– బస్సులో పురుడుపోసిన మహిళా సిబ్బందికి ఆర్టీసీ ఎమ్‌డీ సన్మానం
– చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌పాస్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నెలలు నిండిన గర్భిణి బస్సులో ప్రసవ వేదన పడుతుంటే, మానవత్వంతో స్పందించి, ఆమెకు పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అభినందించారు. శనివారం హైదరాబాద్ బస్‌భవన్‌లో సదరు ఆర్టీసీ సిబ్బందికి ఘన సత్కారం చేశారు. అదే సమయంలో బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ను ఇస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణీ ఆరాంఘర్‌లో ఎక్కారు. బహదూర్‌పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్ సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అనంతరం మెరుగైన వైద్యం కోసం బస్సులోనే సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. సకాలంలో సమయస్పూర్తితో స్పందించి కాన్పు చేసిన కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎమ్‌ఎమ్ అలీ సేవల్ని ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కష్ణకాంత్, హైదరాబాద్ ఆర్‌ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు.