యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధమే ఉంది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని భగత్‌సింగ్ నినదించింది, దేశాన్ని కదిలించింది 23 ఏండ్ల యువకుడిగా ఉన్నప్పుడే. అల్లూరి సీతారామరాజు ‘వందేమాతరం’ అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది 24 ఏండ్లకే. ‘శీతకాలం కోత పెట్టగ/ కొరడు కట్టీ/ ఆకలేసీ కేకలేశానే’ అనే కవితతో శ్రీశ్రీ ‘జయభేరి’ మోగించింది 23 ఏండ్లకే. ‘పద్దెనిమిదేండ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే’ అని మహాకవి జాన్‌మిల్టన్ మధనపడిందీ లేలేత ప్రాయంలోనే. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. దానికి కారణం యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు- కవికి భావోద్వేగాల ఆవేశాన్నిస్తాయి. కవిత్వం నీటిబుగ్గలా ఉబుకుతుంది. ఆ స్వచ్ఛత దానికి సజీవత్వాన్నిస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులంతా దాదాపుగా ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనప్రాయంలో ఉన్నప్పుడో రాసినవే ఎక్కువ. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకవుల కవితాంతరంగం ఈ వారం కవర్‌స్టోరీ !!
యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథచక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్ఠూరసత్యం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల.. దశ, దిశలను అభివద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అటువంటి యువతను మతోన్మాదం వైపు, కులోన్మాదం వైపు.. ఉగ్రవాదం వైపు నడిపిస్తూ.. తప్పుడు వాగ్దానాలతో పాలక వర్గాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. యువతరం శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను రాజ్యం నియంతత్వంగా అణచివేస్తోంది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింత పెరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికా, ఫ్రాన్స్, ఐరోపా దేశాల్లోని యువత తమ హక్కుల కోసం రోడ్లమీదకి వస్తున్నారు. నిరసనల ప్రవాహమవుతున్నారు. ‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమిప్పితే/ లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా?’ అన్న కవి ఆశాభావం వథా పోకుండా.. మన దేశంలోనూ నిరుద్యోగ యువత గళం విప్పాలి. దేశ అభివద్ధిలో భాగస్వాములవ్వాలి.
ప్రపంచ దేశాలన్నింటి కన్నా అత్యధిక యువ జనాభా వున్న దేశం భారత్. ప్రపంచంలో 180 కోట్ల యువజనులు ఉంటే- అందులో 28 శాతం మన యువతే! మన దేశంలో ఇప్పుడు సగటు వయసు 29 ఏండ్లు. అంటే భారత్ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. మరి వుండాల్సినంత ఉత్తేజంతో.. ఉత్సాహాలతో మన యువతరం ఉందా? అంటే ప్రశ్నార్థకమే. అధికారిక లెక్క ప్రకారం- దేశంలోని 30 శాతం మంది యువతకు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేదు. ఈ విషయంలో మనం శ్రీలంక, నేపాల్ కన్నా వెనకబడి వున్నాం. సంఖ్య రీత్యా ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో వున్న మనం.. ఆ యువశక్తిని పనికి ఉపయోగించుకోవటంలో 103వ స్థానం. యువతరం అంటే కేవలం ఓట్లు కాదు, వనరులు కూడా. ఫలితమూ, ప్రయోజనమూ, ఉత్పాదకత ఉన్న రంగాల్లో యువత నిమగమై ఉండాలన్న మన స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి.. ఆచరణలో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చదువులు, సాంకేతికత పెరిగేకొద్దీ ఉత్పాదక రంగాల్లో యువత భాగస్వాములు కావాలి. కానీ, నేడు అందుకు భిన్నమైన దశ్యం కనిపిస్తోంది. సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకొని అజ్ఞానపు సామ్రాజ్యం పెచ్చరిల్లుతోంది. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై..’ విలసిల్లాలని అభిలషించిన గురజాడ వంటి మహాకవుల మాట ఇప్పుడు.. కుల, మత, ప్రాంత విభేదాల దొంతర్ల మోతలో పొల్లుపోతోంది. యువశక్తి దేశ సర్వతోముఖాభివద్ధికి, శాస్త్రీయ పురోగమనానికి, సమభావన, సౌభ్రాతత్వం విలసిల్లే దిశగా దోహదపడాలి. ‘ఓ తరం గొప్పదవుతుంది. అది మీ తరమే కావొచ్చు. మీ గొప్పదనాన్ని వికసింపనివ్వండి’ అంటారు నెల్సన్ మండేలా. నవీన పథంలోకి దేశాన్ని మళ్లించటానికి ఉపయోగపడాలి. అది ఈ తరమే కావొచ్చు.
