– నిధులు మంజూరు చేయని ప్రభుత్వం
– అప్పుల పాలైన పంచాయతీ కార్యదర్శులు
– బదిలీతో ఖర్చు చేసిన డబ్బులపై ఆందోళన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గ్రామాలలో సర్పంచుల పదవి కాలం ముగిసిపోవడంతో ప్రత్యక్ష అధికారులకు పరిపాలన బాధ్యతలు అప్పగించారు. ప్రత్యక్ష అధికారులు పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పంచాయతీ పాలన నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు పాలనకు ముందే పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రత్యక్షపాలన మొక్కుబడిగా సాగుతుంది. బ మండలంలోని 30 గ్రామపంచాయతీలు ఉండగా ఫిబ్రవరి నెల నుంచి ప్రత్యక్ష అధికారుల పాలన నడుస్తుంది. పంచాయతీలకు కనీస అవసరాలు తీర్చే బాధ్యత కార్యదర్శులపై పడింది. నిధులు కొరతతో ఒక్కో కార్యదర్శి రూ. లక్షల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టారు. ఈ మధ్యనే పంచాయతీ కార్యదర్శులు బదిలీ కావడంతో ఖర్చు పెట్టిన డబ్బులను ఎలా రాబట్టుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
మూడు ఖాతాలు ఖాళీ…
ప్రతి గ్రామపంచాయతీలో మూడు రకాల ఖాతాలు ఉన్నాయి. ఒకటి ఆస్తి పన్ను జమ చేసేందుకు ఉపయోగించే ఖాతా, గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు జరుగుతున్నా..ఖర్చు మాత్రం నాలుగింతలు ఉండడంతో ఈ ఖాతా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. రెండో ఖాతా ఎస్ఎస్ఎఫ్సీలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి నిధులు, గ్రాంట్ ను జమ చేస్తారు. రెండేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. ఈ రెండు ఖాతాల్లో జమయ్యే నిధులను ట్రెజరీ ద్వారా గ్రామపంచాయతీలు డ్రా చేసుకుంటాయి. మూడో ఖాతా 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసేందుకు ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ ఖాతాలోకి ప్రతి రెండునెలలకోసారి నిధులు మంజూరు చేస్తుంది. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ నెలల నుంచి నిధులు మంజూరు కాలేదు. ప్రత్యక్ష పాలన నుంచి పంచాయతీలో నిధులు కొరత ఉంది జీపీ నుంచి ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు డబ్బులు పంచాయతీ కార్యదర్శులు వేచిచూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలకైనా కార్యదర్శుల జేబులో నుంచి పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకులో చెక్కులు కూడా పాస్ కావడంలేదు. ఇలా దాదాపు మేజర్ మైనర్ గ్రామపంచాయతీలలో రూ. లక్షకు పైగా ఖర్చు పెడుతున్నామంటూ పంచాయతీ కార్యదర్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.