”కొంతమంది కుర్రవాళ్లు/ పుట్టుకతో వద్ధులు/ కొంత మంది యువకులు /ముందు యుగం దూతలు/ నవజీవన బృందావన నిర్మాతలు” అన్నాడు శ్రీశ్రీ. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. కొందరు ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటుండగా మరికొందరు చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడుతున్నారు.
కొంతమంది యువత ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా, వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మళ్లుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల గతి తప్పుతుంది.
నేడు పరిగెడుతున్న సాంకేతిక విప్లవానికి తోడుగా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఫోన్ చేతిలో ఉంటే సమస్తం ఉన్నట్లే అని భావించే కొందరు యువకులు అదేపనిగా వాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వీటితో మోసాలకు పాల్పడుతూ నేరగాళ్లుగా తయారవుతుండడం కలవరపాటుకు గురిచేస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదని కొన్నిచోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల చదువుల పేరిట సెల్‌ఫోన్ వాడడం సాధారణమైంది. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, లాప్‌టాప్‌ల మోజులో పడి నీలి చిత్రాలకు ఆకర్షితులవుతున్నారు. పిల్లలకు కళాశాల స్థాయిలోనే ఖరీదైన బైకులు కొని ఇస్తుండడంతో అతివేగంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కాలేజీల పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్లి సినిమాలు, రిసార్ట్‌లు, పబ్బులు, వెంచర్లకు వెళ్తూ ఎంజారు చేస్తున్నారు. ఇంటర్‌లోనే మందు కొడుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఆపై స్థాయి విద్యలో చెడు అలవాట్లకు బానిసగా మారి హద్దులు దాటుతున్నారు. గంజాయి సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. యాదాద్రి జిల్లాలో కూడా యువత వీటికి అలవాటు అవుతున్నారు. కొన్నిచోట్ల మద్యానికి బానిసైన వారు డబ్బులు లేకపోవడంతో హత్యలకు పాల్పడుతున్నారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తూ వేరేవారి మరణాలకు కారణమవుతున్నారు. అలాగే జల్సాల కోసం నేరాల బాట పడుతున్నారు.
గుర్తించకపోతే ముప్పే
చెడుబాట పడుతున్నట్లుగా ఇంట్లో మొదట గుర్తించాల్సింది తల్లిదండ్రులే. విద్యార్థి దశలో చెడు స్నేహాలతో సిగరెట్, మందుకు అలవాటు పడిన వారు మత్తు పదార్థాల వైపు కచ్చితంగా వెళ్తారు. వారిని గుర్తించాలి. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుంటే చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. చదువులో వెనకబడడం, పరీక్షలు బాగా రాయకపోవడం, ఒంటరిగా ఉండడం, ప్రవర్తనలో మార్పు, ఆలస్యంగా నిద్ర పోవడం, సెల్‌ఫోన్‌తో గడపడం, అబద్దాలడడం వంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు గుర్తించాలి. చిన్నవాటికి, పెద్దవాటికి కోపం, చికాకు చూపడం చేస్తుంటారు. వారిపై ఒక కన్నేసి చూడాలి. గంజాయి తాగే వారి కండ్లు ఎరుపుగా ఉంటాయి. వారిని గుర్తించాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండకుండా చూడాలి. కాసేపు మనసు విప్పి వారితో మాట్లాడాలి. పిల్లలకు అతిస్వేచ్ఛ ఇవ్వవద్దు. ఖాళీ సమయాల్లో ఎవరితో స్నేహాలు చేస్తున్నారో చూడాలి. పిల్లలకు ఇష్టారీతిన పాకెట్ మనీ ఇవ్వవద్దు.
నైతిక విలువలకు ప్రాధాన్యం
నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండి, చదువు, కెరీర్‌పై దష్టి సారించేలా చూడాలి. మానవత్వం గురించి వివరించాలి. సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదాలు, షికార్లే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రలోభాలకు గురి కాకుండా ఒక కన్నేసి చూడాలి. వాట్సప్, ఫేస్‌బుక్‌లతో కాలాన్ని వథా చేయకుండా చూడాలి. కళాశాలల యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి. ప్రేమ పేరుతో పిలిస్తే యువతులు ఒంటరిగా వెళ్లకపోవడం మంచిది.
ఒక్క క్లిక్‌తో
అందమైన రూపం.. ఆకర్షించే సంపాదన. ఒక్క క్లిక్‌తో ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ కనికట్టు. నచ్చిన జోడును ఎంపిక చేసుకోవచ్చంటూ ఊరింపు. ఒక్కసారి చిక్కారా.. జేబులైనా ఖాళీ కావాలి.. ఒళ్లయినా హూనం చేసుకోవాలి. ఎంతోమంది డేటింగ్‌యాప్ మోసాల్లో బాధితులుగా మారుతున్నారు. గౌరవమైన వత్తిలో ఉంటూ మాయాజాలానికి చిక్కినట్టు తెలిస్తే పరువు పోతుందనే భయంతో 90శాతం మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదంటున్నారు పోలీసులు.
