సినిమాగా తెరకెక్కిన పులిట్జర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న మొదటి నాటకం ‘యూ కాన్ట్‌ టేక్‌ ఇట్‌ విత్‌ యూ’

You Can't Take It With You'మాస్‌ హార్ట్‌, జార్జ్‌ ఎస్‌. కాఫ్మాన్‌ రాసిన ‘యూ కాన్ట్‌ టేక్‌ ఇట్‌ విత్‌ యూ’ అనే నాటకానికి 1937 లో పులిట్జర్‌ ప్రైజ్‌ వచ్చింది. ఈ నాటక హక్కులను కొలంబియా పిక్చర్స్‌ కొని 1938లో సినిమాగా తీసింది. ఇది రొమాంటిక్‌ కామెడి. ఈ సినిమాకు ఫ్రాంక్‌ కాప్రా దర్శకత్వం వహించారు. ఇది ఎంతో ప్రేక్షాదరణ పొంది రెండు అకాడమీ అవార్డులను పొందింది. ఫాంక్‌ కాప్రా ఐదేండ్లలో మూడు సార్లు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డ్‌ అందుకున్నారు. 1934లో ‘ఇట్‌ హాపెండ్‌ వన్‌ నైట్‌’ కు అలాగే 1936 లో ‘మిస్టర్‌ డీడ్స్‌ గోస్‌ టు టౌన్‌’ సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డులు ఆయనకు లభించాయి. ఇది వీరికి మూడవ అవార్డు సంపాదించి పెట్టింది. అలాగే ఉత్తమ చిత్రంగానూ ఆ ఏడాది అవార్డు గెలుచుకుంది.
ఆంథోనీ పి. కిర్బి ఒక పెద్ద వ్యాపారస్తుడు. వాషింగ్టన్‌ నుండి ఆ నగరానికి వస్తాడు. అతనో బాంకర్‌. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి ప్రత్యర్థులను ఓడించి నగరంలో అతి పెద్ద వ్యాపారస్తుడిగా మారాలన్నది అతని ఆశయం. దీనికి సిటీలో ఒక పెద్ద కాలనీలోని స్థలం కొనాలనుకుంటాడు. అక్కడ నివాసం ఉంటున్న ఎన్నో కుటుంబాలను తరలించి ఆ స్థలం సొంతం చేసుకోవాలన్నది అతని ఆలోచన. అయితే ఆ కాలనీలో వాండర్హాఫ్‌ అనే ఓ వద్ధుడు తన కుటుంబంతో జీవిస్తున్నాడు. చుట్టూ ఉన్న చిన్న కుటుంబాలు కూడా అక్కడ కొన్ని తరాలుగా కలిసి ఉంటున్నాయి. వారికి ఆ స్థలం అమ్మాలని ఉండదు. కాని ఎలాగైనా వారందరినీ ఖాళీ చేయించమని బ్రోకర్లను నియమిస్తాడు కిర్బి.
కిర్బి భార్య హై సొసైటికి చెందిన స్త్రీ. వీరికి ఒక్కడే కొడుకు టోని. ఇతన్ని తన కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తాడు కిర్బి. టోనికి ఆ వ్యాపారంపై శ్రద్ధ ఉండదు. అతనికి గడ్డిపోచలపై రీసెర్చ్‌ చేయాలనే కోరిక ఉంటుంది. చదువుకునే రోజుల్లో ఇంకో స్నేహితునితో ఆ రీసెర్చ్‌ గురించి ఆలోచనలు చేస్తాడు. చదువు అయిపోయాక ఆ స్నేహితుడు బతుకుదెరువు కోసం చిన్న ఉద్యోగంలో కుదురుతాడు. తండ్రి కోరిక కోసం టోని కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కాని ఆ పని అతనికి నచ్చదు. తనకిష్టమైన పని, చేయాలనుకున్న రీసెర్చ్‌ గురించి చెప్తే ఎవరూ దాన్ని అర్ధం చేసుకోరని, తనని గేలి చేస్తారనే భయం కూడా అతనిలో ఉంటుంది.
