మీరే వారధులు..

You are the bridges..– ప్రజాపాలనను విజయవంతం చేయండి
– ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ
– 28 నుంచి జనవరి 6 వరకు
– గ్రామసభల్లోనే లబ్దిదారుల ఎంపిక
– మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం…తప్పుచేస్తే సహించం : కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అధికారులే వారధులు అనీ, తమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విజయవంతం చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉన్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటామనీ, తప్పుచేస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఆదివారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు వివరించారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వాటిలో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామనీ, మిగిలిన గ్యారెంటీల లబ్దిదారుల ఎంపిక కోసం ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ‘ప్రజాపాలన’ పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దీనికోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా, అధికారులే క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలనీ, లబ్దిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. ప్రజల నుంచి ధరణి సహా అన్ని రకాల ఫిర్యాదుల్నీ స్వీకరించాలనీ, హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగినట్టే అన్ని జిల్లాలు, మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజాపాలన ఇలా…
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ గ్రామ సభలను నిర్వహిస్తుంది. పోలీసు డిపార్ట్‌ మెంట్‌ వీటిని సమన్వయం చేసుకోవాలి. ప్రతి రోజు రెండు సభలు రెండు గ్రామాల్లో చేయాలి. మండలంలో రెండు టీంలు ఉంటే ఒక టీంకు ఎమ్మార్వో, మరో టీంకు ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారు. ప్రజా పాలన కోసం శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను డిప్యూట్‌ చేస్తాం. 119 నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తాం. ప్రతి మండలాన్ని వర్టికల్‌ కింద డివైడ్‌ చేస్తారు. ఒక వర్టికల్‌కు ఎమ్మార్వో, మరో వర్టికల్‌కు ఎంపీడీవో బాధ్యత వహిస్తారు. వారి క్రింద ఆఫీసర్స్‌ స్ట్రక్చర్‌ ఉంటుంది. ప్రతి అధికారి రెండు గ్రామాలకు వెళ్లాలి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామంలో దరఖాస్తులు తీసుకోవడం వంటి పనులు చేయాలి. పోలీసు డిపార్టుమెంట్‌తో పాటు స్పెషల్‌ ఆఫీసర్‌ స్థానికంగా సమన్వయం చేసుకోవాలి. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలి. మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి. వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, దరఖాస్తులు తీసుకోవాలి. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రారంభ వాక్యాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి. ప్రభుత్వం ఉద్దేశ్యం, లక్ష్యాలను వివరించాలి. వాటిని ఎలా అమలు చేయబోతున్నామనే విషయాలు చెప్పాలి. నిరక్షరాస్యులు గ్రామ సభలకు వస్తే, అంగన్‌ వాడీ, ఆశావర్కర్ల వంటి చదువుకున్న వారు ఎవరైనా వారి దరఖాస్తులను నింపి సహకరించాలి.
ఏర్పాట్లు చేయండి
గ్రామసభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు కావాల్సిన నిధులను తక్షణం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఎస్పీలు ఎవరైనా సరే స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని అన్నారు.
ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వండి
కేవలం మేం చెప్పింది చేయడమే కాదు. దానిలోని లోటుపాట్లు, ఆ స్కీం ఫీడ్‌బ్యాక్‌ కూడా మీరే ఇవ్వాలి’ అని చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి కోతలు పెట్టబోమని స్పష్టంచేశారు. ధరణి పోర్టల్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. దానికోసం ఏం చేయాలో అభిప్రాయాలు చెప్పమని అధికారుల్ని కోరారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలనీ, అదే స్థాయిలో నకిలీ విత్తనాలనూ అరికట్టాలని ఆదేశించారు.
ఇదీ మీ పాత్ర
ప్రజాస్వామ్యంలో అధికారుల పాత్రను గుర్తుచేశారు. ”అభివద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో, అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపెడితే, దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది చివరి వరుసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్టు” అని స్పష్టం చేశారు. ఆ లక్ష్యం కోసమే చివరి వరుసలో నిలబడిన తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లో పేదవారి కోసమే ‘ప్రజాపాలన’ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ, ఆయన మార్గంలో ఐఏఏస్‌, ఐపీఎస్‌లు నడవాలని కాంక్షించారు.
