మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

నవతెలంగాణ-తాంసి
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై శివరాం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హైస్కూల్‌ విద్యార్ధులు గ్రామ యువకులతో కలిసి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో గంజాయి తదితర మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. గిరిజన, మారుమూల గ్రామాల్లో పంట పొలాల్లో గంజాయి మొక్కలను పెంచడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది సంతోష్‌, శ్రీనివాస్‌, నాయకులు రామన్న యాదవ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.