వాండర్హాఫ్‌ ఇంట్లో అందరూ తమకు నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. జీవితాన్ని కోరుకున్నట్టు బతకాలన్నది వీరి ఆశయం. అతని భార్య ఎప్పుడో మరణిస్తుంది. కూతురికి నాటక రచయిత్రి అవ్వాలనే కోరిక. ఆమె దానిలో కషి చేస్తూ ఉంటుంది. పెద్ద మనవరాలికి బ్యాలే నాట్యంపై మక్కువ. ఆమెకు వంట అన్నా చాలా ఇష్టం. ఇంట్లో చాక్లెట్లు బిస్కెట్లు చేసి అమ్ముతూ ఉంటుంది. ఆమె భర్త సంగీత కారుడు. ఇంట్లోనే చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ కూడా నడిపిస్తూ ఉంటాడు. వాండర్హాఫ్‌ అల్లుడు ఇంట్లో మందుగుండు సామానుతో కొత్త రకాల పటాసులు తయారు చేస్తూ ఉంటాడు. వీళ్లు కాక తమ కోరికలు బైట ప్రపంచంలో తీర్చుకోలేని మరో ఇద్దరు వ్యక్తులు వీళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటారు. అలాగే ఓ నౌకరు కుటుంబం కూడా ఇంటి పనిలో సాయం చేస్తూ ఉంటారు. ఎవరికిష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటూ డబ్బు సంపాదన పట్ల పెద్ద ఆసక్తి లేకుండా జీవించే వీళ్ల కుటుంబం బైటి వారికి ఓ పిచ్చి వాళ్ళ ప్రపంచంగా కనిపిస్తూ ఉంటుంది. కాని వాళ్లు మాత్రం ఆనందంగా జీవిస్తూ ఉంటారు.
వాండర్హాప్‌ ఆ ఇల్లు ఖాళీ చేసేదేలేదని మొండిపట్టు పడతాడు. ఎంత డబ్బు ఆశ చూపినా అతను లొంగడు. అతని ఇల్లు కాలనీ మధ్యలో ఉండడం వలన అతను అమ్మకపోతే ఇతర ఇళ్ళ వాళ్లు కదలాల్సిన అవసరం లేదు. దానితో ఆ కాలనీ వాసులందరూ నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు. వాండర్హాప్‌ రెండవ మనవరాలు ఆలిస్‌ టోనీ దగ్గర సెక్రెటరీగా పని చేస్తూ ఉంటుంది. ఈమెను టోనీ ప్రేమిస్తాడు. తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆ హై సొసైటీ జీవితంలో ఆలిస్‌ టోనికి ఓ ఆశాకిరణంలా అనిపిస్తుంది. తన తల్లితో ఆలిస్‌ను తాను ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని అతను చెప్తాడు. ఆలిస్‌ టోనిని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి ఇంటికి పిలుస్తుంది. ఆలిస్‌ ఇంట్లో వాళ్లందరి ప్రవర్తన వింతగా ఉన్నా ఆ వాతావరణంలో ఓ ఆనందం అనుభవిస్తాడు టోని. ఇన్‌కం టాక్స్‌ కట్టడానికి నిరాకరించే వాండర్హాఫ్‌ ఆలోచనలు అతనికి వింతగానూ అనిపిస్తాయి. అప్పట్లో అమెరికాలోని రిపబ్లికన్లు ఇన్‌కం టాక్స్‌ పద్ధతిని నిరసించేవాళ్లట.
తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి టోని తల్లిదండ్రులు తన కుటుంబాన్ని కలవాలని పట్టుబడుతుంది ఆలిస్‌. టోని అనుకున్న రోజు కన్నా ఒక రోజు ముందుగా తన తల్లిదండ్రులను ఆలిస్‌ ఇంటికి తీసుకువస్తాడు. ఆ ఇంటిని, మనుషులను సహజంగా తన తల్లిదండ్రులు చూడాలని అతని కోరిక. ఇది ఆలీస్‌ కుటుంబాన్ని ఇబ్బందిలో పెడుతుంది. కిర్బీ, అతని భార్య ఆ ఇంటికి వచ్చేసరికి అక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అయినా వాళ్లంతా మంచి మనసుతో వచ్చిన వారికి మర్యాదలు చేస్తారు. ఆలిస్‌ మాత్రం ఆ హఠాత్‌ పరిణామానికి షాక్‌ అవుతుంది. క్షమాపణలు కోరి కిర్బి అతని భార్యను అక్కడి నుండి పంపించేయాలని అనుకుంటుంది. కాని అప్పుడే పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మనుషులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని, వాండర్హాఫ్‌ పెద్ద మనవరాలి భర్త తన ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రచురించి అందరిళ్లకు పంచిన కాగితాల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలున్నాయంటూ ఇంట్లో సోదా మొదలెడతారు. బేస్‌మెంట్‌లో ఆలిస్‌ తండ్రి తయారు చేసే మందు గుండు సామాను పేలుతుంది. దానితో ఆ ఇంట్లో అక్కడ ఉన్నవాళ్లందరినీ అరెస్టు చేస్తారు పోలీసులు. వాండర్హాఫ్‌ కుటుంబ సభ్యులతో పాటు కిర్బీ కుటుంబం కూడా పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి గడపవలసి వస్తుంది.
