– 20 ఏండ్ల నుంచి లోక్‌సభ పోరులో కాంగ్రెస్, బీజేపీ
– యూపీఏతో హస్తం.. ఎన్డీయేతో కమలం
– 2004 నుంచి కొనసాగుతున్న ఎన్నికల వైరం
– చెరో రెండు టర్మ్‌ల చొప్పున పూర్తి చేసిన రెండు కూటములు
– ప్రస్తుతం ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్.. ఎన్డీయేగానే బీజేపీ
– ఆసక్తి రేపుతున్న 2024 లోక్‌సభ ఎన్నికలు
న్యూఢిల్లీ : భారత్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్.2004 లోక్‌సభ ఎన్నికల నుంచి ఈ రెండు పార్టీలు ఎన్నికల సంగ్రామంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి.. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటములు ఏర్పడి.. 2004 నుంచి ఆసిక్తకర పోరును కనబరుస్తున్నాయి. ఈ రెండు కూటములూ చెరో పదేండ్లు దేశాన్ని పాలించాయి. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో పోటీ ఎలా ఉండబోతుందున్నది రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. దేశంలోని సాధారణ ప్రజల్లోనూ ఆసక్తిని రేపుతోంది..
2004లో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌కు పవర్
అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లటంతో 2004 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 14వ లోక్ సభకుగానూ ఈ ఎన్నికలు ఏప్రిల్ 20 నుంచి మే 10 మధ్య నాలుగు దశల్లో జరిగాయి. అయితే, ఆ ఎన్నికలు బీజేపీకి షాక్‌ను కలిగించాయి. కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చింది. బీజేపీ కంటే కాంగ్రెస్ ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ పొందింది. అయితే, యూపీఏలో పలు పార్టీల చేరికతో కూటమి మెజారిటీ 225 స్థానాలకు చేరింది. దీనికి అదనంగా, కూటమికి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కేరళ కాంగ్రెస్ (కేసీ), లెఫ్ట్ ఫ్రంట్‌లు బయటి నుంచి మద్దతునిచ్చాయి.
2009 ఎన్నికల్లో కీలక మలుపులు
దేశవ్యాప్తంగా 2009లో 15వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ-2 మరింత బలాన్ని ప్రదర్శించి.. కిందటి ఎన్నికల కంటే ఎక్కువ సీట్లే సాధించింది. కాంగ్రెస్ ఒంటరిగా 206 సీట్లు గెలుచుకున్నది. బీజేపీ 116 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రధాని కావాలన్న బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో అప్పటి వరకు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి.. అద్వానీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకెళ్లిన ఎన్డీయే ఓటమి కలిసి వచ్చింది. 2013లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకెళ్లటానికి దారి తీసిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎన్ గోపాలస్వామి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా మధ్య బహిరంగ వాగ్వాదం చోటుచేసుకోవటం మరో విశేషం. గోపాలస్వామి తన ”పక్షపాత” పాత్రలో చావ్లాను తొలగించాలని రాష్ట్రపతిని కోరే స్థాయికి వెళ్లారు.
మోడీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ
ఇక 2014, 2019 ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అధికారాన్ని అందించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకొని మోడీ నియంతృత్వ, ఏకపక్ష ధోరణిలో ముందుకెళ్లారనే విమర్శలూ ఉన్నాయి. ఇలా, 2014లో బీజేపీ 282 ఎంపీ సీట్లను, 2019లో 303 సీట్లను సాధించింది. మొత్తంగా ఎన్డీయే సీట్లు 353కు చేరుకున్నాయి. అదే సమయంలో, కాంగ్రెస్ ఎన్నడూ లేని స్థాయికి పడిపోయింది. 2014లో 44 సీట్లకే పరిమితమైంది. 2019లో కేవలం 8 సీట్లను పెంచుకొని 52 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ రెండు ఎన్నికల్లోనూ ‘అధికారిక’ ప్రతిపక్షపార్టీ హౌదాను సైతం ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.
కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన పొత్తులు
అనేక రాష్ట్రాల్లో మంచి పొత్తులు పెట్టుకున్న కారణంగానే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విశ్లేషకులు వివరించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత సైతం యూపీఏకు కలిసి వచ్చిందని అన్నారు. చాలా మంది పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు పోస్టాఫీసులు, బ్యాంకులలో వారి డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గటంతో విసిగిపోయారనీ, ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఓటమికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
కూటమి నుంచి ఒత్తిళ్లు.. దీటుగా ఎదుర్కొన్న సోనియా
సోనియా గాంధీ తన సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటూ.. 2004లో మన్మోహన్ సింగ్‌ను యూపీఏ ప్రభుత్వానికి అధిపతిగా నియమించాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ, ఆమె జాతీయ సలహా మండలికి నాయకత్వం వహించారు. ఇది ప్రభుత్వంపై పర్యవేక్షణ చేసే ఒక అదనపు రాజ్యాంగ సంస్థ. ఈ అంశంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఫలితంగా, ఇది అప్పట్లో ఒక సమాంతర శక్తి కేంద్రంగా మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. యూపీఏ కూటమి భాగస్వాముల నుంచి అనేక అసమంజసమైన డిమాండ్లు వచ్చినప్పటికీ.. సోనియా, మన్మోహన్ ద్వయం వాటిని ఎదుర్కొన్నది. 2012లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దినేష్ త్రివేదిని తక్షణమే తొలగించాలని మమతా బెనర్జీ పట్టుబట్టడం దీనికి ఒక ఉదాహరణ. అదేవిధంగా, 2జీ కుంభకోణంలో డీఎంకేకు చెందిన ఎ. రాజా టెలికాం మంత్రిగా కొనసాగటానికి సంకీర్ణ ధర్మమే కారణమని మన్మోహన్ సింగ్ బహిరంగంగా అంగీకరించారు. డీఎంకే ఒత్తిడి మేరకు యూపీఏ ప్రభుత్వం మెట్టు దిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఆ సమయంలో కూటమి భాగస్వాముల నుంచి వచ్చిన ఒత్తిడులు, వాటిపై నిర్ణయం తీసుకునే స్థితిలో ప్రధాని లేకపోవటం.. వంటి కారణాలతో ఇది ప్రభుత్వం పని తీరుపై ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు చెప్పారు.
ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాలే
ఇక 2024లో 18వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉన్నది. దీంతో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవటానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సహా పలు పార్టీల ‘ఇండియా’ కూటమి వ్యూహాలు పన్నుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, మహిళలు, మైనారిటీలపై దాడులు, మత హింస, మణిపూర్, సీఏఏ, ఎన్నార్సీ, రైతుల నిరసనలతో పాటు పలు అంశాలు మోడీ సర్కారుకు ఈ ఎన్నికల్లో సవాలుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.