. బ్యారేజీకి ఢోకా లేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ప్రతేడాది సహజంగా ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తాం. 1275 మీటర్స్ లెంగ్త్‌లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదు. ఇరిగేషన్‌శాఖ, ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత వాళ్లదే. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నాం. సాండ్‌తోని రింగ్ బండ్ కూడా వేస్తున్నాం. ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ అలో చేసేందుకు డిజైన్‌లోనే అరేంజ్‌మెంట్ ఉంటుంది. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తాం.
నాణ్యతాలోపం వల్లే ఇలా జరుగుతున్నాయి : ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, అన్నారం
అన్నారం సరస్వతి బ్యారేజీ పనులు హడావిడిగా చేయడంతో నాణ్యతా లోపం వల్ల నీరు లీకేజీ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీ నీరు లీక్ కావడం నాణ్యత లోపానికి నిదర్శనం. అంతేకాదు, బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. కానీ రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. దాంతో రైతులు ఏటా అరిగోస పడుతున్నారు.