తన పరువు పోయిందని, ఈ సాధారణ జనంతో కలిసి ఉండవల్సి వస్తుందని కిర్బీ అసహనంగా ఉంటాడు. అతని అహాన్ని గమనించిన వాండర్హాఫ్‌ జీవితంలో ఏ స్నేహం లేక కేవలం డబ్బు మాత్రమే మూటగట్టుకున్న అతని జీవితంలోని ఒంటరితనాన్ని ఎత్తి చూపుతాడు. అతను చనిపోయాక కనీసం తన అనుకునే వాళ్ళు ఉండరని, అది జీవించే పద్ధతి కాదని చెప్తాడు. అతను మంచి వ్యక్తిగా, మంచి మనిషిగా, మంచి తండ్రిగా కూడా ఉండలేకపోయాడని గుర్తు చేస్తాడు. ఏ కీర్తి కోసం అతను తన జీవితాన్ని అంతగా ఒంటరి చేసుకున్నాడో అదేదీ తనతో రాదని, అన్నిటినీ ఇక్కడే వదిలి ఓ రోజు వెళ్ళిపోవలసి వస్తుందని, అప్పుడు ఇతరుల మనసుల్లో నిలబడి పోయే స్నేహ పరిమళాలు, జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయని చెప్తాడు. ఈ సినిమా టైటిల్‌ అర్ధం అదే. ”యూ కాన్ట్‌ టేక్‌ ఇట్‌ విత్‌ యు” అంటే ”నీతో దేన్నీ తీసుకెళ్లలేవు”
ఇక వారి కేసు కోర్టుకు వస్తుంది. వాండర్హాఫ్‌కు మద్దతుగా ఆ వీధి అంతా తరలి వస్తుంది. అనుమతి లేకుండా మందు గుండు సామగ్రి తయారు చెయడం తప్పని కోర్టు వాండర్హాఫ్‌ కుటుంబానికి వంద డాలర్ల ఫైను విధిస్తుంది.
కిర్బీ తరుపున న్యాయవాదులు వాదించడానికి వస్తారు. తన దగ్గర అంత డబ్బు లేదని వాండర్హాఫ్‌ అంటే ఆ డబ్బు కిర్బీ తరుపున కట్టడానికి లాయర్లు అనుమతి అడుగుతారు. కాని తమ ఇళ్ళను ఖాళీ చేయించబోతుంది కిర్బీ అని తెలుసుకున్న ఆ వీధి వాళ్లు అతని సహాయం నిరాకరిస్తారు. అక్కడే తమ జేబుల్లో ఉన్న చిల్లరంతా సేకరించించి జడ్జి ముందు పెడతారు. అంత మంది ఒక్క వ్యక్తి కోసం కలిసి రావడం, తమ దగ్గర ఉన్నదంతా అతనికి ఇవ్వడం చూసిన జడ్జి వారి స్నేహానికి ఆనందిస్తాడు. తానూ ఆ సేకరిస్తున్న డబ్బులో తన వంతుగా ఓ డాలర్‌ వేసి ఆ డబ్బును ఆఫీసులో కట్టమని వారికి చెబుతాడు. అంత మంది స్నేహితులను సంపాదించుకున్నందుకు వాండర్హాఫ్‌ను అభినందిస్తాడు.