మంచం పడ్డ తమ్ముడు తొందరగా కోలుకోవాలని ఉర్సు జాతరలో చక్కెర బెల్లం చదివించే ఒక ప్రేమ పేరు కవిత్వం.
దేశం గాని దేశం కొడుకు వలస పోయినపుడు, కాకి ఇంటి ముందు వాలితే కొడుకును చూసినంత సంబురపడే తల్లి వేదన పేరు కవిత్వం. బయట కుండబోత వాన కురుస్తుంటే లోపలి వానను కురిపించే ఇష్టమైన మనుషుల జ్ఞాపకాలు కవిత్వం.
డిసెంబర్ 27 తారీఖున హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో యువ కవి సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో కవిత్వం చదివిన కొంతమంది కవుల పరిచయాలు…
హాతిరామ్ సభావట్ : తెలుగు సాహిత్యంలో ఒకవైపు తండా జీవితాన్ని, మరొక వైపు సామాజిక సమస్యల మీద నల్లింకు పెన్నుతో సంతకం చేస్తున్న కవి హాతిరాం. ‘నల్లింకు పెన్ను’ తన మొదటి పుస్తకం. ఆ రోజు మా అమ్మ శవానికి పంచనామ చేసినట్టి
అదే పంచనామ సర్కారు దవాఖానకు చేసి ఉంటే
– మా అమ్మ బ్రతుకుదని ఆర్తితో గుండెలు కదిలిస్తాడు.
నల్లగొండ జిల్లా, డిండి మండలం, జేత్య తండా నుంచి వచ్చిన హాతిరాం మంచి వాక్యం రాస్తున్నాడు.
సలీం కందికొండ : సలీం కందికొండ మానుకోట జిల్లా నుంచి వచ్చిన కవి. తక్కువ కవితలే రాసిన, రాసిన ప్రతి కవిత ‘ప్రేమ చెప్పిన రహస్యాలను పాడుతుంది. ‘వర్షపాతాన్ని ‘మీరు కొలిచి ఉంటారు. కానీ తాను ”ప్రేమపాతాన్ని” కొలుస్తున్నాడు. సలీం కవిత్వం చదువుతూ కన్నీటి పూల వానలో, ప్రేమవానలో తడుస్తాము.
ఉప్పుల లింగన్న : కొత్త గూడెం, సూర్యపేట జిల్లాలో పుట్టిండు. లింగన్న హైద్రాబాద్ మహా నగరంలో వాచ్ మెన్ గా పని చేస్తూ కవిత్వంగా జీవిస్తున్న కవి.
తనకు వచ్చిన కవితలను వీడియోలు చేస్తూ కవిత్వం పట్ల ప్రేమను చాటుకుంటున్నాడు.
వేల్పుల మహేష్ : పత్తి కూళ్ళకు పోయి మాట్లాడుకునే తల్లుల మాటలు ఎప్పుడైనా విన్నారా ? అయితే వేల్పుల మహేష్ కవిత్వంలోకి మనం వడవాలి. సద్దిమూట విప్పినట్లు ఒక్కో తల్లి కత చెప్పుతడు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతడు.
పుట్టి పెరిగింది తొండ తిరుమలగిరి, సూర్యపేట జిల్లా.
ఒక వైపు గ్రామీణ జీవితాన్ని చూపిస్తూనే ‘ప్రేమ విఫలమై గుండె బీటలు పడినపుడు ఆ గుండెకోతను కొలిచే రిక్టర్ స్కేలు ఉండు బాగుండు’ అని కొత్త వాక్యం రాస్తున్నాడు.
చిక్కొండ్ర రవి : నల్లగొంగడి భుజాన వేసుకొని అక్షరాలను మర్లేస్తున్న ‘మందసూర్యుడు’ చిక్కొండ్ర రవి. కోయి కోటేశ్వరరావు సార్ శిష్యుడు. నాగర్ కర్నూల్ జిల్లా, బుద్దారం నుంచి వచ్చినవాడు.
