హక్కుల సాధనకు పోరాడాల్సిందే

– బావురావుపేట్‌ భూపోరాటానికి ఆదివాసుల మద్దతు
నవతెలంగాణ-జైపూర్‌
పేదలకు చెందాల్సిన భూములను అక్రమార్కులు కాజేస్తుంటే చూస్తూ ఉండకుండా పోరాటాల ద్వారనే హక్కులను సాధించుకోవడం జరుగుతుందని చరిత్ర చెపుతోందని ఆదివాసి నాయకులు తెలిపారు. బుధవారం బావురావుపేట్‌ శివారు భూపోరాట కేంద్రానికి వచ్చిన పోడు భూముల విషయంలో పోరు సల్పిన కోయపోచగూడ ఆదివాసి నాయకులు, మహిళలు మద్దతు తెలిపారు. బావురావుపేట్‌ శివారు సర్వే నెం. 8లో గల ప్రభుత్వ భూమిని ఇంటి స్థలాల కోసం కెటాయించాలన్న డిమాండ్‌ పట్ల ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని బావురావుపేట్‌ శివారులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న బడాబాబులు చాటుమాటుగా అక్రమంగా లేఅవుట్లు చేసి అమ్మేసుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. తలదాచుకోవడానికి ఇల్లు లేని నిరుపేదలు ఇంటి స్థలాలు కెటాయించాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేస్తుంటే వారికి న్యాయం చేయకపోగా పోరాటం చేస్తున్న మహిళలపై కేసులు పెట్టి బయపెట్టిస్తున్న తీరు బాధాకరమని పేర్కొన్నారు. కోయపోచగూడ పోడు భూముల పోరాటం సంధర్భంగా ఆదివాసీలను అనేక నిర్భందాలకు గురి చేసి జైలుకు పంపించిన సంధర్భంలో 19 నెలల పాటు పోరాటం చేయడం జరిగిందని ఈ సంధర్భంగా గుర్తు చేశారు. ఒక వైపు పోలీసులు మరో వైపు అటవీ అధికారులు అనేక నిర్భందాల మధ్య 52 కుటుంబాలు పోరాటంలో పాల్గొన్నాయని, చంటి పిల్ల తల్లులు అని చూడకుండా 195 కేసులు నమోదు చేసి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జైలుకు పంపించారని తెలిపారు. భూమి కోసం అలుపెరుగని పోరాటం చేసి భూమిని సాధించిన చరిత్ర కోయపోచ గూడెం ఆదివాసీలకే దక్కిందని అదే పోరాట స్పూర్తితో ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న ఇక్కడి పేద కుటుంబాల వారు ఇంటి స్థలాలు దక్కించుకునే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పేదలందరు ఐక్యంతో ఉంటే ఏదైనా సాధించగలమని చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క, మల్లు స్వరాజ్యం స్పూర్తితో పోరాటాలను ముందుకు తీసుకుపోవాలని, ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు ఇంచు కూడా కదులొద్దని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోయపోచం గూడ భూపోరాట కమిటి సభ్యులు సాదం బాబు, దోషన్ల ఎల్లయ్య, మూడితే పోసక్క, శ్యామల, శైలజ, పోచవ్వ, రాజవ్వ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, కనికపురం అశోక్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి రాజేశ్వరి, జిల్లా కమిటి సభ్యులు బోడంకి చందు, చెన్నూర్‌ పట్టణ కార్యదర్శి ఎండీ ఆవేస్‌, కోటపల్లి మండల కార్యదర్శి కావిరి రవి, రైతు సంఘం మండల కార్యదర్శి కుందర చంద్రన్న, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి డుర్కె మోహన్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరిగెల మహేష్‌, సమ్మక్క, కరీంబీ, పోసక్క పాల్గొన్నారు.