కాని కిర్బీ ఆ ఇంట్లో భార్యతో సహా ఎందుకున్నాడో చెప్పాలని అడుగుతాడు జడ్జి. తాము టోని పెళ్ళి సంబంధం కోసం ఆ ఇంటికి వెళ్లామని చెప్పడానికి కిర్బీ భార్యకు అహం అడ్డు వస్తుంది. ఆమెకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. ఈ గొడవతో ఆమె ఆలిస్‌ను కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడదు. అందుకే కోర్టులో అసలు విషయం చెప్పడానికి వెనుకాడుతుంది. అది తమ స్వవిషయం అంటూ సమాధానాన్ని దాట వేస్తుంది. కాని జడ్జి తనకు కారణం తెలియాలంటాడు. దీనితో ఆ జంట ఆలోచనలో పడితే వాండర్హాఫ్‌ వాళ్ళ అవస్థను గమనించి జాలి పడతాడు. తన ఇల్లు కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు తన ఇంటికి వచ్చారని చెప్పి కోర్టులో వాళ్లను రక్షిస్తాడు. కాని ఆలిస్‌ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. అసలు విషయాన్ని వాళ్లు దాచి పెట్టడం తన కుటుంబానికి జరిగిన అవమానంగా ఆమె భావిస్తుంది. జడ్జితో అసలు విషయం చెబుతుంది. అక్కడే, కిర్బీ కుటుంబం ఈ విషయం చెప్పలేకపోవడం వెనుక తమపై వాళ్లకున్న చులకన భావం అర్ధం అవుతుందని దీన్ని తాను అంగీకరించలేనని, అందుకని టోనితో తాను తన సంబంధాన్ని ముగించుకుంటున్నానని చెబుతుంది. మరుసటి రోజు పేపర్లలో ఈ విషయం అంతా ముందు పేజీలో వీళ్ళ ఫొటోలతో పాటు వస్తుంది.
ఆ ఊరిలో ఉండలేక అలిస్‌ మరో చోటుకు వెళ్ళిపోతుంది. ఓ స్నేహితురాలి ఇంట ఉంటూ, తాను క్షేమంగానే ఉన్నట్టు ఇంటికి ఓ ఉత్తరం రాస్తుంది. ఆమెను మర్చిపోలేని టోని వాండర్హాప్‌ ఇంటికి వస్తాడు. ఆలిస్‌ ఎక్కడుందో చెప్పమని బతిమాలుతాడు. కాని ఎవరూ అతనికి ఆమె సమాచారం ఇవ్వరు. ఈ లోగా షేర్‌ మార్కెట్‌ కూలిపోతుంది. కిర్బీ ప్రత్యర్ధి పూర్తిగా నాశనం అవుతాడు. దీని వెనుక కిర్బీ హస్తం ఉందని అందరికీ అర్ధం అవుతుంది. అతను ఆ ఊరిలో వ్యాపారస్తులందరిని శాసించే స్థితికి చేరతాడు. తన కంపెనీకి టోనీని ప్రెసిడెంటుగా చేయాలని నిశ్చయించుకుంటాడు.
టోని ఆ జీవితం వద్దనుకుని తన వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తాడు. తాను కొన్నాళ్ళు అన్నిటికి దూరంగా ఉండి తాను కోరుకున్న రంగంలోనే పని మొదలుపెడతానని, ఈ జీవితం తనకు ఇష్టం లేదని చెప్తాడు. కిర్బీ ప్రత్యర్ధి ఓటమి తట్టుకోలేక హార్ట్‌ అటాక్‌తో మరణిస్తాడు. ఈ రెండు సంఘటనలు కిర్బీలో తన జీవితం పట్ల ఆలోచనలను కలిగిస్తాయి. తాను మంచి తండ్రిగా, మంచి మనిషిగా ఉండలేకపోయాడని వాండర్హాఫ్‌ తనతో పోలీస్‌ స్టేషన్‌లో అన్న మాటలు అతనికి గుర్తుకు వస్తూ ఉంటాయి.