”పుట్టుకకు ముందే అమ్మ కడుపుల ఉండి/
ఆకలి పాఠాల్ని చదువుకున్నోడిని. అని అంటున్న ఈ వాక్యాలలో తాను ఎదిగి వచ్చిన జీవితపు మూలాలు ఉన్నాయి.
చిలుమోజు సాయి : సంగీతం, సాహిత్యం తనకు రెండు కళ్ళు. సంగీత దర్శకుడు. జనగామా జిల్లాలో చిలుమోజు సాయి ఒక బ్రాండ్. ‘కవనతోగ’ ‘పుస్తకంతో సాహిత్యంలోకి అడుగుపెట్టి పేదల కన్నీళ్ళకు ట్యూన్లు కడుతున్నవాడు. వేలు పూలుగా వికసించాలని తపన పడుతున్న కవి.
పేర్ల రాము : మానుకోట మమతల కావ్యం పేర్ల రాము. ”ఎంట్లు గట్టె చేతులకు’ దండాలు పెడుతున్నవాడు. గ్రామీణుల బురదపాదాలను కాగితం మీద అచ్చు వేస్తున్న వాడు. సాంకేతిక మాయాజాలంలో పడిన మనుషుల మధ్య మాటల్ని, ప్రేమలని నాటుతున్న వాడు.
”మనుషుల మధ్య” కవిత్వం త్వరలో రాబోతుంది. కవిత్వంతో పాటు అనేక సాహిత్య వ్యాసాలు రాశాడు.
గుర్రాల అనూష : జగిత్యాల చైతన్యంను రెండు దోసిళ్ళ నిండా తెస్తున్న కవయిత్రి అనూష. తనకు నచ్చిన పుస్తకాల మీద సమీక్షలు రాస్తూ ఇప్పుడిప్పుడే కవిత్వం వైపు అడుగులు వేస్తున్నది. కొత్త పాటలాగా సాగిపోతున్న తాజా గొంతు తనది.
హిమాంశుక : ‘ఆమె’ ను కవిత్వం చేయడానికి తపిస్తున్న కలం. ఆమెను నదిగా వర్ణిస్తూ తేటని నీరుగా సాగిపోతున్న ఇల్లెందు కవయిత్రి.
వీళ్ళు వాన చినుకుల్లాంటి కవులు. లేత చిగుర్ల వంటి కవులు. చల్లని నెలపొడుపు లాంటి కవులు. ఎర్రని తొలిపొద్దు లాంటి కవులు . జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కవిత్వపు దారుల్లో నడుస్తున్న వాళ్ళ చిరు పరిచయం ఇది.
ప్రేమామతం
చంద్రుడింక రాత్రిరంగస్థలం మీద
చివరి అంకంలో ఆడుతున్నప్పుడే
మా బతుకుల్ని
నవ్వుదీపం చేసిందనడానికి గుర్తుగా
ఇంటి ముందు చుక్కల ముగ్గవుతుంది.
పని గంపను మోసి
మా పిల్లలకు
బతుకుతోవను చూపే
అక్షరతేజాలను కానుకగా ఇస్తుంది
పగిలిన తన పాదాలబాధను
కంటిగడప దాటి బయటకు రానీయదు
బాధ్యతపునాదిగా మారి
అనుబంధపుసౌధమై నిలుస్తుంది
సూటిపోటి మాటలకత్తులు చీరుకున్నా
మనసుగాయాలపుట్టయినా
తన చేతులకు పుండ్లైనా…!
మా కలల పంటలు పండటానికి
ఎన్ని నొప్పుల్ని భరిస్తుందో…
అప్పుడప్పుడు
నా మగవాడి అహం
మగంలా ప్రవర్తిస్తే..
నా ముందు అమాయకపు లేడిపిల్లలా
విలవిలలాడుతుంది
చెప్పాలంటే
నా కన్నా
ఆమె ఎంతో ఎత్తు
అంకితభావంలో!
తన అనురాగం ముందు
నేను చాలా దిగువమెట్టును!
తనకు కొన్న గాజుల లెక్క
చీరల లెక్కలు నా దగ్గరుంటాయి
ఆమె నా కోసం
చిందించిన త్యాగం లెక్క
నేనెపుడూ వేయలేదు!
బతుకు జట్కా బండి కి
ఇరుసు లా…
నాలో సగమై
దశాబ్ద కాలంలో
నా దశ దిశను మార్చిన దిక్సూచి….
