యువకులు మత్తుకు బానిసలవొద్దు

యువకులు మత్తుకు బానిసలవొద్దు– డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌
– మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లపై దాడులు
– దగ్గు సిరపు టాబ్లెట్స్‌ స్వాధీనం
నవతెలంగాణ- కోదాడరూరల్‌
గంజాయి, సిరప్‌ మత్తు పదార్థాలకు అలవాటు పడి యువకులు జీవితాలు నాశనం చేసుకోవద్దని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ అన్నారు. టాసెక్స్‌ సిరప్‌, నెట్రవేట్‌ 10 ఎంజి టాబ్లెట్‌ అనే డ్రగ్స్‌ను యువకులకు సరఫరాపై నమ్మదగిన సమాచారంతో గురువారం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్ల సమక్షంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలోని న్యూ దుర్గాభవాని మెడికల్‌ షాప్‌పై దాడులు నిర్వహించారు. షాప్‌ యజమాని రమావత్‌ రవీందర్‌ ఇంట్లో టాసెక్స్‌ సిరప్‌, నెట్రవేట్‌ 10ఎంజి టాబ్లెట్స్‌ 10 షీట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారికి సప్లై చేసిన కోదాడలోని శ్రీ వెంకట సాయి సర్జికల్‌ అండ్‌ మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ సాయి దుర్గ ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌పైనా దాడులు చేశారు. అమ్మకాల వివరాలు సేకరించి దానికి సంబంధించిన పూర్తి సమాచారం సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.