యువత ‘మత్తు’ వదలాలి…

Youth should give up 'Math'...దేశ భవిష్యత్‌, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు,నైపుణ్యం అవసరం. దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతం. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే. కానీ నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను,శక్తిసామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై, నిస్తేజంగా మారుతున్నారు గంజాయి,డ్రగ్స్‌ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నది. యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్‌ అక్రమ వినియోగానికి అడ్డుకట్టవేసేందు చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఇంకా పకడ్బందీగా చర్యలకు తెగబడాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఎందుకంటే సకల అనర్ధాలకు అరాచకాలకు హత్యలకు ప్రేరణగా నిలిచే గంజాయి డ్రగ్స్‌ వాడకం వంటి మత్తు వ్యసనాలను దూరం చేయకుండా సమాజం బాగుపడదు. ఇది నగరాలు, పట్టణాలే కాదు మారుమూల గ్రామాలకు వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వలన కలిగే విపరీత పరిణామాలను అవగతం చేసుకున్న అంతర్జాతీయ సమాజం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నప్పటికీ, డ్రగ్స్‌ మహమ్మారి ఇంకా విస్త్రతంగా వ్యాప్తి చెందుతున్నదే తప్ప, సమిసిపోవడం లేదు. 1987వ సంవత్సరంలో వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ప్రపంచంలోని అన్నిదేశాలు డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదునుపెడుతున్నాయి.1987లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ డ్రగ్స్‌ లేని అంతర్జాతీయ సమాజానికై పిలుపునిచ్చింది.
తాగుడు వ్యసనంతో పాటు డ్రగ్స్‌ వ్యసనం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాల వలన వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 మిలియన్ల మందికి పైగా డ్రగ్స్‌కు బానిసలని కొకైన్‌, మార్జువానా, మార్ఫిన్‌, చరస్‌, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇతర దేశాల విషయం పక్కన బెడితే భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ”ఎన్‌.డి.పి.ఎస్‌” తీసుకురావడం, తర్వాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్టం చేసింది.ఈ డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి మానవ ప్రపంచంతో సంబంధాలుండవు. మంచి-చెడు విచక్షణ కనిపించదు. స్వప్నలోకాల్లో విహరిస్తూ, మత్తు వదలిన తర్వాత అనేక శారీరక, మానసిక బలహీనతలకు గురై, మళ్లీ అదే మత్తుకోసం చేయకూడని ఆకృత్యాలన్నీ చేస్తారు. డ్రగ్స్‌ మాఫియా వలలో చిక్కి, డ్రగ్స్‌ అక్రమ వినియోగానికి, చట్టవిరుద్దమైన డ్రగ్స్‌ రవాణాకు పాల్పడతారు.
తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోట్ల విలువైన 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టుకు దిగుమతయ్యాయి. కాకినాడకు ఆక్వా ఎక్స్‌పోర్టు సంస్థకు సరఫరా అవుతున్నట్లు సిబిఐ గుర్తించింది. హైదరాబాద్‌ శివార్లలో రసాయనాల తయారీ ముసుగులో మాదక ద్రవ్యాల తయారీ గుట్టుగా సాగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోర్టులను, ఎయిర్‌పోర్టులను ప్రయివేట్‌ పరం చేసిన తర్వాత డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఆదానీకి చెందిన ముంద్రా పోర్టులో రూ.3వేల కోట్ల డ్రగ్స్‌ పట్టుబడింది. కేవలం సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వాలు అధికార యంత్రాంగం హడావిడి చేస్తున్నారే తప్పా నిరంతర నిఘా కొరవడింది. యాంటి నార్కోటిక్స్‌ బ్యూరోని బలోపేతం చేసి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, డ్రగ్స్‌ వినియోగం తగ్గడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలి. అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలి.
రాష్ట్రంలోనూ గంజాయి,డ్రగ్స్‌ దందా విస్తరిస్తున్నది. బడిపిల్లల నుండి వర్సిటీ స్టూడెంట్స్‌ దాకా రోజు కూలీ నుంచి సాప్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకు ముఖ్యంగా సినీ ప్రముఖలు, వ్యాపారవేత్తలు ఈ మత్తు మహమ్మారికి బానిసలౌతున్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29 లక్షల మంది మత్తుపదార్థాలు సేవిస్తున్నారని తెలిపింది. గంజాయి కొనడానికి డబ్బుల్విలేదని కన్నవారినే కడతేర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గంజాయి దొరకడం లేదని, గంజాయికి, డ్రగ్స్‌ కి బానిసలై మత్తు నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజానీకమే లక్ష్యంగా పోలీసుల కన్నుగప్పి అంతరపంటగా గంజాయిని సాగుచేయడం దాన్ని యువతరానికి అలవాటు చేసి, ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారు.ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలి. విద్యా సంస్థల్లో అవగాహనా సదస్సులు పెట్టాలి. విద్యా సంస్థల దగ్గర ఉండే చిన్న చిన్న దుకాణదారులకు సైతం డ్రగ్‌, గంజాయి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. బస్తీలల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితులు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలి. అనేక అనర్ధాలకు, సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు ”మత్తు” ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో మాదక ద్రవ్యాల ప్రభావం గురించి ప్రత్యేకంగా విశ్లేషించనక్కరలేదు. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్‌ను యువత నుండి దూరం చేయాలి. డ్రగ్స్‌ లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్‌ మహమ్మారిని పారదోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి. ఖండాంతరాలకు విస్తరించిన డ్రగ్స్‌ దందాను అరికట్టాలి. నగరాలను దాటి, పల్లెల్లోకి ప్రవేశించిన డ్రగ్స్‌,గంజాయి మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలి.

– ఆనగంటి వెంకటేష్‌, 9705030888