బాల్యం ప్రతివ్యక్తికీ ఓ మధురమైన జ్ఞాపకాల నిధి. తవ్వినకొద్దీ వస్తుంటాయి ఆ స్మృతులు. సందర్భం వచ్చిందంటే చాలు… ఆ తియ్యని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తెగ సంబరపడిపోతాం. గుణపాఠాలు తీసుకుని ముందుకు పోతాం. బంధుమిత్రులతో ఇదో కలపోత ఆనందం. మనం చేసిన తప్పులు మన పిల్లలు చేయకూడదని జాగ్రత్తపడతాం. మనతో పాటు వారి బాల్య స్మృతులను వారికి పంచుతూ వారినీ ఉత్సాహపరుస్తాం. వారు పెద్దవుతున్న కొద్దీ వారినీ ఆ మధుర స్మృతుల్లో ముందుకు నడిపిస్తాం. ఇదో నిరంతర జీవన ప్రయాణం. అంటే బాల్యం ప్రతి ఒక్కరి జీవితానికి పటిష్టమైన పునాది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా..! బాల్యాన్ని ప్రేమించడం మానవీయ సంస్కృతికి నిదర్శనం.
నవంబర్ 14 – జాతీయ బాలల దినోత్సవం. నవంబరు 20 అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే బాలోత్సవాలు, పిల్లల పండుగలు మొదలైనవి బాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం, చర్చలు జరపడం తెలిసిందే.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారత్.140 కోట్లకు పైగా వున్న మనదేశంలో ముప్పై సంవత్సరాల లోపు వున్నవాళ్లు 60 శాతం మంది. అందుకే మనదేశాన్ని యంగ్ ఇండియా (యువభారత్) అని అంటున్నారు. అంటే 84 కోట్ల మంది. వారిలో 50 శాతం మంది (3 – 18 సంవత్సరాల మధ్య వారు) బడి వయసు పిల్లలు. అంటే 42 కోట్ల మంది. అంగన్‌వాడీ, బాల్వాడీ, నర్సరీ, పాఠశాల, జూనియర్ కళాశాల స్థాయిలో వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ అందుకు అనుగుణమైన మౌలిక విద్యావసతి సదుపాయాలు, భవనాలు, తరగతి గదులు, ఆటస్థలాలు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, ప్రయోగ శాలలు మొదలైనవి తగినంతగా లేకుండా పోయాయి. అలానే విద్యార్థుల సంఖ్యకు తగిన స్థాయిలో ఉపాధ్యాయుల సంఖ్య (కనీసం 1:40) అటు రాసిలోనూ వాసిలోనూ అందుబాటులో లేదు. నాణ్యమైన విద్యకు మన విద్యార్థులు దూరమవుతున్న విషయం అందరూ ఎరిగిందే.
ఇంటికన్నా బడిపదిలం నుండి సర్కారు బడి కన్నా కార్పొరేట్ బడే పదిలం, అందుకోలేనివారికి బడి బయటే పదిలం అనే విధంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఫలితంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు బడిబాటకు దూరమవుతున్నారు.
యునెసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) పేర్కొన్నట్టు బడి బయట వున్న బాలలందరూ బాలకార్మికులే. అంటే ఈ 42 కోట్లమందిలో మూడవ వంతుమంది అంటే దాదాపు 14 కోట్ల మంది బడి ముఖ్యం చూడని, లేదా బడి మధ్యలో చదువు ఆపేసిన బాలలే. వీరు బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్నారు. మరి వీరి భవిష్యత్‌కు, జీవితానికి ఎవరు బాధ్యత వహించాలి? విద్యాహక్కు చట్టం ఏమైంది? ఇవన్నీ మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు.
బాలలకు చాలా హక్కులు ఉన్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ప్రధానంగా ఐదు హక్కులు.
1. జీవించే హక్కు, 2. రక్షణ పొందే హక్కు, 3. అభివృద్ధి చెందే హక్కు, 4. గుర్తింపు, గౌరవం పొందే హక్కు, 5. భాగస్వామ్యం వహించే హక్కు.
