గోపీచంద్‌ అకాడమీలో యోనెక్స్‌ స్టోర్‌

– అందుబాటులోకి అత్యుత్తమ ఉపకరణాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ హబ్‌ హైదరాబాద్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రీడా ఉపకరణాలను అందించేందుకు ప్రముఖ షటిల్‌ ఉపకరణాల ఉత్పత్తుల సంస్థ యోనెక్స్‌ ముందుకొచ్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ల కార్ఖానా పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో యోనెక్స్‌ సంస్థ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్‌ను ఆరంభించింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ గోపీచంద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌తో పాటు సన్‌రైజ్‌ స్పోర్ట్స్‌ ఎండీ విక్రమాదిత్యధర్‌ పాల్గొన్నారు. ‘కొన్నేండ్లుగా భారత బ్యాడ్మింటన్‌తో కలిసి నడుస్తున్నాం. రానున్న కాలంలోనూ భారత్‌ సాధించబోయే విజయాల్లో భాగం అవుతామని’ సన్‌రైజ్‌ స్పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్యధర్‌ అన్నారు. ‘భారత బ్యాడ్మింటన్‌లో యోనెక్స్‌ది చెరగని ముద్ర. ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత షట్లర్లు విజయాలు సాధించటంÊ మరువలేనిది’ అని పుల్లెల గోపీచంద్‌ అన్నారు. భారత్‌లో దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బ్యాడ్మింటన్‌ క్రీడ అభివృద్దికి కృషి చేస్తామని ఈ సందర్భంగా యోనెక్స్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.