– అండర్-19 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ భారత్ సొంతం
– ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్లతో ఘన విజయం
– తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో
ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా యువ జోరు కొనసాగుతుంది. 2023లో తొలిసారి చాంపియన్స్‌గా నిలిచిన మన అమ్మాయిలు.. 2025 ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను సైతం అలవోకగా అందుకున్నారు. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ 9 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష (44, 3/15) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-కౌలాలంపూర్
జూనియర్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు ఎదురులేదు. టోర్నమెంట్‌లో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన భారత మహిళల అండర్-19 జట్టు.. ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన టైటిల్ పోరులోనూ దక్షిణాఫ్రికా అమ్మాయిలను చిత్తు చేశారు. సఫారీలపై స్పిన్ మాయజాలం ప్రయోగించిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. వరుసగా రెండోసారి అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకొచ్చారు. తెలంగాణ తేజం, భద్రచలం అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో మెరిసింది. తొలుత బంతితో మూడు వికెట్లు పడగొట్టిన త్రిష.. ఛేదనలో అజేయంగా 44 పరుగులు సాధించింది. మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శనతో ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు 20 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలోనే ఊదేసింది. మరో 52 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది. 2023 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కు టైటిల్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. తాజాగా జూనియర్ క్రికెట్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ టీమ్ ఇండియా చేతిలో చిత్తుగా ఓడింది. అండర్-19 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత కెప్టెన్ నిక్కి ప్రసాద్‌కు ఐసీసీ చైర్మెన్ జై షా అందజేశారు.
మాయకు విలవిల
ఒత్తిడితో కూడిన టైటిల్ పోరులో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత అమ్మాయిలు స్పిన్ అస్త్రం సంధించటంతో సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. ఓపెనర్ జెమ్మా బొథా (16, 14 బంతుల్లో 3 ఫోర్లు) మినహా టాప్ ఆర్డర్‌లో అందరూ తేలిపోయారు. సిమోనె లారెన్స్ (0), డయరా (3), రెనెక (7) సహా మెసో (10) స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. మిడిల్ ఆర్డర్‌లో వాన్ (23, 18 బంతుల్లో 3 ఫోర్లు), ఫే కౌవ్లింగ్ (15) మెరవటంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్ల పాటు క్రీజులో నిలిచింది. తెలుగు తేజం గొంగడి త్రిష (3/15) స్పిన్ మంత్రతో మూడు వికెట్లు పడగొట్టింది. ఆయుశి శుక్లా (2/9), వైష్ణవి శర్మ (2/23), పారునిక సిసోడియ (2/6) సైతం నిప్పులు చెరిగారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే వికెట్ కోల్పోగా.. నలుగురు మాత్రమే రెండెంకల స్కోరు సాధించారు.
ఆడుతూ పాడుతూ
83 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా అలవోకగా ఛేదించింది. ఓపెనర్ కమలిని (8) పవర్‌ప్లేలోనే నిష్క్రమించినా.. తెలుగు తేజం, మరో ఓపెనర్ గొంగడి త్రిష (44 నాటౌట్) ధనాధన్ దంచికొట్టింది. 8 ఫోర్లతో రెచ్చిపోయిన త్రిష.. సానిక చాల్కె (26 నాటౌట్)తో కలిసి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చింది. సానిక నాలుగు ఫోర్లతో మెరువగా.. 11.2 ఓవర్లలోనే భారత్ 84 పరుగులు చేసింది. మరో 52 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : జెమ్మా బొథా (సి) కమలిని (బి) షబ్నమ్ 16, సిమెనె (బి) సిసోడియ 0, డయార (బి) ఆయుశి శుక్లా 3, రేనెక (సి) సిసోడియ (బి) త్రిష 7, మెసో (బి) ఆయుశి శుక్లా 10, మీకె (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23, ఫే కౌవ్లింగ్ (బి) వైష్ణవి శర్మ 15, నాయుడు (బి) త్రిష 0, వాన్ (సి) వైష్ణవి శర్మ (బి) సిసోడియ 0, మోనాలిస (బి) వైష్ణవి శర్మ 0, నైని నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో ఆలౌట్) 82.
వికెట్ల పతనం : 1-11, 2-20, 3-20, 4-40, 5-44, 6-74, 7-74, 8-80, 9-80, 10-82.
బౌలింగ్ : జోషిత 2-0-17-0, సిసోడి 4-0-6-2, షబ్నమ్ శకిల్ 2-0-7-1, ఆయుశి శుక్లా 4-2-9-2, వైష్ణవి శర్మ 4-0-23-2, గొంగడి త్రిష 4-0-15-3.
భారత్ ఇన్నింగ్స్ : కమలిని (సి) లారెస్ (బి) రేనెక 8, గొంగడి త్రిష నాటౌట్ 44, సానిక చాల్కె నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (11.2 ఓవర్లలో 1 వికెట్) 84.
వికెట్ల పతనం : 1-36.
బౌలింగ్ : నైని 1-0-7-0, ఫే కౌవ్లింగ్ 2-0-19-0, రేనెక 4-1-14-1, నాయుడు 1-0-12-0, ఆష్లె వాన్ 1-0-12-0, మోనాలిస 1.2-0-10-0, జెమ్మా 1-0-9-0.
నజరానా రూ. 5 కోట్లు
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన యువ భారత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి జూనియర్ క్రికెట్‌లో టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన అమ్మాయిలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి దేవజిత్ సైకియలు అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ జట్టుతో పాటు సహాయక సిబ్బందికి రూ.5 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అమ్మాయిలు స్వదేశం చేరుకోగానే వియోత్సవ కార్యక్రమంలో సన్మానంతో పాటు నగదు బహుమతి అందించనున్నారు.
అదిరె అదిరె..
తెలంగాణ తేజం, భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి చాంపియన్ ప్రదర్శన చేసింది. 2023 అరంగేట్ర అండర్-19 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిష తాజాగా కౌలాలంపూర్‌లోనూ కేక పెట్టించింది. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలువటంతో పాటు పార్ట్ టైమ్ స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టింది. 309 పరుగులు, ఏడు వికెట్లతో ఆల్‌రౌండర్‌గా రాణించిన త్రిష ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచింది. స్కాట్లాండ్‌తో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన త్రిష.. బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించింది. ఫైనల్లోనూ బంతితో, బ్యాట్‌తో అదరగొట్టింది. అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో త్రిష అద్భుత ఆటతీరుతో భారత్‌ను విజేతగా నిలబెట్టగా.. హైదరాబాద్‌లోని ఆమె శిక్షణ పొందుతున్న అకాడమీ సహా భద్రాచలంలో పండుగ వాతావరణం నెలకొంది.