ఐటీ ఉద్యోగిని జీవితభాగస్వామి కోసం డేటింగ్‌యాప్‌లో వెతికింది. యువకుడి ప్రొఫైల్ నచ్చి ఒకే చెప్పింది. యూకేలో వైద్యుడినంటూ పరిచయం చేసుకొని వ్యక్తిగత అవసరాలంటూ రూ.15లక్షలు కొట్టేసి ముఖం చాటేశాడు.
యాప్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ముహూర్తం కోసం ఎదురుచూస్తుండగా అప్పటికే పెళ్లయినట్టు తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న యువకుడికి రాయచూర్‌లోని యువతి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైంది. యువతిని హైదరాబాద్ రప్పించి, శీతలపానీయంలో మత్తు మందు కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
గతంలో నైజీరియన్లు మాత్రమే పాల్పడే మోసాల్లో ప్రస్తుతం తెలుగు కుర్రాళ్లు కూడా ప్రారంభించారని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వలపు ఎర
వ్యభిచార ముఠాలు దేశ, విదేశీ యువతులకు కమీషన్ ఆశచూపి డేటింగ్‌యాప్‌ల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఆయా యాప్‌ల్లో నమోదైన వారిలో సంపన్నులతో ఛాటింగ్ చేస్తారు. ఏకాంతంగా గడిపేందుకు హైదరాబాద్‌లో హోటల్‌గది బుక్ చేయిస్తారు. సెల్‌ఫోన్‌తో వీరి రాసలీలలు చిత్రీకరించి.. బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజుతారు. ఇటీవల ప్రధానపార్టీకి చెందిన చోటా నేత రూ.3లక్షలు పోగొట్టుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో విదేశీ యువతులు అద్దెకు దిగారు. యాప్ ద్వారా పరిచయమైన పురుషులను ఆహ్వానించేవారు. అపార్ట్‌మెంట్ కిందభాగంలో ఉన్న ఏజెంట్లు వారిని బెదిరించి నగదు లాక్కునేవారు. పోలీసుల దష్టికి వెళ్లటంతో ముఠా ఆటకట్టించారు.
మానసిక ఒత్తిళ్లు
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 సుస్థిరాభివద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధించడానికి యువత పాత్రే కీలకం. నేడు ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్నది భారత్‌లోనే. 2030కల్లా మనదేశంలో 36.5 కోట్ల మంది 15-29 ఏళ్ల వయోవర్గంలో ఉంటారని అంచనా. ఇండియాలో 35 ఏళ్లలోపువారి సంఖ్య 80.8 కోట్లని 2022 ఆగస్టులో ప్రకటితమైన జాతీయ యువజన విధానం చెబుతోంది. వీరు దేశ జనాభాలో 66 శాతం. నాణ్యమైన విద్య, గౌరవంతో కూడిన పని పరిస్థితులు, ఆర్థిక అభ్యుదయం వంటి ఐరాస సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనను జాతీయ యువజన విధానంలో అంతర్భాగం చేశారు. ఐక్యరాజ్య సమితి యువజన నివేదిక ప్రకారం- నేడు ప్రపంచంలో 20కోట్ల మంది యువజనులు పేదరికంలో మగ్గుతున్నారు. 13కోట్ల మంది నిరక్షరాస్యతతో, 8.8 కోట్ల మంది నిరుద్యోగంతో సతమత మవుతున్నారు. సుమారు కోటి మంది యువజనులు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. 50కోట్ల మంది రోజుకు రెండు డాలర్లకన్నా తక్కువ సంపాదనతో నెట్టుకొస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతల వల్ల అనేక రంగాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు చాలామందికి ఉండటంలేదు. వారికి అధునాతన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు కొత్త ఉద్యోగాలను, ఉద్యోగ భద్రతను కల్పించడానికి ప్రభుత్వాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అనేక ఇతర దేశాల మాదిరిగానే భారత్‌లోనూ నిరుద్యోగం తీవ్రంగా ఉంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కొరవడినందువల్ల భారత్‌లో నిరుద్యోగిత పెచ్చుమీరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గడచిన నవంబరులో వెల్లడించింది. 2023 జులైలో 7.95శాతంగా ఉన్న స్థూల నిరుద్యోగిత రేటు అక్టోబరుకల్లా 10.05శాతానికి పెరిగింది. 15-24 ఏళ్ల వయోవర్గంలో 2022-23లో నిరుద్యోగిత ఏకంగా 45.4శాతం ఉండటం తీవ్ర ఆందోళనకరం. సరైన చదువు, నైపుణ్యాలు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు సగం మంది యువతీ యువకులు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇటీవలి కాలంలో అంతర్జాలం వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న యువత మానసిక స్థితిపై సేపియన్స్ ల్యాబ్స్ సంస్థ అధ్యయనం జరిపింది. దాని ప్రకారం నిరుడు దేశీయంగా 51శాతం యువత మనోవ్యధకు గురయ్యారు. 2020తో పోలిస్తే వీరి సంఖ్య పెరిగింది. మనో వ్యధ నుంచి యువతను బయటకు తేవాలి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417