నిన్న సూరత్‌.. నేడు గాంధీనగర్‌?

నిన్న సూరత్‌..
నేడు గాంధీనగర్‌?
అమిత్‌ షా పోటీ చేసే నియోజకవర్గంలో ఏకగ్రీవానికి యత్నాలు
ొ పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారన్న ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులు
ొ కేంద్ర హౌం మంత్రి
అనుచరులపై ఆరోపణలు
ొ నెట్టింట వీడియో చక్కర్లు – అమిత్‌ షా పోటీ చేసే నియోజకవర్గంలో ఏకగ్రీవానికి యత్నాలు
– పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారన్న ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులు
– కేంద్ర హౌం మంత్రి అనుచరులపై ఆరోపణలు
– నెట్టింట వీడియో చక్కర్లు
అహ్మదాబాద్‌ :
గుజరాత్‌లోని సూరత్‌ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ.. మరో కీలక స్థానం గాంధీనగర్‌లోనూ అదే ప్రయత్నానికి దిగిందని తెలుస్తున్నది. కేంద్ర హౌం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తమను ఈ స్థానంలో పోటీ నుంచి తప్పుకో వాలంటూ ఒత్తిళ్లు వచ్చాయని ముగ్గురు అభ్యర్థులు ఆరోపించారు. సూరత్‌ స్థానం ఏకగ్రీవం అయిన గతనెల 21నే.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాగా, ఈ విషయంపై ఒక అభ్యర్థి మాట్లాడాడు. తనను ‘హైజాక్‌’ చేసిన ‘అమిత్‌ షా వ్యక్తులు’ గుజరాత్‌లోని గాంధీనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని బలవంతం చేశారని జితేంద్ర చౌహాన్‌ (39) ఫిర్యాదు చేశారు.
1989 నుంచి బీజేపీ గాంధీనగర్‌ లోక్‌సభ సీటును గెలుచుకుంటూ వస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గుజరాత్‌లోని 26 స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అమిత్‌ షా ఈసారి కూడా రాష్ట్ర రాజధాని అయిన గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 7న ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ జరగనున్నది.
కాగా, చౌహాన్‌తో సహా గాంధీనగర్‌లోని ముగ్గురు అభ్యర్థులు తాము రేసు నుంచి తప్పుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొన్నామని ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ముగ్గురూ స్థానిక బీజేపీ రాజకీయ నాయకులు, పార్టీతో సంబంధం ఉన్నవారు బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వీరిలో ఇద్దరు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా గుజరాత్‌ పోలీసులు సైతం ఒత్తిడి చేశారన్నారు.
కాగా, గాంధీనగర్‌ నుంచి ఇప్పటికే 16 మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించు కున్నారు. వీరిలో చౌహాన్‌తో సహా పన్నెండు మంది స్వతంత్రులు. నలుగురు చిన్న రాజకీయ పార్టీలకు చెందినవారున్నారు. ” నాకు డబ్బును ఎర చూపారు. ఎంత కావాలంటే అంత కోరుకోమని చెప్పారు. నాకు డబ్బు అక్కర్లేదు. కానీ నేను నా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవటానికి కారణాలున్నాయి. నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్ల బాగోగులు చూసుకోవాలి. నాకేదైనా జరిగితే వాళ్ళు ఎలా బతుకుతారు?” అని చౌహాన్‌ వాపోయాడు.
చౌహాన్‌ తన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయటానికి ఒక రోజు ముందు ఏప్రిల్‌ 20 ఉదయం అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పరిసర ప్రాంతంలో ఉన్న సుమిత్రా మౌర్య ఇంటికి డజను మందికి పైగా మగవారు ప్రవేశించారని ఆమె ఇంటి చుట్టుపక్కలవారు చెప్పారు. సుమిత్రా మౌర్య(43) గాంధీనగర్‌లోని ప్రజాతంత్ర ఆధార్‌ పార్టీ అభ్యర్థి.
ఆమె ఇంటిలోకి ప్రవేశించినవారికి ఇద్దరు పిల్లలు మాత్రమే కనిపించారు. వారు మౌర్య కుమార్తెలు. ”ఉదయం 11 గంటల సమయంలో నా నామినేషన్‌ కోసం నేను గాంధీనగర్‌లో ఉన్నాను” అని ఆమె నాకు చెప్పారని చౌహాన్‌ వివరించాడు. ఈ వ్యక్తులు సమీపంలో నివసించే తన అత్తగారిని కూడా కలిశారని మౌర్య చెప్పారు. ”నేను రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాను. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజేష్‌ మౌర్య, మేము కొన్ని రోజులు పట్టణం విడిచిపెట్టి వెళ్లాలని కొందరు చెప్పారు” అని ఆమె వివరించారు. ఏప్రిల్‌ 22న ప్రజాతంత్ర ఆధార్‌ పార్టీకి చెందిన రాజేష్‌ మౌర్య గుజరాత్‌లోని ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.
ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో జరిగిన సంఘటనల క్రమాన్ని పేర్కొన్నాడు.
‘నన్ను చంపుతారు’
తనను చంపుతారని చౌహాన్‌ భయం వ్యక్తం చేశారు. ”నేను నా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను: ఈ దేశాన్ని రక్షించండి. అది ప్రమాదంలో ఉన్నది” అని జితేంద్ర చౌహాన్‌ కోరారు. కాగా, మరుసటి రోజే చౌహాన్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకోవటం గమనార్హం.
”నాపై ఒత్తిడి ఉన్నందున నేను ఉపసంహరించుకున్నాను. ఇది అహ్మదాబాద్‌లోని బాపునగర్‌ బీజేపీ ఎమ్మెల్యే దినేష్‌ సింగ్‌ కుష్వా నుంచి వచ్చింది” అని చెప్పారు.