నిన్ను నీ కోసమే….

For you...నీ బాధను ఇంకొకరి చంకకెత్తి
వాడి మడిమ నీడలో నీవెందుకుండాలి?
నీ నాలుక పగుళ్లను
మరొకరి మాటలో రుచిను సాది
ఎలా పూడ్చుకోగలవు ?
గుండెల్లో కొండలు ప్రేలినా
ముఖంలో నిశ్శబ్దానికి
భంగం వాటిల్లకుండా చూడాల్సిందే.
చీకటి జోరున కురుస్తున్నా
అడుగు తడవకుండా
పాదాలు గొడుగు పట్టాల్సిందే.
చేతులకు బరువు వ్రేలాడుతున్నా
పనితో కలసి మాట కలిపి
పాటలో పాల్గొనాల్సిందే.
కళ్ళు ఒకరి భిక్ష కోసం
జోలే పట్టుకోకుండా
కన్నీటిని ఈదాల్సిందే.
తీవ్ర క్షణం పెదవి జారితే
మనసు మెట్టొకటి మునిగి
పరువు కోసుకుపోవాల్సిందే
పిడికిలి బిగించిన కళ్ళు
కష్టాల కడలిని ఒడిసిన గెలుపే
నిన్ను నీ కోసం నిలపెట్టి గెలిపిస్తుంది.
– చందలూరి నారాయణరావు, 9704437247