ఫ్రెండ్లీ సర్కార్‌…
”మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్‌. మీరు ప్రజలచేత శభాష్‌ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుంది. మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశ్యపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నా, మీ పనితీరును కచ్చితంగా సమీక్షిస్తాం” అని హెచ్చరించారు.
తెలంగాణ పరిస్థితులు వేరు
”ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు. తెలంగాణ పరిస్థితులు వేరు. ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మాభిమానాన్ని కోల్పోతే సహించరు. అధికారులు ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను అర్థం చేసుకొని పరిష్కారం చూపించాలి’ అని చెప్పారు. అలాగే ఐపీఎస్‌ అధికారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ”తెలంగాణ ప్రాంతం ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రం. అనేక రకాల భావజాలాలతో, పౌర హక్కుల కోసం ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రభుత్వాలు నిషేధించిన సంస్థలు కూడా ఇక్కడ ప్రజల తరపున పోరాటాలు చేశారు. ప్రభుత్వం చట్టాలు అమలు చేసేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పౌరులతో ఉండాలే కానీ, క్రిమినల్స్‌తో కాదు” అని తేల్చిచెప్పారు. ‘పోలీసు శాఖలో వేర్వేరు విభాగాలను దేనికోసమైతే ఏర్పాటు చేశారో, వాటి లక్ష్యాలు నెరవేరాలి’ అని స్పష్టం చేశారు. ‘నేరాల విధానం మారింది. సైబర్‌ క్రైం పెరిగింది. దానిపై దృష్టి పెట్టండి’ అని దిశానిర్దేశం చేశారు. ‘సన్‌ బర్న్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపండి. ఎంతటివారైనా ఉపేక్షించొద్దు. ఈ విషయంలో పోలీసు అధికారులకు సంపూర్ణ అధికారాలు ఇస్తున్నాము’ అని చెప్పారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరమైనవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ‘పోలీసులు డ్రగ్‌ మాఫీయాతో సంబంధమున్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తుంది. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్‌ చేయడం లేదు. అవసరమైతే చట్టాన్ని సవరించుకోండి’ అని చెప్పారు. కుల మతాల మధ్య వైషమ్యాలు పెంచేలా సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారి సమాచారం సేకరించి, నియంత్రణలోకి తెచ్చుకోవాలి అని చెప్పారు.
కష్టమైతే చెప్పండి…బదిలీ చేస్తాం
సచివాలయం నుంచి మంత్రివర్గ పాలసీ డాక్యుమెంట్‌కు మాత్రమే అప్రూవల్‌ ఇస్తాం. అమలు పరిచే బాధ్యత మీదే. ఈ క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అయితే డీజీపీకి తెలియపర్చండి. ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే మరోచోటికి మిమ్మల్ని బదిలీచేయడానికి, బాధ్యతలనుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం చాలా ఓపెన్‌ మైండ్‌తో ఉంది. మీ నుంచి సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకెలాంటి భేషజాలు లేవు అని అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కూడా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వారి అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
”ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తాం. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులు తీసుకుంటాం. అర్హత ఉన్నవారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారు. ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు. గిరిజన గూడెంలో 10 ఇండ్లు ఉన్నా, చెంచులు ఉండే ప్రాంతాలు అయినా అధికారులే వాళ్ల దగ్గరికి వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎవరు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయించాలి” అని స్పష్టం చేశారు.
ముందే గ్రామాలకు దరఖాస్తులు
గామ సభల్లో అప్లికేషన్లు అందిస్తే గందరగోళం ఏర్పడుతుంది. అందువల్ల గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలతో ముందే గ్రామానికి అప్లికేషన్లు పంపించాలి. ఆధారుకార్డు, ఫోటో వంటి వాటి విషయాలను ప్రజలకు ముందే చెప్పాలి. అమరవీరులు, ఉద్యమ కారులు ఉంటే వారికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, కేసుల వివరాలు తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే ముందే అప్లికేషన్లు అందించడం ద్వారా గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. సమాచారాన్ని సేకరించి డిజిటలైజ్‌ చేసి ప్రభుత్వానికి పంపిస్తే, వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.