టీనేజర్‌తో మీ కమ్యూనికేషన్‌

నా దగ్గరకు వచ్చిన కేసులలో… ఏడవతరగతి చదువుతున్న పిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. కొంత మంది పిల్లలు మొండిగా వ్యవహరించడం, అసలు చదువకపోవడం, ఎదిరించడం…. వీటికి కారణం పిల్లలకు తల్లి దండ్రులకు మధ్య కమ్యూనికేషన్‌ లేకపోవడం..
టీనేజ్‌లో అపారమైన విజ్ఞాన సంపద ఉంటుంది. ఎవరికీ తెలియని సరికొత్త విషయాలు కనుగొని ఉండవచ్చు. అయితే ఈ విషయం మీకు కూడా తెలియకపోవచ్చు. మీ పిల్లల విజ్ఞానాన్ని గుర్తించాలంటే వారు అర్థం చేసుకునే విధంగా మీ మాటలు ఉండాలి. వారి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విజయానికి పునాది. ఆ సామర్థ్యమే జయాపజయాలు నిర్దేశిస్తుంది.
మీరు టీనేజర్‌తో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల అది వారి మానసిక శ్రేయస్సుకు సామాజికంగా, మానసికంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వారి ఆలోచనలు, భావాల పట్ల చక్కని ఆసక్తి కలిగి ఉంటాం. అలాగే పెరుగుతున్న పిల్లల పట్ల మీ ప్రేమ గౌరవాన్ని చూపించే ఒకే ఒక్క మార్గం కమ్యూనికేషన్‌.
మీ పిల్లలకి ఆసక్తి ఉన్న వాటిపై మీరూ ఆసక్తి చూపించండి. పిల్లలను వారి అభిప్రాయాలు దక్పథాల గురించి అడగండి, తద్వారా మీరు వారి భావాలను అర్థం చేసుకోవచ్చు.
బాల్యం నుండి యుక్తవయస్సు వరకు కమ్యూనికేషన్‌ ముఖ్యం. మీ బిడ్డ బాగా కమ్యూనికేట్‌ చేస్తే, వారి భావాలు, ఆలోచనలను మీరు తెలుసుకోగలరు. కౌమారదశలో పురోగతికి ఇది ఉపయోగపడుతుంది. మీ విషయాలను పంచుకోండి. వారి ఆసక్తులను గుర్తించడానికి మార్గాలను కనుగొనండి.
వినేవారిగా ఉండండి : మీ బిడ్డ సంభాషించేటప్పుడు మీరు వినడం ముఖ్యం. మీరు బాగా వినడం వల్ల మీ పిల్లలు ఇతరులతో పర్సనల్‌ విషయాలు పంచుకోరు. మీరు టీనేజ్‌ నమ్మకాలు అభిప్రాయాలను గౌరవించాలి. ఇది వారికి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికే కాకుండా వారు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
చక్కని శరీర భాషను చూపించండి. ఐ కాంటాక్ట్‌తో, చిరునవ్వుతో, సహజ శరీర భాషతో మాట్లాడితే… మీరు వారి పట్ల శ్రద్ధ చూపుతున్నారని వారికి అర్ధమవుతుంది.
పిల్లవాడు ఎలా భావిస్తున్నాడనే దానిపై లోతైన అవగాహన పొందడానికి (ఓపెన్‌-ఎండ్‌) స్పష్టంగా ప్రశ్నలను అడగండి. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం రావడం, రాకపోవడం ద్వారా పిల్లల మనసు అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.
మీరు చెప్పవచ్చు, ”మీరు చెప్పేది నేను విన్నాను…” లేదా ”అర్థం చేసుకోవడంలో నేను సరిదిద్దుకున్నాను… ” అనే భరోసాను పిల్లలకు ఇవ్వడం చాలా ముఖ్యం.
నిర్దిష్ట, తక్షణ ప్రశంసలు ఇవ్వడం కౌమారదశను నిర్మించడానికి సహాయపడుతుంది. ‘విశ్వాసం, ఆత్మగౌరవంతో కూడిన ప్రవర్తనలను కొనసాగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు మీ బిడ్డ ఒత్తిడికి గురవుతున్నానని చెప్పినప్పుడు, మీరు ‘నీ పరిస్థితిని ధైర్యంగా నాతో చెప్పినందుకు ఆనందంగా వుంది’ అని స్పందిస్తే తర్వాతి రోజుల్లో వారు ఏ విషయాన్నైనా మీతో చెప్పడానికి సందేహించరు. ఇలాంటి ధోరణి టీనేజర్లు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది.
కొన్నిసార్లు టీనేజర్లు తమ బాధ గురించి పెద్దవాళ్లతో మాట్లాడటం అంత సులభం కాకపోవచ్చు. ఏలా చెప్పాలో తెలియకపోవచ్చు. మీరు వారి కోసం అక్కడ ఉన్నారని, మీరు ఎప్పుడైనా మాట్లాడటానికి, వినడానికి సిద్ధంగా ఉన్నారని మీ బిడ్డకు వివరించడం మంచిది. పిల్లలే వివరించలేకపోతే చెప్పాలని బలవంతం చేయవద్దు.
కమ్యూనికేషన్‌ అనేది ఇబ్బందులు లేదా కఠినమైన భావాలను పంచుకోవడానికి మాత్రమే కాదు. ఫన్నీ విషయాలను పంచుకోవడానికి కూడా. సరదాగా వుండటానికి కూడా అవకాశాలను ఇవ్వండి. కలిసి ఆనందించండి. గట్టిగా నవ్వడం మంచి అనుభూతి చెందడానికి, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి అద్భుతమైన మార్గం!

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