నేటి యువత డ్రగ్స్ రహిత సమాజంలో భాగస్వాములు కావాలని ముందు తరాలకు నవ సమాజాన్ని అందించాలని ములుగు డిఎస్ పీ రవీందర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ వారికి వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు డి.ఎస్.పి రవీందర్ హాజరై మాట్లాడారు. జిల్లా ఎస్ పీ డాక్టర్ శబరిస్ ఐపీఎస్ ఆశయం డ్రగ్స్ రహిత ములుగు జిల్లాగా ఉండాలన్నదే లక్ష్యంగా యువతకు అవేర్నస్ కల్పిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం యువత కొద్దిమంది కుటుంబ సమస్యలు కావచ్చు, సహవాస దోషం కావచ్చు, మరి ఏదైనా కారణాల వల్ల గంజాయి వంటి మారకద్రవ్యాల వినియోగానికి అలవాటు పడి బానిసలై ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సింది పోయి భారమై ఉంటున్నారని అన్నారు. యువతలో స్ఫూర్తిదాయకమైన ఆలోచనను రేకెత్తిస్తూ మత్తుకు కారణమైన ప్రభుత్వ నిషేధిత మారకద్రవ్యాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రధానంగా తల్లిదండ్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు యువతలో ఈ ఆలోచనను తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే పోలీసుల సలహాలు సూచనలు తీసుకోవాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసుగా తమ సహకారాన్ని కూడా తీసుకోవాలని అయినా ఇంకా పద్ధతి మారకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. పట్టుకుని కేసులు పెట్టి జైలకు పంపాలన్నది పోలీసుల లక్ష్యం కాదని మార్పు కోసం అందరము సమిష్టిగా ప్రయత్నిద్దామని, సాధ్యం కాని పరిస్థితుల్లో చట్టాన్ని వినియోగిద్దామని అన్నారు. ఈరోజు నిర్వహిస్తున్న ఈ క్రీడల పట్ల యువత భారీగా రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ స్పందన చూస్తుంటే తమ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలిస్తుందన్న ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అనంతరం యువతకు వాలీబాల్ క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. క్రీడాకారులకు సభకు హాజరైన వారికి ఈ సందర్భంగా భోజనం సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఏ కమలాకర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కొత్తపల్లి ప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.