మానసిక ఒత్తిడిలో ‘యువ’భారతం

మానసిక ఒత్తిడిలో 'యువ'భారతంనవంబర్‌ 2022లో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 2030 నాటికి ఆత్మహత్యలను కనీసం పది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. విద్యాలయాల్లో మానసిక ఆరోగ్య తరగతుల నిర్వహణ, ప్రవర్తన సంబంధ విశ్లేషణలు, యువతకు సంబంధించిన దురలవాట్లకు వ్యతిరేకంగా ప్రచారాలకు యూత్‌ క్లబ్బులను నెలకొల్పడం, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్ల నియామకాలు చేపట్టాలని విద్యాలయ యాజమాన్యాలకు సూచిస్తున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఆత్మహత్యల నివారణలకు ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి యంత్రాంగాలను నెలకొల్పి నేటి యువతను సన్మార్గంలో నడపడానికి కృషి చేయాలి.
ఆత్మహత్య అనేది అత్యంత విచారకర స్వయంకృతాపరాధ ఆక్షేపణీయ అకాల మరణం. ఒక బలహీన క్షణంలో మనిషి తీసుకునే అత్యంత పిరికి లేదా ఓటమిని అంగీకరించిన అసంబద్ధ నిర్ణయమే ఆత్మహత్య. ఆత్మహత్య అనే నిర్ణయం ఏదో ఒక ”తాత్కాలిక సమస్యకు జడిసి తీసుకునే శాశ్వత పరిష్కారం”. ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఆత్మహత్యలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశంగా భారత్‌ రికార్డుల్లోకి ఎక్కడం విచారకరం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వివరాల ప్రకారం 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికి ప్రతి లక్ష మంది భారత జనాభాలో 12.4 మంది ఆత్మహత్యల ఊబిలో మునిగి బలవంతంగా ఊపిరి తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఆత్మహత్యల వివరాలు పూర్తిగా నమోదు కాకపోవడంతో వాస్తవ ఆత్మహత్యల గణాంకాలు అనేక రెట్లు అధికంగా (లక్షకు 80 మహిళలు, 34 మంది పురుషులు) ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. నమోదు అవుతున్న మొత్తం ఆత్మహత్యల్లో 41 శాతం వరకు 30 ఏండ్ల లోపు యువత ఉండడం మరింత ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా తోస్తున్నది. మహిళల మరణాల్లో ఆత్మహత్యలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. భారత్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక యువతి లేదా యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని లోటు, ఆర్థిక నష్టం, దేశ భవిష్యత్తుకు పూల్చలేని లోటుగా మిగిలి పోతున్నది.
ఆత్మహత్యలకు కారణాలు అనేకం
యువ రక్తంలో జరుగుతున్న సామాజిక, మానసిక, సాంస్కఅతిక, జీవశాస్త్ర, కుటుంబ సంఘర్షణలతో ఆత్మహత్య ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. కౌమార యువత ఆత్మహత్యలకు కారణాలుగా మానసిక అనారోగ్య సమస్యలు (54 శాతం), ప్రతికూల కుటుంబ సంఘర్షణలు (36 శాతం), విద్యపరమైన ఒత్తిడులు (23 శాతం), గృహ హింస (22 శాతం), సామాజిక/జీవనశైలి సమస్యలు (20 శాతం), ఆర్థిక నిరాశలు (9.1 శాతం), మానవ సంబంధ కారణాలు (9 శాతం)తో పాటుగా శారీరక లైంగిక నిందలు, పరీక్షల్లో వైఫల్యాలు, తరాల అంతరాల ఘర్షణలు, తల్లితండ్రుల ఒత్తిడి, కుల వివక్ష, అయిష్టమైన వివాహాలు, చిన్న వయస్సులోనే తల్లి కావడం లాంటివి గుర్తించబడినవి. 