
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విద్యార్థులు మీ తల్లిదండ్రులకు ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త, హానికరమైన చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించేలా అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో
స్వచ్ఛత ప్రతిజ్ఞ ఆకారంతో విద్యార్థులు మానవహారంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్లాస్టిక్ వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ తమ బాధ్యతగా వారంలో రెండు గంటలపాటు శ్రమదాన కార్యక్రమం చేయాలని సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ అనిత , వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ , స్కూల్ ప్రిన్సిపల్ వెంకటయ్య , వాసు దేవ రెడ్డి, మునిసిపల్ అధికారులు బాల ఏళ్లం , శంకర్, ఈ ఈ రవికుమార్, వార్డు ఆఫీసర్ శారద, మెప్మా ఆర్పీలు, స్కూల్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.