‘మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కింది’ లాంటి సామెతలు యదాలాపంగా వాడుతూ, మాట్లాడుతూ ఉంటాం. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా అసలు సమస్య ఉన్నది. మన దేశంతో సహా ప్రపంచ దేశాల్లో సుమారు నూటికి 30 మంది స్త్రీలు భర్తల చేత దెబ్బలు తింటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) 5 కూడా ఇదే చెప్తోంది. ‘మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు దెప్పినందుకు’ లాంటి సామెతలు కూడా వాడేస్తుంటాం. అంటే మొగుడు చేతిలో దెబ్బలు తినడానికి సిద్ధపడతాం. కానీ ఇంటిగుట్టు బయటకు రావద్దు. అందుకే నూటికి 87 మంది ఆడవాళ్లు తమ మీద జరుగుతున్న దౌర్జన్యాలు బయటికి చెప్పనే చెప్పరంట. ఇది కూడా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్టే చెప్తుంది. ‘ఏదో కుటుంబాల్లో గొడవలు వస్తుంటాయి, సరిపెట్టుకో రాదూ’ అని చుట్టూ ఉన్న బంధు మిత్ర వర్గం ఉచిత సలహాలు పారేస్తుంది. కానీ ఇది సరిపెట్టుకునే సమస్యలాగా లేదు. ఇది ఎవరో ‘మహిళా మండలి వాళ్ళు’ చేసే గోల మాత్రం కాదు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్తోంది. స్త్రీల పైన యదేచ్ఛగా సాగే హింస కారణంగా ఆడవాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుందని, జీవితాంతం వాళ్లకి ఆరోగ్య సమస్యలు ఏదో ఒక రూపంలో వస్తున్నాయని చెప్తోంది. ఈ హింస కారణంగా కుటుంబంలో పిల్లల పైన కూడా ఏదో ఒక రకంగా ప్రభావం పడుతోందని చెప్తుంది. మగ పిల్లలు పెళ్ళాన్ని, తల్లిని, ఆడవాళ్ళని వేధించడం సహజం అనుకుంటే ఆడపిల్లలు హింసను భరించటం మన తలరాత అని అనుకునే పరిస్థితి ఉంటుంది.
ఎందుకీ హింస? మూలం ఎక్కడీ
ఆసియా దేశాల్లో హింస చాలా ఎక్కువ ఉంటుంది. పారిశ్రామిక విప్లవాలు వచ్చిన యూరప్, అమెరికాలో కూడా హింస ఉన్నా, కనీసం ఇది తప్పు అనే భావం కూడా బలంగా ఉంటుంది. స్త్రీలు హింసకు ఎదురు తిరిగి పోరాడే తత్వమైనా ఉంటుంది. అయితే మన దగ్గర అలా కాదు. సీతా, సావిత్రి కథలు మన నోళ్లు ముగిస్తాయి. ఇది ఒక భాగం అయితే మనలాంటి దేశాల్లో స్త్రీల శ్రమకు గుర్తింపు చాలా తక్కువగా ఉండటం కూడ ఒక కారణం. ఆడవాళ్లు చాకిరీ చేయక కాదు. కానీ వాళ్ళ శ్రమకి ఎక్కడా గుర్తింపు ఉండదు. ‘పెయిడ్ ఎంప్లాయిమెంట్’ వేతనంతో కూడిన ఉపాధి అని ఏదైతే అంటుంటామో ఆ వేతనంతో కూడిన ఉపాధి కొన్ని పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో రైతు, వ్యవసాయ కుటుంబాల్లో స్త్రీలు మగవాళ్ళకన్నా ఎక్కువే చాకిరీ చేస్తారు. దాని పని అంటానికి లేదు చాకిరి అనటమే సరైనది. కానీ ఆ చాకిరికి ఎక్కడా ఏ ప్రభుత్వం లెక్క కట్టదు. అనివార్యంగా ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తను వదిలి పోవడానికి లేదు. పక్షికైనా గూడున్నదే మోగాని స్త్రీకి నాది అని చెప్పుకునే ఇల్లు లేదు. ఇల్లు అయినా, పొలం అయినా ఆమె పేరుతోటి ఉండేది చాలా తక్కువ మందికి. ‘పో’ అంటే ఇంట్లో నుంచి పోవాల్సిందే. దానికి తోడు ఆడవాళ్ళకి చదువులు తక్కువ. బయటకు పోయి ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికే అవకాశాలు తక్కువ. ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఎదురు తిరిగే మనస్తత్వమూ తక్కువ. హింసను మౌనంగా భరించక తప్పని పరిస్థితి.
మనువాదం వాట తక్కువేం కాదు
బాలికైనా, యువతైనా, ముసలిదైనా స్త్రీ స్వతంత్రించి గృహ కార్యాలను చేయరాదు. బాల్యంలో తండ్రి చెప్పు చేతల్లోనూ, యవ్వనంలో భర్త అధీనంలోనూ, భర్త మరణానంతరం పుత్రుని అధీనంలోనూ ఉండాలి. స్త్రీ స్వేచ్ఛగా ఉండరాదని మనువు శాసనం. స్త్రీ తన తండ్రిని, భర్తను, కొడుకులను ఎన్నడు విడిచి ఉండరాదు. అట్లు వీరికి దూరంగా ఉండాలని కాంక్షిస్తే మాత పితరుల వంశాలు రెండింటికి చెడ్డ పేరు వస్తుంది. భర్తకు తన పట్ల ఇష్టం ఉన్నా లేకున్నా భార్య చిరునవ్వుతో ఉండటం, ఇంటి పనులలో నేర్పరితనాన్ని కలిగి ఉండటం, గృహ సామగ్రిని పదిలంగా అమర్చడం, పొదుపుతనాన్ని కలిగి ఉండాలి (147, 148, 149, 150). చూడండి ఎంత చక్కగా సెలవిస్తున్నాడో భర్తకి తన మీద ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చిరునవ్వుతో ఉండాలి అంట. చూశారా? భర్త ఎటువంటి వాడైనా అతన్ని నిరాదరణ చేయకూడదట. అతనే దేవుడని పూజించాలి అంట. ఇన్ని మంత్రాలు, ఉపోద్ఘాతాలు మన నెత్తిమీద తట్టలకొద్దీ కుమ్మరించాక ఇంకా మన గురించి మనం ఆలోచించే ధైర్యం ఎక్కడిది, ఓపిక ఎక్కడిది, ఎదురు తిరిగే శక్తి ఎక్కడిది.
చట్టాల దారి చట్టాలదే!
దీర్ఘకాల స్వాతంత్ర ఉద్యమం అందులో అంతర్భాగంగా సాగిన మహిళా ఉద్యమం ఫలితంగా కొన్ని చట్టాలు అయితే వచ్చాయి. హిందూ వివాహ చట్టం, బాల్య వివాహ నిరోధ చట్టం, భారత శిక్షా స్మృతిలో వరకట్న మరణానికి సంబంధించిన కొన్ని సవరణలు వంటివి వచ్చాయి. ఎన్ని చట్టాలు ఉన్నా స్త్రీ ధర్మాలు సాంప్రదాయాల పేరుతో స్త్రీలను లొంగదీసే భావాలు భావోద్వేగాలకు కొరవలేదు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు మహిళా లోకం రుణపడి ఉంటుంది. మనుధర్మ శాస్త్రాన్ని అందుకే దగ్ధం చేశాడేమో.
– ఎస్.పుణ్యవతి