– జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-జైపూర్
బంగారు భవిష్యత్తు కలిగివున్న యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి జైపూర్ సబ్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జైపూర్ మండల కేంద్రంలో స్థానిక ఎస్సై శ్రీధర్, భీమారం మండల కేంద్రంలో స్థానిక ఎస్సై రాములు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహణ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యతని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి యువకులు జీవితాలను నాశనం చేసుకోవద్దని, స్నేహితులు, తెల్సిన వారు ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటుపడితే వెంటనే దూరంగా ఉండే విధంగా కృషి చేయాలని సూచించారు. గంజాయి సేవించి వాహనాలు నడపడం ద్వార రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని, ఆత్మహత్య ఆలోచనలు కలుగడం, వ్యక్తులు తమను తాము గాయపర్చుకోవడం, ఇతరులపై దాడులు, హత్యలు దొంగతనాల వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని అన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ప్రధానంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడటం కోసం కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలు, ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ సేవిస్తున్నా.. విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, గంజాయి, అక్రమ రవాణా, సరఫరా, విక్రయాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువకులు మాదక ద్రవ్యాల నిర్మూలించడంలో నాకు నేనుగా భాగస్వామినవుతా అని ప్రతిజ్ఞ చేశారు.
జన్నారం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జన్నారం ఎస్‌ఐ రాజ వర్ధన్ కోరారు. యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని బుధవారం జన్నారంలో పోలీసులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. యువత చదువుపై దృష్టి సారించాలని ఎస్‌ఐ సూచించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నరు. స్థానిక పోలీసులు ప్లేట్స్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
తాండూర్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాండూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు అమ్మకాలు జరిగిన, సేవించిన వారు ఎదురుపడిన సమాచారం అందించాలని తెలిపారు. డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల రవాణా అమ్మకాలు నేరమని, నేరస్తులు పట్టుపడితే టాడ కేసులు నమోదు చేస్తామన్నారు. మాదకద్రవ్యాల అలవాట్ల వల్ల కలిగే దుష్పరిణామాల పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది. తాండూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను గురించి స్లొగన్స్ రూపంలో నినాదాలు చేస్తూ రహదారుల వెంట ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.
మందమర్రి: మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా మాదకద్రవ్యాల నిర్మూలన కై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగరేణి హై స్కూల్ నుండి మార్కెట్ వీధుల్లో గుండా తిరిగి సింగరేణి స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీపీ రవి కుమార్, సింగరేణి ఏరియా జీఎం మనోహర్, సీఐ శశిధర్ రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ సొతుకు సుదర్శన్ హాజరయ్యారు. ప్రజలు, కార్మికులు, డ్రైవర్లు వ్యాపారస్థులు, విద్యార్థిని విద్యార్థులతో కలిసి ప్రధాన వీధుల వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ భారిన పడకుండా కషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ కు తెలియచేస్తానని, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జి రాజశేఖర్, కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్, దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, ఎస్‌అండ్ పీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, లైన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.