యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు: ఎస్సై ఏడుకొండలు

నవతెలంగాణ –  తుంగతుర్తి
యువత మాదకద్రవ్యాలు అయిన గంజాయి డ్రగ్స్ లాంటి వాటికి బానిసలు కావద్దని తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలు అన్నారు. శుక్రవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సీఐ బ్రహ్మ మురారి పర్యవేక్షణలో యువతకు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు ఎప్పటికప్పుడు వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించినట్లయితే వాటి భారీ నుండి కాపాడవచ్చు అన్నారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని దీనికోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంతో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతుందని, దీన్ని రూపుమాపడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సూచించారు. యువత గంజాయి మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తుపదార్థాల సరఫరా ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్ఐ ఏడుకొండలు హెచ్చరించారు.