వరి నాట్లకు దూసుకెళ్తున్న ఒరిస్సా యువకులు..

The youth of Orissa, rushing to the paddy fields..– ఊపందుకున్న యాసంగి సీజన్
నవతెలంగాణ – బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ పనులలో రైతులు బిజీబిజీగా అయ్యారు. యాసంగి సీజన్ వ్యవసాయ పనుల్లో ఊపందుకున్న సరికి అసలు తీరిక ఉండడం లేదు.పొద్దుతో కూలీలు పోట పోటీ పడుతున్నారు.తెలంగాణలోని పలు ప్రాంతాలలో రైతులు వరి నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ పొలం పనుల్లో నిమగ్నం కావడం వల్ల కూలీల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే,బొమ్మలరామరం మండలంలోని పకీర్ గూడెం గ్రామంలో రైతు పొలం వద్ద  ఒరిస్సా యువకులు అతి తక్కువ ధరకే వరి నాట్లు వేయడంతో వీరికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.సాధారణంగా వరి నాట్లు వేయడానికి మహిళలు ఒక ఎకరానికి రూ.6500 నుండి రూ.7500 వరకు రైతుల నుంచి వసూలు చేసేవారు. ఈ క్రమంలోనే ఎక్కువ పొలం ఉన్న వారికి అధిక మొత్తంలో పెట్టుబడి అయ్యేది. అయితే ఒరిస్సా యువకులు ఒక ఎకరానికి రూ.5000 మాత్రమే తీసుకోవటం చేత రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ ఒరిస్సా యువకులకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిపోయింది.ఈ యువకులు 20 మంది చొప్పున ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.వీరు ఒక్కో రైతు వద్ద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అంత పని కుదుర్చుకుని ఆ పొలం పని పూర్తయ్యే వరకు ఇతరులకు వెళ్లరు.వీరు ఈ పనులు మొత్తం పూర్తయ్యేవరకు అక్కడే ఎక్కడో ఒక చిన్నపాటి గుడిసె వేసుకొని నివసిస్తుంటారు. రైతులు కూడా తక్కువ ధరకే వరినాట్లు వేయడంతో చాలామంది రైతులు ఒరిస్సా యువకుల చేత వరి నాట్లు వేయించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు రైతులు మాట్లాడుతూ ఒరిస్సా కూలీల వల్ల తమకు ఎంతో డబ్బులు ఆదా అయ్యాయని, వరి నాట్లు కూడా ఎంతో చక్కగా వేస్తున్నారని ఈ సందర్భంగా నవ తెలంగాణ తో తెలిపారు.