ఆలిస్‌ ఆ ఊరికి తిరిగి రాలేనని ఉత్తరం రాస్తుంది. దానితో ఆమెను ఆ స్థితిలో ఒంటరిగా వదలేమని వాండర్హాఫ్‌ నిశ్చయించుకుంటాడు. ఆలిస్‌ కోసం ఆమె ప్రస్తుతం ఉన్న ఊరిలోనే ఇల్లు కొనుక్కుని తామందరూ వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటారు. తమ ఇంటిని కొనుక్కోవాలని తిరుగుతున్న కిర్బీ నియమించిన బ్రోకరుకు తాను ఆ ఇంటిని అమ్మాలనుకుంటున్నానని ఆ రోజే తనకు డబ్బు కావాలని చెప్తాడు వాండర్హాఫ్‌. అప్పుడే డబ్బు కావాలంటే తక్కువ రేటుకు ఇల్లు అమ్మాలని తమ వ్యాపార శైలి చూపిస్తాడు బ్రోకర్‌. వాండర్హాఫ్‌ దీనికి బాధపడడు. అతనికి డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. అందుకే వాళ్లు ఇచ్చినంతే తీసుకుని అప్పటికప్పుడు ఆ ఇల్లు అమ్మేస్తాడు. తన కుటుంబ సభ్యుల సుఖం కన్నా డబ్బు ముఖ్యం కాదు అన్నదే అతని సిద్దాంతం.
వాండర్హాఫ్‌ ఇల్లు అమ్మేయడంతో ఆ వీధిలో వారందరికీ నోటీసులు వస్తాయి. అందరూ బాధపడతారు. కొడుకు తనను వదిలి వెళ్లిపోతానడంతో కిర్బీలో మార్పు వస్తుంది. వ్యాపారస్తులందరూ తనని నాయకునిగా ఎన్నుకుంటున్నా మీటింగ్‌ వదిలి కిర్బీ వాండర్హాఫ్‌ ఇంటికి వస్తాడు. అప్పటికే ఇల్లు ఖాళీ చేస్తుంటారు కుటుంబ సభ్యులు. ఆలిస్‌ తన వల్ల వీధి అంతా ఖాళీ అవుతుందని తెలుసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ టోనీ కూడా ఆ ఇంటికే వస్తాడు. కిర్బీ మానసిన స్థితి గ్రహించి వాండర్హాఫ్‌ అతన్ని తనతో కలిసి మౌత్‌ ఆర్గన్‌ వాయించమని ఆహ్వానిస్తాడు. ఒకప్పుడు కిర్బీ ఆ వాయిద్యాన్ని ఇష్టపడి వాయించేవాడు. డబ్బు సంపాదనలో ఆ చిన్న చిన్న ఆనందాల ప్రాముఖ్యతను అతను మర్చిపోతాడు. ఈ సమయంలో వాండర్హాఫ్‌ సంగీతం గురించి ప్రస్తావించడం అతన్ని అయోమయానికి గురి చేస్తుంది. కాని ఇద్దరూ కలిసి ఓ పాటను వాయిస్తుండగా ఆ ట్యూన్‌ విని ఆలిస్‌ అక్క నాట్యం మొదలెడుతుంది. ఆమె భర్త తానూ తన వాయిద్యానికి పని కల్పిస్తాడు. ఆలిస్‌ టోని ఇద్దరూ ఒక్కటిగా కిందకు వస్తారు. తేలికపడిన మనసులతో ఆ కటుంబం ఆ ఖాళీ ఇంట్లో ఆనందిస్తుండగా వాళ్ళందరికీ తమ జీవితాలపై ఓ స్పష్టత ఏర్పడుతుంది.
కిర్బీ ఆ ఇంటిని ఆ విధీలో ప్రతి ఒక్కరి ఇళ్ళను తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు డబ్బు అతనికి ముఖ్యం అనిపించదు. టోనీ ఆలిస్‌ల వివాహం జరుగుతుంది. అందరూ ఒకే కుటుంబంగా కలిసి ఆనందంగా జీవిస్తారు.
