– తప్పుడు ప్రకటనలిచ్చామని వెల్లడి
– క్షమించమని వేడుకోలు
– ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
– కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ వ్యాపారస్తుడు, యోగా గురువు తన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చేసిన తప్పులను మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు అంగీకరించారు. పతంజలి ఆయుర్వేద కో-ఫౌండర్ బాబా రాందేవ్, ఆ కంపెనీ సీఈవో ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కేంద్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకుందని న్యాయమూర్తులు హిమాకోహ్లీ, అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్ గతంలో.. ‘ కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న కొందరు మరణిస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనం ‘ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) గతేడాది సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం పలుమార్లు విచారణ జరిపింది.