– అండర్-19 మహిళల ఆసియా కప్
– విజేతగా నిలిచిన భారత అమ్మాయిలు
– ఫైనల్లో గొంగడి త్రిష సూపర్ షో
కౌలాలంపూర్ (మలేషియా): మహిళల క్రికెట్‌లోనూ నవతరం అమ్మాయిలు అదరగొట్టారు. తొట్టతొలి మహిలల అండర్-19 ఆసియా కప్ చాంపియన్లుగా అవతరించారు. ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన టైటిల్ పోరులో బంగ్లాదేశ్ అండర్-19పై భారత అమ్మాయిలు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నారు. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (52, 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) మెరుపు అర్థ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు 20 ఓవర్లలో 117/7 పరుగులు చేశారు. ఓపెనర్ కమలిని (5), సానిక (0), కెప్టెన్ నికి ప్రసాద్ (12) సహా ఐశ్వరీ (5) విఫలం అయ్యారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ త్రిష అదరగొట్టింది. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిన త్రిష 47 బంతుల్లోనే 52 పరుగులు పిండుకుంది. టెయిలెండర్లు మిథిల వినోద్ (17), ఆయుశీ (10)ల సహకారంతో భారత్‌కు మంచి స్కోరు అందించింది. ఊరించే ఛేదనలో బంగ్లాదేశ్ అమ్మాయిలు చతికిల పడ్డారు. ఆయుశీ శుక్లా (3/17), సోనమ్ యాదవ్ (2/13), సిసోడియ (2/12) వికెట్ల వేటలో రెచ్చిపోవటంతో బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. చోయ (18), ఫెర్డోస్ (22) మినహా బంగ్లా తరఫున మరో బ్యాటర్ రెండెంకల స్కోరు దాటలేదు.