జీవించే హక్కునే తీసుకుందాం. కడుపులో వున్నది ఆడశిశువు (పిండం) అని, లెక్కలేనన్ని భ్రూణ హత్యలు మన దేశంలో జరుగుతున్నాయి. చట్టరీత్యానేరం అని తెలిసినా ఈ బ్రూణహత్యలకు అంతే లేకుండా పోతున్నది. పితృస్వామిక భావజాలమే ఇందుకు ప్రధాన కారణం. చాల మతాలు ఈ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయి.
అలాగే దుర్భర దారిద్య్రంలో వున్న పిల్లలకు రక్షణ పొందే హక్కు లభించదు. సరైన నివాసం వుండదు. పోషణ వుండదు. ఐదేళ్ల లోపు బాలలు నలభైశాతం మంది కనీస పోషక విలువల లేమితో బాధపడుతున్నారని, వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేక కునారిల్లుతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి.
ఆధునిక యుగంలో వ్యక్తిగత అభివృద్ధికి పర్యాయపదం చదువు. సరైన చదువుకు దూరమయ్యే బాలల స్థితి గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ‘విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య’ అని అంబేద్కర్ పదే పదే చెప్తాడు. మరి మన విద్యావ్యవస్థ ఎలాంటి సామాజిక, మానవీయ, శాస్త్రీయ విలువలు బాలలకు అందిస్తున్నదో మనం గమనించుకోవాలి. ఇదో పెద్ద చర్చనీయాంశం. నూతన జాతీయ విద్యావిధానం అలాంటి విలువలకు పాతర వేస్తున్నదని ఎందరో విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి కూడా.
మనదేశంలో కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్ష పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. చదువుకు ఎల్లలు లేవని, బాలలందరూ సమానమేనన్న సత్యాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కనుకనే ఆ వివక్ష, కల్మషం లేని పసిపిల్లల్లో పొడచూపుతున్నది. కొందరు బాలల పుట్టుకను దృష్టిలో పెట్టుకుని వారిని నీచంగా చూడడం, హేళన చేయడం, చులకనగా మాట్లాడడం చాలా మామూలైపోయింది. అంటే ఆ బాలలకు సముచిత గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో తప్పు జరుగుతున్నది. వారిపట్ల చాలా అమర్యాదగా, అన్యాయంగా వ్యవహరించడం పెద్ద నేరం. కాగా ఆ పుట్టుక కారణంగానే వారిని అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా పాల్గోనీయకుండా దూరం పెట్టడం కూడా తీవ్ర నేరమే. భాగస్వామ్య హక్కును హరించడమే. ఇవన్నీ బాలల హక్కులు ఉల్లంఘించడం కిందనే వస్తాయి.
దాదాపు మూడో వంతు బాల్యం ఈ విధంగా బాధపడుతుంటే మనదేశం ఎలా ముందుకు పోగలదు? ఈ విషాదాన్ని మనం ఎలా నైతికంగా సమర్ధించుకోగలం? పైగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు అమానవీయంగా అమలవుతున్న ఈ దశలో కార్పొరేట్ దోపిడీ సంస్కృతి అన్ని రంగాలను కబళించేందుకు అనకొండలా తయారైంది. ఉజ్వలంగా ప్రకాశించవలసిన బాల్యం పసితనంలోనే వసివాడిపోతున్నది. వ్యక్తిగతంగా పైకి ఎగబాకాలనే ర్యాట్‌రేస్ ఒత్తిడిలో విద్యార్థులు బలవన్మరణాల పాలవుతున్నారు. ఇది బాల్యానికి మరోపార్శ్వం. విద్యార్థుల ఆత్మహత్యల్లో తమిళనాడు, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముందు వరుసలో వున్నాయి. చదువులా? చావులా? అన్న పతాక శీర్షికలు ప్రతికలకు ఎక్కుతున్నాయి. టెన్త్, ఇంటర్, ఎమ్సెట్ పరీక్షా ఫలితాలతో పాటు ఈ వార్తలు నీడలా వెన్నంటే వస్తున్నాయి. ఈ కార్పొరేట్ విద్యాసంస్కృతికి ఆశపడి ఎంతోమంది బడుగు జీవులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పుల పాలవుతూ పల్లెలు వదలి పట్నాలకు వస్తున్నారు. చేతగాని పనులు ఎన్నో చేస్తూ నరకయాతన పడ్తున్నారు. ఇంటర్ విద్య ఖర్చు 5- 10 లక్షల రూపాయల వరకు వుంటే వారి ఆస్తులు, ఆదాయం హరతి కర్పూరంలా హరించుకుపోతున్నాయి. దుర్భరమైన ఈ తల్లిదండ్రుల కష్టం కూడా పిల్లలపై అధిక మానసిక ఒత్తిడిని పెంచుతున్నది. చదువుకు తగిన ఉద్యోగం రాకపోయినా, చదువు అబ్బక పోయినా కాయకష్టం చేసుకుని నిజాయితీగా, హాయిగా బతకవచ్చు అనే ఆత్మస్థైర్యం కొరవడింది.
