ఆన్లైన్ బెట్టింగ్ మత్తులో పడి యువత చిత్తు

– ఉద్యోగులు,యువతనే టార్గెట్
– తక్కువ కాలంలో ఎక్కువ సంపాదనే లక్ష్యంగా యువత
–  మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న ఆన్లైన్ బెట్టింగ్
– యువత తల్లిదండ్రులు దృష్టి సారించాలి
– ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే పోలీసుల దృష్టికి తీసుకోరావాలి
నవతెలంగాణ – నాగార్జునసాగర్
బెట్టింగ్..బెట్టింగ్..బెట్టింగ్…. సరదాగా మొదలెడితే అదే వ్యసనంగా మారి కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నం అయిన సంఘటనలు కోకొల్లలు..  ఒక్కసారి ఆన్లైన్ గేమ్ అలవాటైతే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్​లైన్​ బెట్టింగ్​ల రాజ్యమే నడుస్తోంది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్​లైన్ బెట్టింగ్‌లు.. క్రమేణా పల్లెలకూ పాకాయి. అంతటితో ఆగకుండా.. విద్యార్థుల చదువులను నాశం చేస్తున్నాయి. మధ్య తరగతి కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఉద్యోగులు,యువతనే టార్గెట్ గా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదనే లక్ష్యంగా  వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి అని పలు ఆన్లైన్ అప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం… ఇప్పుడు పలు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొల్లకోడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారస పడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి.
ఉద్యోగులు, యువతనే టార్గెట్…
ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ కొన్ని ఆన్లైన్ వెబ్ సైట్ మయాలోపడేసి ఉన్నదంతా దోచేస్తుంది.ఐపిఎల్,స్నూకర్,క్యాషినో ఇలాంటి తరహా అనేక ఆన్లైన్ బెట్టింగ్ యువత,ఉద్యోగులను నట్టేట ముంచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో యువత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 18-40 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉంటున్నారు. స్నేహితుల మూలంగా, చరవాణి సహకారంతో చిన్నగా, సరదాగా ప్రారంభమైన ఈ మహమ్మారి ఇల్లు, గుల్ల చేసేవరకు వదలడం లేదు. తేరుకునే సరికి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఫలితంగా వీరిని నమ్ముకున్న కుటుంబీకులు దుఃఖ సాగరంలో మునుగుతున్నారు.కొంత మంది యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి ఎంతకైనా తెగించి డబ్బులు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు.నాగార్జునసాగర్ లో జరిగిన వివిధ సంఘటనే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఒకరు ప్రజల సొమ్ము కాజేయగా, ఇంకొకరు బ్యాంకును మోసం చేయగా, ఇంకొంత మంది దొంగతనాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా యువతీ, యువకులెందరో డబ్బులొడ్డి ఆన్లైన్లో ఆటలాడుతూ జీవితాలను చేజేతులా ఛిద్రం చేసుకుంటున్నారని,ఆ వ్యసనం బారినపడిన వారిలో చాలామంది దొంగతనాలు,హత్యలకూ వెనకాడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సామాజిక ఆరోగ్యానికి చీడపురుగులుగా పరిణమించిన ఆన్లైన్ జూదక్రీడలను కఠినంగా కట్టడి చేయాలని సీనియర్ సిటీజన్స్ కోరుకుంటున్నారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ను గమనిస్తూ ఉండాలి…సి.ఐ బిసన్న
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోకుండా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నాగార్జునసాగర్ సర్కిల్ సి.ఐ బిసన్న  అన్నారు .ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయినా మహాదేవ్,దఫా బెట్, ఓనిక్స్ బెట్, రమ్మి కల్చర్, గల్లి బెట్, మొదలగు అప్స్ ద్వారా అధికముగా డబ్బులు పెట్టుబడి పెట్టి ఆర్థికముగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంతే కాకుండా కొంతమంది దొంగతనాలకు,వ్యసనాలకు బానిసవుతున్నారని కాబట్టి యువత ఇట్టి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు.అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.