
– ప్రధాన పార్టీల చూపు వీరిపైనే
– మంథనిలో పెరిగిన ఓట్లు 23.591
నవతెలంగాణ- మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంథని నియోజకవర్గంలో యువ ఓటర్లే కీలకం కానున్నారు.కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం పలుమార్లు గడువు ఇవ్వడంతో 18 ఏళ్ళు నిండినవారు అధిక సంఖ్యలో నమోదు చేసుకున్నారు. దీంతో ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో యువ ఓటర్లు నమోదైయ్యారు.దీంతో ప్రధాన పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బిఎస్పీ ప్రత్యేక విభాగాలు పని చేస్తున్నాయి.ఎన్నికలకు ఇంకా 13 రోజుల సమయమే ఉండడంతో ఆయా పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో యువ ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా వారిని తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ముంచుతారో.. తెల్సుతారోననే భయం..
మంథనిలో 2018లో గెలిచిన అభ్యర్థి,ఓడిన అభ్యర్థి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం పెరిగిన యువ ఓటర్ల సంఖ్య దాదాపుగా దీనికి సమానంగా ఉండటంతో ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మొత్తం ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల వయస్సువారే అధికంగా ఉండటంతో వారు తమను ముంచుతారో.. తెల్సుతారోనని అన్ని పార్టీలు భయపడుతున్నాయి.బయటకు మాత్రం పెరిగిన ఓట్లు తమకే లాభం చేకూరుస్తాయని చెప్పుకున్నప్పటికి లోపల ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం.
కొత్త ఓటర్లు @ 23.591..
మంథని నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,30.306 ఉండగా యందులో పురుషులు 1,13,828,శ్రీలు 1,16,458 ఉన్నారు. తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకునేవారు 8.716 మంది, 18 నుంచి 39 ఏళ్ల లోపు ఓట్లు అధికంగా 50 శాతానికి పైనే ఉన్నాయి.20 నుంచి 29 ఏళ్ళ వారు 51,575 ఉండగా 30 నుంచి 39 ఏళ్ల లోపు వారు 63.667 మంది,40 నుంచి 49 ఏళ్ల వారు 44,406 మంది, 50 నుంచి 59 ఏళ్ల వారు 33.608 మంది,60 నుంచి 79 ఏళ్ల లోపు వారు 20.760 మంది,70 నుంచి 79 ఏళ్ల వారు 10.691 మంది, 80 ఏళ్ల వారు 3,019 మంది ఉన్నారు.
70 వేలు వస్తే గెలిసినట్లే..?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై అభ్యర్థులు ఇప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు.మిగతా నియోజవర్గాలకు భిన్నంగా మంథని నియోజకవర్గం పోలింగ్ శాతం ఉంటుంది. నియోజకవర్గంలో 2.30.306 ఓటర్లు ఉన్నారు.అయితే ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొలయ్యే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు.ఈ లెక్కన సుమారుగా 1.84.244 ఓట్లు పొలయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తే 70 వేలకు పైగా ఏ అభ్యర్థికి ఓట్లు పడతాయో అట్టి అభ్యర్థిని విజయం వరించవచ్చు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.