సెల్‌ఫోన్‌, మాధ్యమాలకు బానిసగా యువత

Youth addicted to cellphone and media స్నేహితులతో కలిసి ఐపీఎల్‌ ప్రతి ఒక్క మ్యాచ్‌ను తిలకించి ఎంజారు చేస్తారు. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ, ఆ తర్వాత సెల్‌ఫోన్లలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లోకి ప్రవేశించి పందేలు కట్టడం ప్రారంభిస్తారు. ఇది ఆరంభంలో కొంత నగదు రావడంతో ఉత్సాహం ఉంటుంది. తర్వాత జేబులకు చిల్లుపడుతుంది. తొలుత బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేయడం, తర్వాత ప్రయివేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం, వాటిని తీర్చాలని అప్పులిచ్చినవారు నిత్యం వేధించడం వెరసి విద్యార్థులు, యువత పెడదారి పట్టడం పత్రికల్లో చూస్తున్నదే. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ బెట్టింగులతో నష్టపోయిన యువకులు చోరీలకు దిగి పోలీసులకు చిక్కుతున్నారు. అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో సమస్త ప్రపంచాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇది మంచి విషయం.తాము చదివే కోర్సులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవచ్చు. కొంతమంది అలా ఉపయోగించుకుంటున్నారు కూడా. కానీ, బాధ్యత తెలియని యువకులు ఇలాంటి యాప్‌ల బారిన పడి వారు బలిపశువులవడమే కాకుండా కుటుంబాలను రోడ్ల మీదకు లాగుతున్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో చిన్నారుల నుంచి మొదలుకుని నలభై సంవత్సరాల యువత వరకు తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకు సెల్‌ఫోన్‌ చూస్తూ గడిపేస్తున్నారు. విద్యార్థులైతే అవసరానికి మించి సెల్‌ఫోన్లను వాడు తున్నారు. రాత్రి నిద్రలేక ఉదయం తరగతి గదిలో నిద్రమత్తులో అధ్యాపకులు చెప్పే పాఠాలు వారికి అర్థం కావడం లేదు. దీంతో ఏకాగ్రత దెబ్బతిని చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం ఒక సమస్య, అనారోగ్య సమస్యలు తలెత్తడం ఇంకో సమస్య. కరోనా కాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇంట్లోనే ఉండాల్సి రావడం, ఖాళీ సమయం ఎక్కువగా లభించడంతో యువత సోషల్‌మీడియా బారిన పడ్డారన్నది వాస్తవం. అయితే అది నేటికీ కొనసాగుతుండటం పట్ల విద్యారంగ, ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో అశ్లీల సన్నివేశాలు, సంభాషణలు నేరుగా ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి సెన్సార్‌షిఫ్‌ లేకపోవడంతో వీటిని చూసి పిల్లలు, యువత పాడైపోతున్నారు. హింసాత్మక, లైంగిక కార్యకలాపాల దృశ్యాలు నేరుగా ప్రసారం అవుతుండటంతో దానికి ప్రభావితమై చెడిపోతున్నారు. అంతేకాదు, తలనొప్పి, కంటిచూపు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వారిని చుట్టుముడుతున్నాయి. యాంత్రిక జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు మరచిపోతున్నారు. నైతిక విలువలు, ప్రమాణాలు దిగజారిపోయి అడ్డదారులు తొక్కుతున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దందాల్లోకి దిగినట్లు పోలీసుల విచారణలో వెలువడుతుండటం ఆందోళనకరమైన అంశం. ఎనిమిది నుంచి పది గంటలు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లలో సినిమాలు, వీడియోలు చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటం చూస్తే గనుక నేటి విద్యార్థులు, యువత బానిసలుగా మారుతున్నారా? అనే ఆందోళన కూడా తల్లిదండ్రుల్లో మొదలవుతున్నది. పిల్లలు, యువతలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తలనొప్పి, కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. మత్తుపదార్థాలకు అలవాటుపడి బానిసలై నగదు కోసం నేరాలకు దిగడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు వచ్చిన తర్వాత పోలీసులు నిఘా పెట్టి పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఐపీఎల్‌ సమయంలో పెద్దఎత్తున బెట్టింగ్‌లలో యువత భారీ ఎత్తున నగదు పోగొట్టుకు న్నారు. రూ.లక్షల అప్పు చేసి తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చారు. సెల్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు, యువత పలు రకాల ఆటలాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నా రు. వారికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పిస్తే రాణిస్తారు. యోగా, ధ్యానం సాధన చేయించడం ద్వారా ఏకాగ్రత సాధిస్తారు. పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టి దారి తప్పక ముందే వారు సన్మార్గంలో నడిచేలా చూడాలి. తల్లిదండ్రులు ఎంత తీరిక లేకుండా ఉన్నా పిల్లలకు మాత్రం తగిన సమయం కేటా యించాలి. వారితో ప్రేమగా మాట్లాడి ఇష్టాఇష్టాలు తెలుసుకోవాలి. మంచి, చెడు గురించి వివరంగా చెప్పాలి. సానుకూల దృక్పథంలో ఆలోచించేలా వుండాలి. విద్యార్థులు, యువత బలహీన తలను ఆసరాగా తీసుకొని బెట్టింగ్‌ తరహా వ్యాపారాలు కొంతమంది చేస్తున్నారని, దీనిపై పోలీస్‌యంత్రాంగం గట్టి నిఘాపెట్టి దీన్ని అరికట్టే చొరవ చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత సెల్‌ఫోన్లకు, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
– తంగళ్లపల్లి కుమారస్వామి, 8106133144