సంసార సాగర మథనంలో
నాకు దొరికిన
ప్రేమామతం నా శ్రీమతి!
– ఉప్పుల లింగయ్య, 9550571663
ఒకే గుండె సవ్వడులం?
నేను
ఒక్కని కానే కాదు
మా తల్లి లంద సాక్షిగా….
మేం ఇద్దరం
అవని, ఆకాశాల్లా…
అముడాల మేక పిల్లల్లా మేం ఇద్దరం.
అంటరాని
చీకటి బతుకుల మీద
తూరుపు సూరీగాడు వాడైతే
పడమటి చంద్రిగాన్ని నేను.
వాడు చిర్రైతే, నేను చిటికెన
నేను డిల్లమైతే, వాడు పల్లెం
మేం ఒకే గుండె పోరు సవ్వడులం
ఒకే గూటి పిడికిలి మూల గుర్తులం
మా పలుకులు
ఈ నేల మీద
జీవధారలై పొంగిపొర్లితే,
మా అడుగులు
పాడి పంటలై పరవశించిపోయినవి.
మా తల్లి ఈరనాగమ్మ
చల్లని పడగనీడల ఒదిగిపోయిన
పసుపు కుంకుమ బొట్లం
పాట ఆటల కోడె నాగులం
వాడు లెల్లె గాడు
నేను అల్లనేరడి పిల్లగాన్ని
వాడు చిందు ర్యాల పువ్వు
నేను ఒగ్గు బీర్ల పరిమళాన్ని
వాడు
అన్యాయానికి
ఎదురు నిలిచిన మోదుగు త్యాగం
నేను ఆశయాలను ఒంపుకున్న తంగేడు రాగం
వాడు అవమానమైతే
నేను ఆవేశాన్ని, ఆక్రోశాన్ని
నేను ఆవేదనతే,
వాడు కొండంత ఆదరణ
మాది ఒకే పేగు ఓకే సాగు
వాడు
మాయన్న జాంభవ వీర బాహుడు
నేను హర బీరప్పను
మేం ఇద్దరమైనా ఒక్కరమే!
మాయవ్వ మైసవ్వ సాక్షిగా
తాకట్ల మెట్లను తగులబెట్టి
నిజాల సమ నీడలో నడయాడగా
ఒక్కటై ఒక్కనై
మాల పల్లె నుంచి
మాదిగొల్ల కురుమవాన్ని
లొల్లి బెట్టగా,
మళ్ళీ మళ్ళీ అక్షరమై వస్తుంటాను.
– చిక్కొండ్ర రవి
9502378992
ఏ ఋతువుల్ని కలగంటావు!?
ఈ పున్నానికో
వచ్చే అమాసకో
నువ్వు
వస్తాననన్నావు కదా నేస్తం.!
ప్రశ్నను వెలేసినట్టు
దామగుండాన్ని
దహన గుండంగా మార్చి
పచ్చదనాన్ని కూడా
వెలేసిన రాజ్యాన్ని దూషిస్తూ
ఇక్కడి వసంతాన్నో
శిశిరాన్నో కలగంటూ
నువ్వు ప్రయాణమైతానన్నావు కదా..!
వద్దు అక్కడే ఉండు.!
నువ్వు కలలు కన్నట్టు
ఇప్పుడిక్కడ
ఆకాశం రంగులద్దుకునే వేళ
జీవాల పలకరింపులేవి
నీ చెవినా చేరవు..!
నిన్ను స్వాగతం పలికేవి
జెట్ విమానాల చప్పుళ్ల మధ్య
బాల్యాన్ని పోగొట్టుకున్న
పసి పిల్లల ఏడుపులు
రొట్టెల్ని పోగొట్టుకున్న
తల్లుల రోదనలు
విల్లుల్ని నాగళ్ళని కోల్పోయిన
నాన్నల ఆవేదనలే
నీకు స్వాగతాలు
అయినా
యురేనియం నిక్షేపాల పేరా
తండాలు పెంటలన్ని
తగలబడి పోగా
ఇక్కడి ప్రజలంతా
ఋతువుల నుండి
వెలివేయబడుతుంటే
నువ్వు ఏ ఋతువుల్ని
కలగనాలని వస్తావు నేస్తం..!
– హాథిరామ్ సభావట్
6309862071
పుస్తకాలు పలుకరిస్తున్నారు!
