భగభగమండే ఎండుంది. నిప్పులు కురిసే ఎండుంది. మండుటెండలో కాలుగాలిన పిల్లుంది. కుయ్యోమొర్రోమంటుంది.
కుయ్యోమొర్రో పిల్లికి కాలిన కాలుంది. కాలిన కాలుతో కుంటుతూ గెంతుతు వచ్చింది. కాలవ గట్టుకు వచ్చింది. కాలుకాలిన పిల్లిది కాళ్ళు మూటితో పరుగుపరుగునా వచ్చింది. ఏటి నీటిలో కాలేకాలుని ముంచెత్తింది. కొంచెం ప్రాణం వచ్చింది. వచ్చిన ప్రాణం మోస్తూ చెట్టుకిందకి చేరింది.
గడ్డిపురుగుపై వీపుకి కితకితలయ్యేయి. ఇటు దొర్లిందటు దొర్లింది. తోక ఊపుతూ దొర్లింది. తోక తోక వలెనే ఉంది. తోకకు ఢోకాలేదంది. తోకే ఊగుతూ చెప్పింది.
కాలు గాలిన పిల్లికి వాసన వచ్చింది. నీరసపడుతూ దిగాలు పడుతూ వాసన వచ్చిన చోటున చూపునిలిపింది.
పరుగులు పెడుతూ వచ్చింది. పరుగుపరుగునా వచ్చింది. గెంతుతూ దుముకుతూ వచ్చింది. చిన్నది నల్లది వచ్చింది. ఎలకొకటక్కడి కొచ్చింది. ఎలుకతోకకు నిప్పుంది. కాలే తోకతో వచ్చిన ఎలక కాలవనీళ్ళలో మునిగింది. తోకకు నిప్పు చప్పున చల్లారేసింది. హుషారుగా బల్‌పసందుగా గెంతిందెలక గట్టు మీదకీ, చెట్టు కిందకీ.
చెట్టు కిందనే కాలుగాలిన పిల్లుంది. పిల్లికి మండే కాలుంది. ఎలక్కి సంకటమయ్యింది. వణుకుతూ బెదురుతూ వెనక్కి తగ్గినించుంది. ఏ వైపెళితే బతుకు ఎలుకడా అనవచ్చోనని చూసింది.
ఎలుకా ఎలుకా ఎక్కడికెళ్తవు. కాలుగాలిన పిల్లిన నేను కదిలే పిల్లిని కానే కాను. ఎగిరే దుమికే ఓపిక లేదు. నమిలే మింగే పళ్ళే లేవు. కాలుగాలిన పిల్లిని నేను. తోక కాలిన ఎలుకవి నీవు. నీ బాధేమిటో నాతో చెబుదూ నా బాధేమిటో నీతో చెబుతా అన్నది పిల్లిది.
మండిన తోకతో ఉన్న ఎలక్కి పిల్లికాలు కనిపించింది. కాలినట్టు తెలిసొచ్చింది.
నా బాధేమిటో చెప్తా కానీ పిల్లీ పిల్లీ కాలే కాలూ నీకెక్కడిది. నీ కాలెట్లా కాలింది అన్నది చిన్నది ఎలకది. తోక మండిన ఎలక్కి పిల్లి బదులిచ్చింది.
నలుగురు కలిసి తెచ్చారు. నాలుక్కాళ్ళు పంచారు. గోదాములూ నన్నుంచారు. నీ వాళ్ళని చూపించారు. నమిలే డ్యూటీ ఇచ్చారు. ఎంత లావుగా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారో ఎంత గెంతినా చిక్కరు ఒక్కరు.
ఎలక కిచకిచా నవ్వింది. కిసుక్కు కిసుక్కు నవ్వింది. మా వాళ్ళిప్పుడు ఏమనుకున్నవు. దొరికిన వాటిని తెగ మెక్కేసి పంది కొక్కులైపోయేరు.
నిజం సుమీ నీవన్నది నిప్పుసుమీ. ఎలుకలన్ని పందికొక్కులై చిక్కక దొరక్క బెంబేలెత్తించేయి. అందీ అందక ఆడంచేయి. అందీ నవిలితె పళ్ళూడేయి. దూకినప్పుడొక కాలిరిగింది.
అరెరే సారీ ఆసుపత్రికీ వెళ్ళావా మరి మందూ మాకది వేసేవా అన్నది ఎలుకది జాలి అన్నది కొంచెం ఉన్నది.
