మీ వాళ్లే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు..!

మీ వాళ్లే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు..!– హామీలు అమలు చేయకపోతే ప్రజలే తేలుస్తారు
– ప్రాజెక్టును కాపాడుకోకపోతే మీరు దద్దమ్మలే..
– సాగర్‌ ప్రాజెక్టు అప్పగింతపై అబద్ధపు ప్రచారొంరేవంత్‌ భాష మార్చుకో :మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
‘కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మేమెందుకు కూలుస్తాం.. మాకు అవసరం లేదు.. మీ వాళ్లే మీ ప్రభుత్వాన్ని కూలుస్తారు.. అసంతృప్తి మొదలైంది.. లేదంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని కులుస్తారు’ అని మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ నియోజవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న జరిగిన క్యాబినెట్లో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని, ఆ హామీలను అమలు చేయలేక కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ‘నువ్వు ఉన్నది మూడు ఫీట్లే.. భాష మార్చుకోవాలి.. మంచిగా మాట్లాడాలి’ అని హితువు పలికారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కాపాడుకోలేక కేంద్రం చేతిలోకి పెట్టారని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా మంగళవారం సాయంత్రం నాటికి సాగర్‌ డ్యాంపై పోలీసు బలగాల ఉంచి ప్రాజెక్టును స్వాధీనపర్చుకోవాలని సూచించారు. లేకపోతే ‘నువ్వు, నీ మంత్రివర్గం’ చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోతారన్నారు.
ఎంతో కష్టపడి కేసీఆర్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు తీసుకొస్తే దానిని ఆపేస్తామని జిల్లాకు చెందిన మంత్రి ఒకరు పదే పదే చెబుతున్నారని, దమ్ముంటే పవర్‌ ప్లాంట్‌ను ఆపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్దేశించి సవాల్‌ విసిరారు. అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్‌ త్వరలోనే ప్రజల మధ్యలోకి వస్తారని, సాగర్‌ ప్రాజెక్టుని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలిచిందని.. ఆ పార్టీని తొక్కడం చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి వల్లనే కాలేదు.. నువ్వెంత అని అన్నారు. ఏ పార్టీ కూడా రాష్ట్రంలో పది సంవత్సరాలకు మించి అధికారంలో లేదని, ఒకసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇద్దామని ఓట్లు వేశారు తప్ప కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత కాదన్నారు. రాబోయే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల పదవీ కాలం ముగిసిన సర్పంచులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు గుత్తా అమిత్‌ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ తిరునగర్‌ భార్గవ్‌, యువజన నాయకులు నల్లమోతు సిద్ధార్థ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.