నువ్వా..నేనా..!

You..me..!– కాకపుట్టిస్తున్న పాలిట్రిక్స్‌
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మైండ్‌ గేమ్‌..
– ఫలితాలు రాకముందే ప్రభుత్వ ఏర్పాటుకు పోటాపోటీ..
– నాలుగున క్యాబినెట్‌ అంటూ కేసీఆర్‌ ప్రకటన
–  తొమ్మిదిన ప్రమాణ స్వీకారం, అదే రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతంటున్న రేవంత్‌
–  మానసికంగా పై చేయి సాధించేందుకు రెండు పార్టీల వ్యూహం
‘ఆలూ లేదు.. చూలూ లేదు…’ అన్నట్టుగా ఉంది ఇప్పుడు అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీరు. పరస్పరం మైండ్‌ గేమ్‌ ఆడటం ద్వారా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు రెండు పార్టీలూ తెగ తాపత్రయ పడుతున్నాయి. అసెంబ్లీకి ఎన్నికలు ముగిసి 24 గంటలైనా గడవకముందే, ఫలితాలు వెలువడటానికి ఇంకా రోజున్నర సమయముండగానే ప్రమాణ స్వీకారంపై గులాబీ, హస్తం పార్టీలూ వెలువరించిన ప్రకటనలు… ఆసక్తికరంగానే కాదు, అంతకు మించి అతిశయోక్తిగానూ అనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌లు పోటాపోటీగా ఇస్తున్న స్టేట్‌మెంట్లు చర్చనీయాంశమవుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాధారణ రోజుల మాదిరిగానే (ఎన్నికల కంటే ముందు) డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఈనెల నాలుగున మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్‌ సమావేశమవుతుందంటూ ఆయన టైమ్‌తో సహా చెప్పేశారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి సైతం తమ పార్టీ కచ్చితంగా గెలిచి తీరుతుందనీ, 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని, అదే రోజు క్యాబినెట్‌ సమావేశం జరిపి, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామంటూ ప్రకటించటం విశేషం.
పోలింగ్‌ ముగిసి, ఆదివారం ఫలితాలు వెలువడనుండగా గురువారం సాయంత్రం నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు మైండ్‌ గేమ్‌ ఆడటం మొదలు పెట్టాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువ శాతం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపటంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో కాస్త నిరాశ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం, ప్రతికూల పవనాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు డీలాపడిన పరిస్థితి కనిపించింది. దీన్ని గమనించిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వారిలో జోష్‌ నింపేందుకు ప్రయత్నించారు. ‘ఎగ్జిట్‌పోల్స్‌ను చూసి కంగారు పడొద్దు…మనమే గెలుస్తున్నాం…’ అంటూ ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించారు. ఇక కాంగ్రెస్‌ గెలుస్తోందన్న అంచనాతో ఉన్న రేవంత్‌… ఏకంగా ‘సంబురాలు చేసుకోవచ్చు…’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇలా ఈ రెండు పార్టీల మైండ్‌ గేమ్‌ సాగుతుండగా… ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌, రిపోర్టులతో సంబంధం లేకుండా తమ పని తాము పూర్తి చేశారు. వారితోపాటు నేతలు సైతం ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ఇప్పుడందరూ ఏయే ప్రాంతాల్లో ఏ పార్టీ, ఏ అభ్యర్థి గెలుస్తారు..? మెజారిటీ ఎంత..? అనే చర్చోప చర్చల్లో ముగినిపోయారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇవి వేలు, లక్షలు దాటి కోట్లకు చేరుకున్నాయి. ఈ రకంగా రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లు ఓటింగ్‌ ముగిసిన తర్వాత కూడా మరింత కాక పుట్టిస్తున్నాయి.