2022లో పరీక్షల్లో వైఫల్యాలు లేదా తక్కువ మార్కులు/ర్యాంకులు రావడం, విపరీతమైన పోటీతత్వం పెరగడం, అనుకున్న ఐఐటి/మెడికల్‌ కళాశాలలో సీటు రాకపోవడం లేదా ఆయా కాలేజీల్లో సీటు పొందిన తర్వాత కూడా చదువుల ఒత్తిడి పెరగడం, తల్లితండ్రుల బలవంతంతో అయిష్టంగా పోటీ పరీక్షలకు తయారు కావడం లాంటి కారణాలతో 2,095 మంది భారతీయ యువత ఆత్మహత్యలే పరిష్కారంగా తీసుకొని బలవంతంగా ప్రాణాలను కోల్పోతున్నారని తెలుస్తున్నది. డిజిటల్‌ యువతలో చోటు చేసుకుంటున్న విపరీత ధోరణులతో గత రెండు దశాబ్దాలుగా యువత ఇంటర్నేట్‌ దురలవాట్లు, సైబర్‌-బుల్లీయింగ్‌(బెదిరింపులు)ల విష వలలో పడుతున్నారు. నేటి కళాశాల యువత కనీసం 20 శాతం వరకు ఇంటర్నెట్‌ ఊబిలో చిక్కుకొని మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నట్లు తేలింది. మీడియాల్లో వచ్చే నేరాలు, ఘోరాలు, సెలబ్రిటీల ఆత్మహత్యల ప్రసారాలతో యువతలో ఆత్మహత్యల ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ”ఆత్మహత్యలు చేసుకోవడం ఎలా ?” అనే విషయంలో గూగుల్‌ సైట్లను యువత ఎక్కువగా చూస్తున్నట్లు తెలుస్తున్నది.
ఆత్మహత్యల నివారణ మార్గాలు
విద్యాలయాల్లో మానసిక నిపుణులతో తరుచుగా కౌన్సిలింగ్‌ తరగతులు, ప్రవర్తనలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించడం, భావోద్వేగ సమతుల్యతను నియంత్రించుకోవడం, సమస్యలను అధిగమించే మార్గాలు నేర్పడం, యువత ఇష్టపడే ప్రాంగణ వాతావరణాలు కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలిని (పోషకాహారం, శారీరక వ్యాయామం, పరిమిత ఇంటర్ననెట్‌ వాడడం, స్నేహితులతో గడపడం, యోగా, ధ్యానం, నిద్ర లాంటివి) అలవర్చుకోవడంతో యువతలో మానసిక ఆరోగ్యం పెరిగి ఆత్మహత్యల ఆలోచనలు తగ్గుతాయని వివరిస్తున్నారు. సానుకూల కుటుంబ వాతావరణం, గృహ హింసకు తిలోదకా లివ్వడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం, అవసర ఆర్థిక వనరులు కల్పించడం, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం ప్రధానం. సమాజంలో నెలకొన్న కళంకాలు/ దురాచారాలకు మంగళం పాడడం, కుల వివక్షను వ్యతిరేకిం చడం, కోటా రాజస్థాన్‌ కోచింగ్‌ చెరసాలల్ని నియంత్రించడం చేయాలి. రాజకీయ/సామాజిక/ ప్రభుత్వ సమన్వయాలతో కార్యాచరణ రూపొందించి ఆచరణలో పెట్టడం లాంటి చర్యలు ఆత్మహత్యల నమోదును గణనీయంగా కట్టడి చేస్తాయి.
నవంబర్‌ 2022లో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 2030 నాటికి ఆత్మహత్యలను కనీసం పది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. విద్యాలయాల్లో మానసిక ఆరోగ్య తరగతుల నిర్వహణ, ప్రవర్తన సంబంధ విశ్లేషణలు, యువతకు సంబంధించిన దురలవాట్లకు వ్యతిరేకంగా ప్రచారాలకు యూత్‌ క్లబ్బులను నెలకొల్పడం, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్ల నియామకాలు చేపట్టాలని విద్యాలయ యాజమాన్యాలకు సూచిస్తున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఆత్మహత్యల నివారణలకు ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి యంత్రాంగాలను నెలకొల్పి నేటి యువతను సన్మార్గంలో నడపడానికి కృషి చేయాలి. ఒక్క ప్రభుత్వమే కాదు సమాజంలో ఉన్న మనం కూడా జీవితం ఒక్కటే అని తెలుసుకొని, దానిని సర్వాంగ సుందరంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోవాలని నేటి ఆధునిక యువతకు హితబోధ చేద్దాం, ఆత్మహత్యలు నమోదుకాని భారత సమాజాన్ని నిర్మించుకుందాం.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037