వెళ్ళానక్కడ గగ్గోలు. మందులు కొరతతో చచ్చారెందరో. ఏడ్చేవాళ్ళను చూసేనోరు. నవ్వలేక నేనేడ్చోనోరు. డాక్టరు వాడు రానేలేదు. వార్డు బారు ఒక సర్జరీ చేస్తే పేషెంటాపైలోకంపోయే. డాక్టరు చెప్పిన సూదిని మరిని మరేదో జబ్బుకు గుచ్చి నర్సొక ప్రాణం చీటి చింపె. కాలికి కట్టిన కట్టుతో నేను, ప్రాణభయంతో కుంటుతూ వచ్చి వెలిగే దీపం పడేసి ఇదిగో కాలుగాలిన పిల్లయ్యాను. కాలుగాలిన పిల్లిని నేను గోదామంత బూడిద అయితే కాలవ గట్టుకు పరుగెత్తేను. ఇదిగో ఇలాగ పడి ఉన్నాను అన్నది పిల్లిది. నా కథ ఇంతే నీ కథ ఏమిటో చెపితే వింటా అన్నది పిల్లది కాలుకాలిన క్యాటది.
తోలు మండిన ఎలుక ఇప్పుడు చెప్పిందీ కథ. నేనూ నా కుటుంబ సభ్యులు ఉండే హాలులో హాయిగా తిరుగుతూ తింటూ ఉంటే ఊయలలూగుతూ ఉషారుగుంటే మీటింగంటూ నచ్చారెందరో. మీటంగంటూ అయ్యిందా ఈటింగంటూ ఉంటుందేమో తిండీ గిండీ దండిగ దొరికే ఛాన్సొచ్చిందని కలుగులలో దాక్కున్నాము. మా వొంతెప్పుడోనని కాసుక్కూచున్నాము. మాటలు కోటలు దాటాయి. కోపాల్ తాపాల్ రెచ్చాయి. బూతుకూతలు మాకేం తెల్సు. గిరగిర గిరగిర కుర్చీలెగిరేయి. ఇటు విసిరేరా అటు విసిరేరా ధన్‌ధన్ ఫట్ ఫట్ మన్నవిగా బొంగరాలలా తిరిగే వాటిని చూసి మీటింగేమిటో తెలిసొచ్చింది. అదిరీ బెదిరీ పోయేము తోకలు ఊపుతే పరుగెత్తేము.
మరోచోటుకై వెదుకుతు ఉంటే పెద్ద మనుషులా ఇంట్లో సవ్వడి వినిపించింది. పబ్లిక్ ఫిగరని తెలిసొచ్చింది. వెళ్దామని నేనంటేను మా వాళ్ళెందుకొ వద్దన్నారు. పెద్ద మనుషుల జోలికి వెళ్తే తోకకి ముప్పే నిప్పే అన్నారు. అయినా నేనది విన్లేదు. పెద్ద మేడలో కురిసేను. అననుకోకుండా పడ్డాను. పడ్డది నేనది బోనది తెలిసే వేళకు లేటయ్యింది. చిక్కిన బోనులో ఒళ్ళు ముడ్చుకుని కూచున్నాను. బోను తెరిస్తే పరుగు పరుగునా పరుగెడదామని కాచుకునే నే ఉన్నాను. పెద్ద మనుషుల బుద్ధులు తెలీక మోసం దగా అనేవి ఎరుగక ఎలుకను నేను చిక్కాను.
అప్పుడెవ్వడో వచ్చాడు. తోక పట్టుకుని లాగాడు. బోను సందున లాగిన తోకకు గుడ్డఉ చుట్టాడు. చుట్టిన గుడ్డకు నిప్పంటించి బోను మూతను తెరిచాడు. మండే తోకతో ఎటుపోవడమో తెలీక నేను ఎటుపడితే అటు పరుగెత్తాను. భగభగమంటలు మండించాను. బూడిద కుప్పలు మిగిలించేను. ఆపై తోకను చల్లబరచగా కాలవ గట్టుకు వచ్చేను. కాలు గాలిన పిల్లివి కనుక నీముందిలాగ నిలిచేను. కాలుగాలిన పిల్లివి నీవు. తోక కాలిన ఎలుకను నేను.
పదవేలేని నాయకుడైతేం, పంజాలేని పులి అది అయితేం, కాలు గాలి పిల్లే అయితేం నోరు మూసుకుని ఉండాల్సిందే అన్నది పిల్లిది నవ్వలేక నవ్వుతూ అన్నది.
‘కాలిన కాలు మండిన తోక చెప్పేదేమిటి ఓ ఫ్రెండూ!’
‘పెద్ద వాళ్ళమని విర్రవీగుతూ బడుగు జీవులు హింసలు పెడితే మిగిలేదేమిటి బూడిదె’ అన్నది తోక మండిన ఎలుకది.
‘పిల్లీ ఎలుకా ఫ్రెండ్సవుతాయి. పార్టీ ఒక్కటె అయినా మనుషులు కొట్టుకు ఛస్తారెందుకో’ అన్నది.
‘నువ్వూ నేనూ ఒకటైనా సరే నువ్వా? నేనా? అనే వారలే లోకాలేలే నాయకులంటా’ అన్నవి ఎలుకా పిల్లీ జమిలిగ మళ్ళీ మళ్ళీ!
చింతపట్ల సుదర్శన్
9299809212