మీరు కూడానా…చంద్రచూడ్‌?

Are you also... Chandrachud?గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ గారికి,
మొన్న బుధవారం నాడు సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ మీ ఇంటికి వచ్చి, మీతో పాటు గణేష్‌ పూజచేసి, హారతులు ఇచ్చినట్టు ‘ఎక్స్‌’లో వచ్చిన వీడియో సందేశాన్ని దేశ ప్రజలందరూ చూశారు. ఈ సందేశం కూడా మీనుంచి గాక, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి దేశ ప్రజలకు తెలిసింది. న్యాయం కోసం ఎదురుచూపులు చూసే అనేకమందికి ఆశ్చర్యాన్ని, అంతకుమించి దు:ఖాన్ని ఇది కలిగించింది.న్యాయవ్యవస్థ మీద అమితమైన విశ్వాసాన్ని చూపే కోట్లాదిమంది భారతీయులను అయోమయానికి గురిచేసింది. న్యాయవ్యవస్థను ఇంకెవ్వరూ ఈ విధంగా ఇంతవరకు కించపరచలేదనే భావన అనేకమంది బుర్రల్లో తలెత్తింది. అటువంటి ఆలోచన కలడానికి ఆస్కారం మీరు కల్పించారు. మీరు కూడా అటువంటి వీడియోనే పోస్ట్‌ చేశారేమోనని ‘ఎక్స్‌’లో వెతికితే కనపడలేదు. ఈ సందర్బంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకటి, మీరు ప్రధానిని మీ ఇంటికి ఆహ్వానించారా? లేక పిలవని పేరంటంగా తానే వచ్చారా అనే దాని మీద స్పష్టత లేదు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా మీకు అర్థమయ్యే ఉంటుంది.. స్వయంగా మీరు ఆహ్వానించివుంటే అది మీ తప్పు, పిలవకుండానే ప్రధాని వస్తే అది ఆయన తప్పు. రెండోది, న్యాయమూర్తి, ప్రధానమంత్రిని సాధా రణంగా అధికారిక కార్యక్రమాల్లోనూ, అధికారిక సమావేశాల్లోనూ కలుసుకుంటారు. అంతేగాని, వ్యక్తిగత ప్రైవేట్‌ కార్యక్రమాల్లో కలుసుకోవడం జరగదు. అటువంటివి జరిగితే దేశానికి తప్పుడు సందేశం వెళ్తుందని మీకు తెలుసు. అంతెందుకు-మీరు రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కాలేదన్న విషయం దేశ ప్రజలందరి దృష్టిలో ఉంది. లౌకిక రాజ్యాంగాన్ని కాపాడే పదవిలో ఉన్న మీరు అటువంటి మత కార్యక్రమాలకు హాజరు కాకపోవటాన్ని అందరూ హర్షించారు. కానీ ఇప్పుడు ఎందుకిలా జరిగింది?మూడోది, గణేష్‌ పూజకు ప్రధాని మీ ఇంటికి రావడం చాలా గోప్యంగా జరిగింది. ప్రధానే స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసేదాకా దేశప్రజలకు తెలియదు. ప్రధాని అధికారిక కార్యక్రమాలన్ని ముందుగానే నిర్ణయించబడి ప్రకటిస్తారు. కానీ ఈ సందర్భంలో అలా జరగలేదు. ఎందుకని?నాలుగు, ప్రధాని ఈ వీడియో బయట పెట్టిన తర్వాత రాజకీయ పార్టీలు, న్యాయవాదులు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు వెల్లడి చేశారు. కొంతమంది న్యాయవాదులు, ప్రతిపక్ష పార్టీలనాయకులు మిమ్మల్ని బాగా తప్పుపట్టారు.కానీ బీజేపీకి సంబంధించిన మంత్రులు, నాయకులు బహిరంగంగానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ తమకు అనుకూలంగా ఉండబోతుందనే సంకేతంగా వారు దీనిని తీసుకుని సంతోష పడటానికి కారణంగా కనపడుతున్నది. బీజేపీ జాతీయ కార్యదర్శి బి ఎల్‌ సంతోష్‌ – (ఈ వీడియో చూసి) ఇక వామపక్ష ఉదారవాదులకు(లెఫ్ట్‌ లిబరర్స్‌) ఏడుపు మొదలైంది అని ట్విట్టర్లో వ్యాఖ్యనించారు. వామపక్ష ఉదార వాదులంటే ఆయన ఉద్దేశంలో లౌకిక వాదులనే. ఈ సంఘటన దేశంపై ఎంత ప్రభావం చూపు తున్నదో సంతోష్‌ చేసిన ట్వీట్‌ చెబుతుంది. ఐదు, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రితో రాసుకు పూసుక తిరిగితే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా మీరేమంటారు? తప్పు అని చెప్తారా, లేదా? రేపటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హైకోర్టు న్యాయమూర్తులు కూడా మీబాటలో నడిస్తే మీ సమాధానం ఏమిటి? సామాన్యుడు న్యాయాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? న్యాయవ్యవస్థ మీద నమ్మకం అంటే న్యాయమూర్తుల మీద నమ్మకమే. దానిని మాజీ ప్రధాన న్యాయ మూర్తి రంజన్‌ గొగోరు వమ్ము చేశారు. మళ్లీ ఇప్పుడు మీ వల్ల అటువంటి విఘాతం కలగదు కదా.
లౌకిక రాజ్యాంగంలో మతోన్మాద ప్రభుత్వాన్ని కట్టడి చేయగలిగిన వాటిలో ఒకటి న్యాయ వ్యవస్థ. కానీ న్యాయవ్యవస్థే తన స్థాయిని తగ్గించుకుంటే దేశానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని తీర్పులు ప్రజల సామాజిక జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. అటు వంటిది జరగకుండా ఉండాలంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహ రించడమే మార్గం. ఆ మార్గాన్ని వీడరని, న్యాయ వ్యవస్థ లౌకిక రాజ్యాంగ పరిరక్షణలో ప్రజల పక్కన నిలబడు తుందని దేశ పౌరులుగా మేమందరం ఆశిస్తున్నాం.
ఇట్లు,
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచిన
కోట్లాదిమంది భారతీయులు