ఓ మారు వెనక్కి వెళ్లిరావాలి

కాలం ఓ సారి ఆగిపోతే ఎంత బావుండునో?
ఓ మారు వెనక్కి వెళ్లి రావాలని ఉంది
జీవితాన గడిపిన మధురానుభూతుల్ని మరోసారి మనసారా ఆస్వాదించాలనుంది
పాపం పుణ్యం ఎరుగని
తేట బాల్యంలోకి తిరిగి పోయి రావాలనుంది
మూడు చక్రాల గిలకల కర్రబండిని
తప్పటడుగులతో నడుపుతుంటే
చూసి మురిసి వెలిగిపోయే అమ్మ మోములోని నవ్వుని మళ్లీ మళ్లీ చూడాలనుంది
పిల్లాడినై చిన్ననాటి నేస్తాలతో లేడికూనలమై గెంతులేస్తూ బడికి మరోసారి వెళ్లిరావాలనుంది
బడి వదిలి బ్రతుకు బడిలో దిక్కుకొకరమై
ఎన్నడూ కలవని నాటిమిత్రుల్ని కలిసి
ప్రేమగా పలకరించి హత్తుకోవాలనుంది
మరోసారి నవ యవ్వనుడినై
పొగరుతనం తిరుగుబాటే చిరునామాగా తిరుగాడిన కాలేజీ రోజుల్లోకి
వెళ్లి రావాలనుంది, చిరు తగాదాలకే అలిగి
దూరమైన నాటి దోస్తుల్ని వెతికి
మన్నించమని కోరాలనుంది
వినిపించుకోకుండా అశ్రద్ధ చేసిన అప్పటి గురువులు శ్రద్ధగా చెప్పిన చదువుల సారాన్ని తిరిగి ఒంటబట్టించుకోవాలనుంది
కొత్తగా కొలువులో చేరిన నాటి సంతోష సమయాన్ని మరలా అనుభవించాలనుంది
పని రానితనంలో పని నేర్చుకుంటూ అందుకున్న అప్పటి మొదటి నెలజీతం
చేతికందిన ఉద్విగ క్షణాలను
తిరిగి పొందాలని వుంది
కళ్ళముందు వేగంగా ఎదిగిన
పిల్లలతో మరోసారి వెనక్కి వెళ్లి
నేనూ పిల్లాడినై పరుగుల జీవితంలో
నాడు గడపలేని కాలాన్ని
తిరిగి వారితో కలిసి గడుపుతూ ఆడాలనుంది
జీవన గమనానికి వెన్నెముకై
జీవితమంతా కలిసి తోడుగా
నిలిచి నడుస్తున్న నీడలాంటి
జీవన సహచరితో తొలినాటి ప్రేమలను
మోహాలను ఊసులను
మరోసారి తనివితీరా అప్పటి వెన్నెల రాత్రులలోకి ప్రయాణించి కలిసి వెలిగించుకోవాలని ఉంది
బ్రతుకు దారిలో ఆఖరిమజిలీకి
చేరువవుతున్న వేళ
జీవనరేఖ ఇంకాస్త పెద్దదైతే
ఎంత బావుండుననే ఆశ
రెప రెప లాడుతూనే ఉంది
మరిచిన స్నేహాలను సాయపడిన హదయాలను హత్తుకుని వారి ఋణాన్ని తీర్చుకోవాలనుంది
నేడు జీవిత చరమాంకంలో
గతించినవేవీ వెనక్కు రాలేవని
కనీసం మిగిలిన ఈ అద్భుత కాలాన్ని మనసారా జీవించాలని ఈ సశేషకాలాన్ని మనిషితనంతో సాటి మనుషులను చేరదీసి
పసిపాపగా ప్రతిరోజును
ఉత్సవంగా బ్రతికేయాలనుంది!
(అమెరికన్‌ కవి రాబర్ట్‌ డ్రెక్‌ కు కతజ్ఞతలతో)
– డా. కె. దివాకరా చారి, 9391018972