యూత్ క్లై‌మేట్ ఛాంపియ‌న్ ప్ర‌జ‌క్తా కోలి

Youth Climate Champion Prajakta Koliప్రజక్తా కోలి… అత్యంత ప్రభావవంతమైన కంటెంట్‌ సృష్టికర్తగా, కార్యకర్తగా, నటిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తన తరానికి ఒక ట్రయల్‌బ్లేజర్‌గా ఆమెను చెప్పుకోవచ్చు. ఇటీవలె ఆమె న్యూయార్క్‌ నగరంలో జరిగిన క్లైమేట్‌ వీక్‌ 2024లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ ప్రతినిధులలో ఒకరిగా నిలిచి గ్లోబల్‌ యూత్‌ క్లైమేట్‌ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గొప్ప ప్రణాళికను రూపొందించుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ప్రజక్తా కోలి మహారాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. తల్లి అర్చన కోలి ఫొనెటిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ ఉపాధ్యాయురాలు. తండ్రి మనోజ్‌ కోలీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. చిన్నప్పటి నుండి రేడియో వినడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆరో తరగతిలో ఉన్నప్పుడే రేడియో జాకీ కావాలని కలలు కన్నది. థానేలోని వసంత్‌ విహార్‌ హైస్కూల్‌లో చదువుకుంది. పాఠశాల స్థాయిలోనే ఆమె తరచుగా ఉపన్యాస పోటీల్లో పాల్గొనేది. ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ములుండ్‌లోని వి.జి.వాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ నుండి బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియాలో పట్టభద్రురాలయింది.
జీవిత పరిస్థితులకు అద్దం పడుతూ…
రేడియోను ఎంతో ప్రేమించే ప్రజక్తా ముంబైలోని ఫీవర్‌ 104 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో ఇంటర్న్‌గా మీడియా జీవితాన్ని ప్రారంభించింది. ఏడాది పాటు అందులో ఇంటర్నింగ్‌ చేసి తన మొదటి షో కాల్‌ సెంటర్‌ను ప్రారంభించింది. మోస్ట్‌లీసెన్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వీడియోలన్నీ రోజువారీ జీవిత పరిస్థితులకు అద్దం పడుతూ, ఎంతో పరిశీలనాత్మకంగా, హాస్యాస్పదంగా ఉంటాయి. అందుకే భారతీయ యూట్యూబర్లలో మంచి కంటెంట్‌ సృష్టికర్తగా గొప్ప పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ప్రదర్శనలు, చలనచిత్రాల కోసం రాయడంలో బిజీగా గడుపుతుంది. తనకు ఆనందం కలిగించే కంటెంట్‌పైనే ఆమె దృష్టి పెడుతుంది. అలాగే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తోంది. జగ్‌ జగ్‌ జీయో(2022) చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నూతన నటీమణిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారానికి నామినేట్‌ చేయబడింది. లాయర్‌ అయిన వృషాంక్‌ షనాన్‌తో 2013లో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.
కీలక ప్రసంగాలు
కేవలం తన కెరీర్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి సామాజిక సమస్యపై స్పందించే ప్రజక్తా ఇటీవల యూట్‌ క్లైమేట్‌ వీక్‌కు తన గొంతు వినిపించింది. ఖచీణూ తరపున భారతదేశానికి మొట్టమొదటి యూత్‌ క్లైమేట్‌ ఛాంపియన్‌గా ఉన్న ప్రజక్తా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సమిష్టి ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యువకులను ఏకం చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆమె చేస్తున్న ఈ ఉద్యమం విద్య, న్యాయం, అట్టడుగు స్థాయి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. మోనికర్‌ మోస్ట్లీ సేన్‌ ద్వారా వెళ్లే ఈ 31 ఏండ్ల ప్రముఖ డిజిటల్‌ సృష్టికర్త కీలక ప్రసంగాలు, ప్యానెల్‌ చర్చలు, వర్క్‌షాప్‌లతో సహా ఉన్నత స్థాయి ఈవెంట్‌ల శ్రేణిలో పాల్గొంటుంది. యువత నేతృత్వంలోని వాతావరణ విప్లవం కోసం ఆమె తన దృక్పథాన్ని పంచుకుంటుంది. ఇతరులను ఈ ఉద్యమంలో చేరేలా ప్రేరేపిస్తుంది. కీలకమైన వాటాదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది. మీడియా ప్రభావం, స్థిరమైన అభివృద్ధి, సొల్యూషన్స్‌ హౌస్‌ క్రియేటర్‌ ప్యానెల్‌, గోల్స్‌ హౌస్‌ బ్రేక్‌ఫాస్ట్‌ రౌండ్‌టేబుల్‌, హోప్‌ హౌస్‌ రౌండ్‌టేబుల్‌, వెరిఫైడ్‌ రౌండ్‌టేబుల్‌ గురించి చర్చించే యుఎన్‌ ప్రధాన కార్యాలయంలోనిUNDP ప్యానెల్‌లో ఫీచర్‌ చేసిన స్పీకర్‌గా ఆమె పాల్గొనడం ఆమె ఎజెండాలోని ముఖ్యాంశం. దీంతో పాటు సమ్మిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌, ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ వంటి కీలక ఈవెంట్‌లకు కూడా ఆమె హాజరవుతుంది.
యువశక్తి అవసరం
గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా గోల్‌కీపర్స్‌కు సలహా సభ్యురాలిగా పనిచేస్తున్న ప్రజక్తా గోల్‌కీపర్స్‌ సమ్మిట్‌కు కూడా హాజరవుతుంది. ఈ సమ్మిట్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ UNDP వైపు పురోగతిని వేగవంతం చేయడానికి ప్రపంచ నాయకులను, మార్పుకు ప్రయత్నించే వారిని ఒకచోట చేర్చింది. ఇక్కడ ప్రజక్తా ప్రపంచ వాతావరణం, అభివృద్ధి లక్ష్యాల పట్ల తన నిబద్ధతను నొక్కి చెబుతుంది. ‘వాతావరణ సమస్యల గురించి కథ రూపంలో చెప్పేందుకు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో యువత కీలకమని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ప్రపంచ ఉద్యమంలో పాల్గొనడం రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యువత శక్తి చాలా అవసరం. అందరం కలిసి మన స్థిరమైన భవిష్యత్తును రూపొందించుకోగలం. ఇందులో నా ప్రయాణాన్ని నా అనుచరులతో పంచుకోవడానికి, ఈ ఉద్యమంలో భాగమయ్యేలా వారిని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను’ అని ఆమె పంచుకుంది.
సోషల్‌ మీడియాలో 17 మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రజక్తా అర్థవంతమైన మార్పు కోసం నితరంతరం కృషి చేస్తూనే ఉంది. ఖచీణూ భారతదేశపు మొట్టమొదటి యూత్‌ క్లైమేట్‌ ఛాంపియన్‌గా ఆమె అందులో కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణంతో పాటు యువత సాధికారత, లింగ సమానత్వం కోసం కూడా ఆమె ప్రపంచ వ్యాప్తంగా తన గొంతు వినిపిస్తుంది.