ఆడవారి విలువను, గొప్పతనాన్ని తెలియజేసేలా, అలాగే వారిపై జరుగుతున్న లైంగిక దాడులు వంటి అంశాలతో దర్శకుడు రమణారెడ్డి ‘నిన్ను..నన్ను కన్న ఆడదిరా..’ అనే పాటను రూపొందించారు. మహిళలందరికీ మంచి జరగాలనే మంచి లక్ష్యంతో ఈ పాటలో సర్వమతాల వారికి ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించారు. ఈ పాట లాంచ్ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ,’ఈ పాట చేయడానికి ముఖ్య కారణం మనం ప్రస్తుతం బయట చూస్తున్న పరిస్థితులు. క్యాన్సర్ కంటే దారుణంగా ఈ రేప్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. నాకు ఈ పాట వినగానే ‘యమలీల’ సినిమాలో పాట గుర్తొచ్చింది. దర్శకుడు రమణా రెడ్డి ఇక్కడ నుండి అమెరికా వెళ్లి, మన దేశానికి ఏమైనా చేయాలనుకుని తిరిగి వచ్చి, ముందుగా ఈ పాటతో మొదలు పెట్టాడు. పాట విన్న వెంటనే నేను ఈ పాటని మన రాష్ట్రానికి, ఆడవారికి డెడికేట్ చేయాలి అనుకున్నాం. అందుకే ఈ పాట పూర్తిగా అన్ని ఛానెల్స్, ఆడియో కంపెనీలకు ఉచితం. ఈ పాటలో అన్ని మతాల వారు ఒక మెసేజ్‌తో ఇస్తే ఇంకా బాగా వెళ్తుంది. అందుకే ఈ విధంగా చిత్రీకరణ చేశారు. అలాగే ఈ పాటలో నటించేందుకు ముంబై నుండి వచ్చినందుకు హీరోయిన్ కామ్నా గారికి థ్యాంక్స్’ అని చెప్పారు.
‘కామంతో కళ్ళు మూసుకునిపోయి మగంలా ప్రవర్తించే వారిలో మార్పు రావాలి. కులం, మతం, వత్తితో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పాట ఒక మంచి తొలి అడుగులా కనిపిస్తుంది. ఇలాంటి పాట చేసిన దర్శకుడు రమణారెడ్డిని అభినందిస్తున్నాను. ఈ పాట వల్ల సమాజంలో మార్పుని ఆశిస్తున్నాను’ అని మంత్రి సీతక్క అన్నారు.