ఇది పూర్తి స్థాయి రొమాంటిక్‌ కామెడీ సినిమా. వాండర్హాఫ్‌ కుటుంబ సభ్యులందరూ వారి అలవాట్లతో జీవిన విధానంతో నవ్విస్తూ ఉంటారు. వాండర్హాఫ్‌ పాత్రలో నటించిన లయొనిల్‌ బారిమోర్‌ ఈ సినిమా సమయానికి కీళ్ళ నొప్పులతో విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు. కాని ఆ పాత్రకు అతనే కావాలన్న పట్టుదల దర్శకులది. ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు కూడా. అప్పుడు వాండర్హాఫ్‌ కింద పడి ఎముక విరగ్గొట్టుకున్నాడని, కోలుకుంటున్న క్రమంలో క్రచస్‌ సహాయంతో నడుస్తున్నాడనే ఓ సంభాషణను చేర్చడంతో వాండర్హాఫ్‌ సినిమా మొత్తంలో కూడా క్రచస్‌తో నడుస్తూ కనిపిస్తాడు.
నడవలేని స్థితిలో ఉన్నా సరే, ఆ నటుడే తమకు కావాలని అతని కోసం ఆ పాత్రను క్రచెస్‌తో పాటు చూపిస్తూ ఆసాంతం సినిమా నడిపించడం ఆ నటుడి ప్రతిభపై సినీ రంగానికున్న నమ్మకం. అలాగే సినిమా మొత్తం ఆ చేతికర్రలతో కనిపిస్తూ వాండర్హాఫ్‌ అద్భుతంగా నటించారు. షూటింగ్‌లో నొప్పి భరిచలేక ప్రతి గంటకొకసారి ఇంజెక్షన్లను తీసుకుంటూ ఆయన ఈ సినిమాలో వాండర్హాఫ్‌ పాత్రకు న్యాయం చేసారు. అప్పటి నటుల నిబద్దతను ప్రశంసించాలి. పైగా ఆలిస్‌ పాత్ర చేసిన జీన్‌ ఆర్థర్‌ కన్నా ఆయన కేవలం ఇరవై రెండేళ్ళు పెద్ద అయినా ఆమెకు తాతగా ఈ సినిమాలో నటించారు లయొనిల్‌ బారిమోర్‌.
ఆలిస్‌ అక్క పాత్రలో నటించిన ఆన్‌ మిల్లర్‌ వయసు అప్పుడు పదిహేనేళ్ళే. ఈ సినిమా అంతా ఆమె నాట్యం చేస్తూ కనిపించాలి. ఎంతో నొప్పి ఓర్చుకుంటూ ఆమె అప్పట్లో ఈ పాత్రను చేసింది. తండ్రి లేక, తల్లి అనారోగ్యం కోసం ఆమె పద్నాలుగేళ్ళ వయసులో తాను మేజర్‌ ననే దొంగ సర్టిఫికేట్‌తో సినిమాల్లోకి వచ్చి ఎంతో కష్టపడింది. ఆ రంగాన్ని ఇష్టపడకపోయినా ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో దాన్నే కెరీర్‌ గా మలచుకుంది. డాన్సర్‌గా ఎక్కువ కనిపించిన ఆన్‌ మిల్లర్‌ ఆ పాత్రలు చేయడానికి తాను ఎంత కష్టపడినా ప్రేక్షకుల దష్టిలో డాన్సర్లంటే బుర్ర తక్కువవారనే ఆలోచన ఉండడం, వారిని తేలికగా చూడడం గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో బాధపడుతూ చెప్పింది. టోని పాత్రలో నటించిన జేమ్స్‌ స్టీవర్ట్‌ హాలివుడ్‌ గొప్ప నటుల్లో ఒకరు. ఈయన నటించిన సినిమాలన్నీ చూడవలసినవే.
ఇప్పుడు చూస్తే ఇదొక అపురూపమైన చిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో నటించిన జేమ్స్‌ స్టీవర్ట్‌, లియోనెల్‌ బారీమోర్‌ ఇద్దరు కూడా తమ కెరీర్లలో ఆస్కార్‌ విజేతలు, ఇతర పాత్రల్లో కనిపించే జీన్‌ ఆర్థర్‌, మిస్చా ఔర్‌, స్ప్రింగ్‌ బైంగ్టన్‌, హెచ్‌.బి. వార్నర్‌ నలుగురు అస్కర్‌ నామినీలు. ఆస్కార్‌ వరకు చేరిన ఇంత మంది నటులు కనిపించిన అరుదైన చిత్రంగా ఈ సినిమా ఇప్పటికీ సినీ ప్రేమికులను రంజింపజేస్తుంది.
పి.జ్యోతి
98853 84740