ఆలోచనలేమితో నిండు నూరేళ్ళ
జీవితాన్ని ప్రసిప్రాయంలోనే
అంతం చేసుకుంటున్న నేటి తరాన్ని
సాంకేతికత మోజులో
గతస్మతులను విడిచి
తొందరపాటుతనానికి
అలవాటుపడిన నాటి తరాన్ని
పుస్తకాలు పలకరిస్తున్నారు!
గెలుపుకు సరియైన
అర్థం నేర్పడానికి
కష్టాలను భరించే ఓర్పు
సమస్యలను తొలగించే నేర్పు
బాల్యం నుంచీ అలవర్చుకోవాలని
ఓటమి వ్యధ నుండి నేర్వాల్సిన
గుణపాఠాలను చెప్పడానికి
అమ్మ చేతి గోరుముద్దలు తింటూ
విన్న చందమామ కథలతో
మనుషుల మధ్య
ఆప్యాయతానుబంధాలను
తట్టి లేపడానికి
గత చరిత్రలోని తప్పొప్పులు
తెలుసుకొని భవిష్యత్తును
తీర్చి దిద్దుకోవడానికి
అందమైన ఊహలకు రెక్కలిచ్చి
మదిలోని సజనకు
బాటలు వేసేందుకు
ఉరుకులు పరుగుల నగరజీవితంలో
కోల్పోతున్న చిన్ని చిన్ని ఆనందాలను
మాయమౌతున్న నైతిక విలువలను
మరిచిపోయిన మానవత్వపు
పరిమళాలను తట్టిలేపడానికి
నిరాశా నిస్పహలను పారద్రోలి
ఆటుపోట్లను ఆత్మ విశ్వాసంతో
ఎదుర్కోవడానికి
విజ్ఞానపు సిరులను ఒడిసిపట్టడానికి
నిండు పున్నమి వెన్నెల వంటి
ఆప్యాయతానురాగాలను
పంచిపెట్టడానికి
పుస్తకాలు పలుకరిస్తున్నారు !
– టి.హిమాంశుక
మనిషి లోగో..
మనిషి అడుగులెమ్మటి డబ్బు
వేల కాళ్ళేసుకొని నడిచొస్తుంది
మనిషి నీడలెమ్మటి డబ్బు
ఈ.ఎమ్.ఐలుగా వెంటపడుతుంది
మనిషి ఊపిరి వెంట డబ్బు
తెల్లటి బిల్లుకాగితాలై
వెంటాడుతుంది
చివరికి చావు పాడే మీదికెక్కి
మనుషుల్ని వెక్కిరిస్తూ ఊరేగుతుంది.
ఈ మధ్య
మనుషులు మనుషులుగా కంటే
ప్రింట్ అవుట్‌లోంచి
బయటకొచ్చిన నోట్లలా
మెరుస్తూనే ఎక్కువ కనిపిస్తున్నారు.
ఎటు నడిస్తే
అటుగా ఏ.టి.యం కార్డులు
చిన్నపిల్లల్లా నడిచొస్తున్నాయి
ఎటు కదిలిస్తే అటుగా డబ్బు
స్కానర్ లోంచి
గొంతువిప్పి మాట్లాడుతుంది.
మాటకు మాటకు మధ్య
రేట్లు అడ్డుపడుతున్న కాలమిది
మనిషికి మనిషికి మధ్య
డబ్బుకట్టలే నిలబడుతున్న
సందర్భాలివి!
ఇక్కడ రూపాయ బిల్లలే
కనపడని కత్తులుగా
పూతపోసుకుంటున్నాయి.
పైసలు చెట్లు ఇంట్లో కంటే
మనుషుల హదయాల్లోనే
ఎక్కువ పెరుగుతున్నాయి!.
మనిషి డబ్బును వెతకడం కంటే
డబ్బే మనిషిని వెతకడం
నాకెందుకో భయమేస్తుంది.
ఏం చేయ్యగలను
ప్రతిదీ డబ్భై కూస్తునప్పుడూ
నాకేమో మనిషి పరిమళం ఇష్టం
ఇక్కడేమో
కాగితాల వాసనకొడుతోంది.
అసలూ ఈ డబ్బు ఎద మీద
నడుస్తున్న లోకానికి
మనిషి ఎద చప్పుడెట్ల వినిపించను!
