– విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపు
నవతెలంగాణ – గంగాధర : విద్యార్థిని, విద్యార్థులు విద్యలో రాణించేందుకు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఎమ్మెల్యే రవిశంకర్ పిలుపు నిచ్చారు. గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు- మనబడి పథకం కింద నిర్మించిన అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్ ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదువులో ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గిరిజన, పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్ష లాగే ఉండేదన్నారు. చదవాలనే సంకల్పంతో విద్యాభ్యాసం చేస్తే ఉన్నత, ఉద్యోగాలు మీ సొంతం అవుతాయనే నిజం ప్రతి విద్యార్థి గ్రహించాలని సూచించారు. రాష్ట్రంలో విరివిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయగా,నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, కురిక్యాల,గంగాధర సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్ రావు, దూలం బాలగౌడ్, కొండగట్టు అలయ ధర్మకర్త ఫుల్కం నర్సయ్య, వెంకటాయపల్లి సర్పంచ్ మేఘరాజ్, విండో ఉపాధ్యక్షుడు వేముల భాస్కర్, ఏఎంసీ ఛైర్మన్ ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు సామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.