‘ఒక సమాచారం ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? లేక ఆ సమాచారాన్ని ఇవ్వకుండా నిషేధించటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్నలను వివేకంతో, విచక్షణతో బేరీజు వేసిన తరువాతనే మీడియాపై చర్యలకు పూనుకోవాలని అత్యున్నత న్యాయస్థానం బ్లూమ్‌బెర్గ్ వర్సస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కేసులో స్పష్టం చేసింది. మీడియాపై కత్తి కట్టి వ్యవహరిస్తూ, పత్రికాస్వేచ్ఛను కర్కశంగా అణచి వేస్తున్న పాలకుల ఏలుబడిలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హర్షణీయం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో యోగీ సర్కార్ తీసుకువచ్చిన ‘మీడియా విధానం’ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది.
దేశంలో బ్రాడ్ కాస్టింగ్ తీసుకురావడం ద్వారా మీడియాపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న మోడీ సర్కార్ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నించింది. దానిపై తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మోడీ ప్రభుత్వం ఆ బిల్లును పక్కన పెట్టింది. కానీ, యోగీ తమ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా విధానాన్ని రూపొందించారు. తమ ప్రభుత్వాన్ని పొగిడే వారికి నెలకు ఎనిమిది లక్షలదాకా వ్యాపార ప్రకటనల రూపంలో ఆదాయం వచ్చే దారి చూపిస్తారట. అదే వారి ప్రభుత్వంలో లోపాలను తెలియజేసే వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇది వారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, విద్వేష పూరిత విధానాలను ఎండగట్టే వారిని సహించేదిలేదని హెచ్చరించడానికే రూపొందించిన విధానం.
ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సేకరించటం, ప్రచురించటం, ప్రసారం చేయడం మీడియా బాధ్యత. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం వాటిల్లకుండా ఎక్కడ, ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కు. ఈ హక్కులను తగిన విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాలది. పాలనలో పారదర్శకత, ప్రవర్తనలో ప్రజా విధేయత ఉన్న పాలక పక్షాల నుంచి దాపరికం లేని సమాచారాన్ని ఆశించవచ్చు. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వాల నుంచి, నిజాలను మాట్లాడితే సహించలేని పాలకుల నుంచి పచ్చి నిరంకుశ ధోరణులను ఎదుర్కోవల్సిన దుస్థితిలోకి నేడు మీడియా నెట్టివేయబడింది.
దృశ్య, శ్రవ్య మాధ్యమాలకు తోడు డిజిటల్ మీడియా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పత్రికలు, ప్రసార సాధనాలు చాలావరకు ప్రభుత్వం గుప్పెట్లో బంధి అయి అధికార పక్షానికి బాకా వ్యవస్థలుగా మారిపోయాయి. మోడీ ప్రభుత్వ హయాంలో మన దేశంలో పత్రికాస్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ దారుణాతిదారుణంగా హరించుకు పోయాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో నడిచే ప్రధాన మీడియాపై బీజేపీ గట్టి నియంత్రణ సాధించింది. దాని ఏలుబడిలో ఎన్ని విధానపరమైన వైఫల్యాలు జరిగినా, ఎన్ని వ్యూహాత్మక విద్వేషాలు రగిలినా మీడియా నుంచి పొగడ్తలను, సమర్ధింపులను మాత్రమే కోరుకుంటోంది. కొద్దిపాటి ప్రజాపక్ష మీడియా సంస్థలూ, కొంతమంది జనహిత జర్నలిస్టులూ వారి పాలనా వైఫల్యాలను, దుర్మార్గాలను గొంతెత్తి చెప్పబోతే దారుణమైన అణచివేతకు, వేధింపులకూ బరితెగిస్తోంది.
జర్నలిస్టు కప్పన్‌పై ఉపా కేసు బనాయించి రెండేండ్లు జైల్లో ఉంచింది. సామాజిక కార్యకర్త దిశారవిని తీవ్రంగా వేధించింది. రైతు ఉద్యమ వార్తలను రాసినందుకు న్యూస్‌క్లిక్ సంపాదకుడు పుర్కాయస్తపై దేశద్రోహ కేసు బనాయించి, జైల్లో పెట్టింది. ప్రజల పక్షాన రాసిన, మాట్లాడిన అనేకమంది జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధించటం, దాడులు చేయించటం, తీవ్రమైన కేసులు మోపటం వంటి కక్షపూరిత చర్యలతో భయోత్పాతం సృష్టించటం ఒక విధానంగా కొనసాగిస్తోంది. ఈ కుట్రపూరిత ఆచరణ వల్లనే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మనదేశం పత్రికాస్వేచ్ఛలో ప్రపంచంలో 161వ స్థానానికి దిగజారిపోయింది!
అయినా తగ్గేదే లేదన్నట్టు యోగీ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేక డిజిటల్ మీడియాను కట్టడి చేయడానికి నూతన డిజిటల్ మీడియా విధానాన్ని తెర మీదకు తెచ్చింది. దీనికి యోగి కొలమానాలూ సైతం నిర్దేశించారు. వెరసి యోగీ ప్రభుత్వం ”సంఘ వ్యతిరేక”, ”జాతి వ్యతిరేక” ప్రచారం చేసే వారిని చట్ట రీత్యా శిక్షిస్తారు. ఇది కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేయడమే. గుణ దోష నివారణ ప్రభుత్వాల గుప్పెట్లో ఉండటం అత్యంత ప్రమాదకరం. భావ ప్రకటన, పత్రికాస్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని కఠినంగా తొక్కిపెట్టాలనుకోవడం నియంతృత్వానికి దారి తీస్తుంది. పీటీఐ వార్షికోత్సవంలో ‘మీడియా ఒత్తిడులకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ప్రజలకు నిజాలు తెలియజేయాలి. దేశాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ ది కీలక పాత్ర’ అన్న రాష్ట్రపతి మాటలకు యోగీ సర్కార్ చేతలతో విలువ లేకుండా చేసింది. హిట్లర్ తదితర నియంతలు ఇలాంటి అణచివేత చర్యలకే పాల్పడి, చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. ఈ పాలకులు కూడా ఆ దిశగానే పరుగులు పెడుతున్నారు.