నోట్లను చూసినప్పుడల్లా
మనుషులు గుర్తొచ్చేలా
ఎట్లాంటి మనిషిలోగో
తయారు చెయ్యను..
– పేర్ల రాము
9642570294
ఋతుస్రావం
అమ్మ అవ్వడానికి పడే నొప్పిని చూసావు
చేతులెత్తి మొక్కుతావు
కానీ అమ్మాయి అయినందుకు
పడే నొప్పి గురించి ఎప్పుడైనా ఆలోచించావా ?
యుద్ధంలో రక్తముంటే
ఇక్కడ యుద్ధం రక్తంతోనే మొదలవుతుంది
మనిషి జన్మ మహా అద్భుతం
దాని వెనుకనున్న
మరో అద్బుతం అమ్మతనం
పీరియడ్స్ అంటే..
అంటరానితనం కాదు
అమ్మతనం …
పురిటి నొప్పులు ఒక్క సారే భరించాలి
కాని దానికి కారణమైన నొప్పిని
ప్రతి నెలా భరించాలి
ఎందుకంటే అమ్మాయికి ప్రతి నెలసరి తప్పనిసరి
జంతు బలి పేరిట అపవిత్రం కాని దేవాలయం
ప్రాణం పోసే రక్తంతో
అయిపోయిందేంటో కలుషితం
ఆడపిల్ల పుట్టుక ఓ పోరాటం,
బ్రతుకు ఓ పోరాటం
వాళ్ళ జీవితమే పోరాటం
ఎన్నింటినో ఎదుర్కోవాలి,
ఎన్నింటితోనో పోరాడాలి
అందులో వాళ్ళ ప్రమేయం లేని
పోరాటాలు ఎన్నో
ప్రతి నెల తనలో జరిగే కదనాలు
నిత్యం సమాజంలో చెప్పుకునే కథనాలు
ప్రాణం పోసే శక్తులు ఉన్నది వాళ్ళకే
ప్రాణం పోయే నొప్పిని తట్టుకునేది వాళ్ళే
అందుకే ప్రతి నెల ఆ ఐదు రోజులు
బాధ, నొప్పి, కోపం,చిరాకు, నిస్సహాయతను
ఇలా ఎన్నో ఎమోషన్స్ భరిస్తారు
ఆ క్షణం వాళ్లు కోరుకునేది
కొంచెం ప్రేమ,మీరున్నారానే ధైర్యం
అమ్మ కావడం అదష్టమైతే
అమ్మాయిగా పుట్టడమే వరమేమో
ప్రాణం పోసే శక్తి ఉంది వాళ్ళకేగా..
ప్రాణంగా ప్రేమించి చూడు
వాళ్ళ ప్రాణంతో పాటు
ఇంకోన్ని ప్రాణాలు కూడా ఇస్తారు .
పీరియడ్స్ అంటే..
అంటరానితనం కాదు
అమ్మతనం …
– గుర్రాల అనూష
ప్రేమపాతం
నువ్వొచ్చెళ్తావు
అదంతా సాధారణమే నీకు
తడిసీ తడిసీ
ఎంతకూ ఎండని
మట్టి పెల్లనవుతాను నేను
నువ్వొచ్చిన ప్రతిసారీ
వర్షపాతమెంతో
వాతావరణ శాఖ
నిర్ధారిస్తూనే ఉంటుంది..
నువ్వొచ్చెళ్తావు
నీకంతా సాధారణమే
నేనెన్ని మీటర్లు పాతిపెట్టబడ్డానో
ఏ వాతావరణ శాఖకూ అంతుపట్టదు
నువ్వు చినుకై కురిసినా
నువ్వు ప్రేమై ముసురుకున్నా
నువ్వు తుఫానులా విజంభించినా
నేను నిన్ను చేరడానికి నీవైపు
ఓ కాగితపు పడువనై ఉరుకులెడతాను
తీరాన్ని తాకకుండానే
మునిగిపోతాను…
నీకు గుర్తుందా..?
నేను భూమినీ, నువ్వు ఆకాశమని
చెప్పుకున్నాము కదా
నువ్వెప్పుడూ తడిసింది లేదు
నేనే చిన్న చినుకుకి
నానిపోతుంటాను…
మన మధ్యలో మబ్బులే దుఃఖాన్ని
మోసుకొస్తున్నాయి…
చుట్టూ కమ్ముకున్న
ఈ కారు మబ్బులు
బోరున రోధిస్తున్నట్టే ఉంది..