ఉపాధ్యాయులు ఆకర్షణీయ బోధనాపద్ధతులు మెరుగుపరుచుకోలేక పిల్లలకు పాఠ్యాంశాలపై శ్రద్ధ లేక తరగతి గదులు నిస్సారమైపోతున్నాయి. చదువు కేవలం మార్కుల కోసమే అన్న పద్ధతుల్లో గైడ్‌లు ఇచ్చి పిల్లల చేత బట్టీ పట్టిస్తూ, చూచిరాతలు రాయిస్తున్నారు. యాంత్రికంగా మారుతున్న చదువు పట్ల ఎవరూ సిగ్గుపడటం లేదు. తల్లిదండ్రులు కూడా ఆ మార్కులు, ర్యాంకుల పట్ల పరుగుతీయడం శోచనీయం.
పులిమీద పుట్రలా ఇప్పుడు బాల్యంపై డ్రగ్ (మత్తుపదార్థాల) పంజా కూడా విప్పింది. ఈ యంగ్ ఇండియాను (యువభారత్) డ్రగ్ ఇండియాగా మార్చేందుకు కార్పొరేట్ శక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రెండు లక్షల మంది డ్రగ్ వాడకం దార్లు వుంటే ఇప్పుడు ఆ సంఖ్య పదికోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దాటుకుని పాఠశాలలకు చాక్లెట్స్ రూపంలో చేరడం పెనువిషాదం. అలాగే సెల్‌ఫోన్ వాడకం విశృంఖులత్వంలో అన్‌లైన్ బెట్టింగ్‌లు, బ్లూవేల్స్ వంటి ప్రమాదకర వీడియోగేమ్స్, హద్దూ అదుపూ లేని పోర్న్‌కల్చర్‌కు (బూతు చిత్రాల సంస్కృతి) బానిసలవుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ఈ ప్రమాదకర విషపు సాలెగూడులో బాల్యం చిక్కుకుంటున్నది. లైంగిక విశృంఖలతో నేరాలకు, ట్రాఫికింగ్‌కు (వ్యభిచార విక్రయాలకు) బాల్యం బలైపోతున్నది.
వీటన్నిటిపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం క్షమించరానిది. మత్తు, మాదక ద్రవ్యాలను, పోర్న్ కల్చర్‌ను బేషరతుగా అరికట్టాల్సిన నేతలు కొందరు బాహాటంగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టడం, దందాలు నిర్వహించడం, అక్రమ రవాణా (ట్రాఫికింగ్) మాఫియాగా వ్యవహరించడం కూడా మనం గమనిస్తున్నాం. కంచే చేను మేస్తున్నట్టుగా పరిస్థితి తయారైంది. వీరిని బాల్య రక్షకులు కాదు బాల్యభక్షకులు అన్నా తప్పులేదు.
ఈ నేపథ్యంలో బాల్యాన్ని పరిరక్షించేందుకు కేవలం ప్రభుత్వాలపైనే ఆధారపడక ఎక్కడికక్కడ పౌరసమాజం మేల్కొని ఉద్యమంలా కదలాలి. తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకునే విధంగా పిల్లలకు శిక్షణనీయాలి. కెరీర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమన్న పద్ధతుల్లో విద్యాబోధన సాగాలి. శ్రమను గౌరవించడం (డిగ్నిటీ ఆఫ్ లేబర్), ప్రశ్నించడం నేర్పాలి. మానవులందరూ సమానమేనన్న సమతా ధర్మాన్ని పాటించేలా చేయాలి. బాల్యం భవిష్యత్తులోనే దేశ భవిష్యత్తు దాగి వుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి శాస్త్రీయ విద్యకు బాటలు పరిచినప్పుడే మనదేశానికి పురోగతి వుంటుంది.
– కె.శాంతారావు, 9959745723