– స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ స్నాతకోత్సవంలో
– రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
నవతెలంగాణ-మియాపూర్
దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరై ప్రసంగించారు. ప్రపంచంతో పోటీ పడుతూ కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కిల్స్ రీ స్కిల్స్ ఆఫ్ స్కిల్స్ పద్ధతిలో యువత ముందుకెళ్లాలని అన్నారు. ప్రపంచానికే సవాల్‌గా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మిషన్ లెర్నింగ్‌లో నైపుణ్యం పెంచుకున్నప్పుడే యువత రాణిస్తుందని చెప్పారు. డ్రీమ్ బిగ్ అచీవ్‌మెంట్ బిగ్ పద్ధతిలో నూతన ఆవిష్కరణలో యువత స్వాగతించాలని అన్నారు. నెల్సన్ మండేలా, స్వామి వివేకానంద, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి ఎంతోమంది మేధావులు యువతకు అద్భుతమైన సందేశాలను ఇచ్చారని తెలిపారు. అపారమైన శక్తి వినియోగంలోకి వచ్చినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుతాయని, అప్పుడే అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. యువత తాము కష్టపడి చదువుకున్న చదువులకు దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలని సూచించారు.
ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ వీబీ సింగ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యలో 15 విభాగాలు కీలకం అని అన్నారు. ప్రస్తుతం దేశంలోని 125 నగరాల్లో ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ శాఖలున్నాయని, 2.60 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఈ సంస్థ భాగస్వామ్యం ఉందన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఈ కాలేజీలో 12 విభాగాల్లో ఏడాదిలో కనీసం ఏడు వేల మంది ఇంజనీర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. 1981లో నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రారంభించిన ఈ కాలేజ్.. ఆసియా ఖండంలోనే ఇక్కడే ఉందని, ఎక్కడ లేదన్నారు. ఈ సందర్భంగా వివిధ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలను గవర్నర్ అందజేశారు. అంతకుముందు విద్యార్థులతో ఈ దేశ ప్రగతికి తమ విద్యను అంకితం చేస్తున్నట్టు గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్ మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.