ఆ రోధనైనా నీకు వినపడుతోందా..?
నీ ప్రేమ మీద ఒట్టు
మబ్బులు మోసుకొచ్చిందంతా
నువ్వు మిగిల్చిన దుఃఖమే….
– సలీం కందికొండ
బిగి కౌగిలితో
ప్రియా
నాకిక్కడా ఇంకేం మిగల్లేదు
నీతో కలిసి బ్రతకాలనే ఆశ తప్ప..
చివరగా
నిన్నొసారి చూడాలని వుంది,
రాసుకున్న లేఖలన్ని
విద్వేషపు మంటల్లో బూడిదయ్యాయి,
ఇప్పుడు
నీ కౌగిట చేరి
జీవిత లేఖలు రాసుకోవాలనుంది
నీ కాటుకను సిరాగ అందిస్తావు కదూ !!
దేహాలు ఒక్కటైనా మనల్ని
దేశాలు వేరనే
విధ్వంసమొకటి ప్రభలుతోంది
మన ప్రేమతో పాటు
చిన్నారి తల్లుల్ని
గర్భాశయ కూనల్ని
కన్నీటి అలలపై విసిరేస్తోంది !!
బాంబు చప్పుళ్ల మధ్య
నీ నుదిటి పై
ఒక ముద్దుగా నిలవాలనుంది
ఆ ముద్దు దండోరాతో
ప్రపంచపు తల్లికి ప్రేమనొకసారి
గుర్తుచేయాలనుంది..
ఆ మధ్యదరా సముద్రం పై
ఆ వెస్టర్న్ వాల్ పై
నీ ఒళ్ళో తలవాల్చిన క్షణాలు
ప్రేమగా నిమిరిన దశ్యాలు
ఇక జ్ఞాపకాలు అవుతాయంటే
నేనెట్టా గుండెను బాదుకునేది !!
సరిహద్దులు లేని ప్రేమకు
దేశ సరిహద్దులంటూ
నిన్నాపుతున్నారా !!
నేనొస్తా
ఒళ్ళంతా గాయాలతోనైనా !!
….
ప్రేమ గీతికను బహుమానంగా తెస్తా
కొన ఊపిరిగా ఉన్నా అయినా !!
….
రాకెట్లు విసరబడుతున్న చోట
కొన్ని నవ్వుల్ని చల్లుదాం
దిక్కులు కూలకుండా
ప్రేమను అడ్డుగా పెడదాం..
ఆ సరిహద్దునా
పెదాలతో జీవ భాషనొకటి అందిద్దాం…
ప్రియమైన నీకు బిగి కౌగిలితో…
– మహేష్ వేల్పుల
తొండ తిరుమలగిరి సూర్యాపేట
అక్షరమై ప్రయాణం చేయాలని..!
ఆలోచన పుట్టింది
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
శ్రమైక జీవన సౌందర్యాన్ని
కొనసాగించాలని
భావప్రకటన మార్గంలో
ఆచరణే నా గమ్యమంటూ
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
రాగమెత్తిన పాట
పోరుబాటను వీడవద్దని
ఆదరించిన మాట
ప్రజల బాట జవదాటొద్దని
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
ఆశయాల అస్తిత్వం
చప్పట్లకు మురవోద్దని
ఆకలి అవేదనలోని
త్యాగాల సారాన్ని మరవోద్దంటూ
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
తిరుగుబాటు పుడమిలో
మౌనం వహించోద్దని
రగిలే నా గుండె గొంతుకను
దీపాల కాంతికి వధా చేయనని
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
నిజాయితీ గల వక్షంగా
స్వార్ధపు కొరలను
చీల్చుకొని చిగురించాలని
ఆత్మ వంచనకు బలి కాకుండా
ప్రశ్నించే ఆయుధమై నిలుస్తానంటూ
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
అనంతమైన
ఈ పుస్తక వనంలో
నేనో సాహిత్య సంచారినై
నిత్య పాఠకుడిగా ఎదుగుతూ
అక్షరమై ప్రయాణం
చేయాలని
ఆలోచన పుట్టింది…!
– చిలుమోజు సాయికిరణ్
జనగామ
అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417
తగుళ్ళ గోపాల్
9505056316