నువ్వు యూట్యూబుల్ని పుట్టించి, పెంచి, పోషించ గలిగితే అవే నీ పాలనను సుస్థిరం చేస్తాయి! ‘ఎక్స్’ అలియాస్ ట్విట్టర్‌లో కేటీఆర్‌కొచ్చిన ఒకానొక సలహానట! కొన్ని శాపనార్థాలు కూడా ఉన్నా ఈ సూచన భేషైన దిగా కన్పడిందాయనకు. టెక్నాలజీ రంగంపై మంచి అవగాహనుండే వ్యక్తి గా కీర్తించబడే కేటీఆర్ కల్లోల నౌకకు ‘అరేబియన్ నైట్స్’ కథల్లో ఒక తీరం దొరికిన ‘సింద్‌బాద్’ పొందిన ఆనందం దొరికింది. 32మెడికల్ కాలేజీలు పెట్టి, వాటి కింద ఆసుపత్రులు నెలకొల్పి జనానికి వైద్య సదుపాయాలు కల్పించడం కంటే 32 యూట్యూబ్ చానెళ్లు పెట్టి బాగా డప్పు కొట్టుకొని ఉంటే ఈవిఎమ్‌లు గులాబీ శోభతో అలరారుతుండేవని సదరు మంత్రి గారి తాత్పర్యం.
కొన్ని వాస్తవాలు కల్వకుంట్ల కుటుంబీకులు లేదా ఆ పార్టీ వారు విన గలిగితే, తెల్సుకునే ఆసక్తి ఉంటే… దాదాపు ఎనిమిదిన్నరేండ్లు రాష్ట్రం లోని యావన్మీడియా మీ బాకాలు గానేగా ఉండింది. విమర్శించే పత్రికల గొంతు నులిమే ప్రయత్నం నిర్వి రామంగానే చేశారు కదా! ఏ ప్రభుత్వంలోనైనా ఐ అండ్ పి.ఆర్ కో మంత్రి ఉంటారు. కేసీఆర్ ఆ పదవిని తన వద్దే ఉంచుకుని, పత్రికలను నియం త్రించే ప్రయత్నం చేయలేదా? విమర్శించే పత్రికలకు ‘యాడ్స్’ ఇవ్వకుండా ఎండబెట్టిన విధానం, అధినాయకుడే ఆయుధం పట్టుకుని అదిలించిన తీరు అందరికీ తెల్సిందే! మంత్రివర్గ సమా వేశా నంతరం పత్రికలకు ‘బ్రీఫ్’ చేసిందీ ఆయనే. కఠినమైన ప్రశ్నలడిగే విలేకర్లని దబాయించి, నోరు మూయించిందీ ఆయనే. మొన్నటి ఎన్నికల్లో మిగిలిన పార్టీలకంటే శక్తివం తంగా సోషల్ మీడియాను ఉపయోగించింది బీఆర్‌ఎస్ పార్టీయేనని బీజేపీ కూడా ఏడ్చిన సందర్భం లేదా? ఇంక యూట్యూబ్ చానళ్ల కోసం ఆ వగచుండెందుకు? లేదా ప్రజలకం దిన ఆ కాస్త వైద్య సేవలు కూడా అందించి ఉండాల్సింది కాదని కేటీఆర్ భావమా?
ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తికి ‘రైటింగ్ ఆన్ ది వాల్’ అర్థం తెలిసే ఉంటుంది. బహుశా తెలియబట్టే ఓడిపోతే ప్రతిపక్షంలో కూచుంటామని ఒక చర్చ సందర్భంగా మంత్రి వర్యులే సెలవిచ్చారేమో! ”కొన్ని సార్లు కొంత మంది నిజాలు వినడా నికి ఇష్టపడరు, ఎందుకంటే వారి భ్రమల లోకం కూలిపోవడం వారికి ఇష్టముండదు” అన్న ఫ్రీడ్ రిచ్ నీట్స్‌జే అనే జర్మన్ తత్వవేత్త మాటలు ఈ సందర్భానికి సరిగ్గా నప్పుతాయి.
తమ అప్రజాస్వామిక అహంకార పూరిత ధోరణుల గురించి వెనక్కి తిరిగి చూడకుండా ఓటమికి కారణాలు యూట్యూబుల్లో దేవు లాడుకునే వారికి మనమేం చెప్పగలం? 2014 జూన్ 2 నుండి మొన్న ఓటమి పాలయ్యే వరకు తోటి ఉద్యమకారులు, మేధావుల మొదలు తనని అందలమెక్కించడంలో కీలకభూమిక పోషించిన రంగాలనేతల వరకు చెప్పుకింద తేళ్లలాగా పడుండే వారితోనే మాటామంతీ ఉండింది. ‘కొండె’ కాదు కదా, కనీసం గొంతెత్తి విమర్శించినా, అధినేతను ప్రశ్నించినా అద:పాతాళంలోకి తొక్కేసిన ఘటనలెన్నో. అవిగవిగో కోట గుమ్మానికి వేలాడుతున్న తలకాయలు! తమ కోసం రావల్సిన వాటితో పాటు రాష్ట్ర ప్రజానీకం సౌకర్యాల కోసం నిటారుగా నిలబడ్డ పాపానికి ‘ప్రగతి రథాన్ని’ రోడ్ రోల ర్లతో తొక్కించి ఆర్‌టీసీ కార్మికోద్యమాన్ని మసి చేసి, నుసి చేసే ప్రయత్నం చేస్తే ఆ కార్మికులు, వారి కుటుంబాలు కట్టగట్టుకుని బీఆర్‌ఎస్ పాలనను దెబ్బతియ్యవా? నల్లటి బొగ్గు బావుల్లో మండిన మంటలు రాష్ట్రావతర ణోద్యమంలో కీలక భూమిక పోషించాయి. కొందరు నాయకుల అవినీతి, అధికార పార్టీకి అంటకాగుతూ, లంచాలు, పైరవీలకై ఎగబడిన తీరుకు నేడు సింగరేణి ఎన్నికల్లో ఆ సంఘం నామరూపాలు లేకుండా పోవడమే కాదు, మొత్తం సింగరేణి బెల్టులోని శాసనసభా స్థానాలన్నీ బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా బీడీ కార్మికులు లక్షల సంఖ్యలో కేంద్రీకరించి ఉన్న జిల్లాలన్నింటిలో బీఆర్‌ఎస్‌కు చుక్కెదు రైంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు నూతన పెన్షన్ స్కీంపై రగిలి పోతున్నారు. దాదాపు 30 శాతం మంది రెగ్యులరైజేషన్ కోసం తపిస్తున్నారు. కాని కొందరు నాయకులకి మేత వేస్తూ, మచ్చిక చేసుకుని అదే ”ఎంప్లాయీ ఫ్రెండ్లీ” ప్రభుత్వమని చాటింపు వేసుకుంటే చాల్తుందా? కీలెరిగి వాత పెట్టారు ఆ ఉద్యోగులు.
సంక్షేమ పథకాలే గట్టెక్కించలేవు. దళితబంధు, డబల్‌బెడ్ రూం ఇళ్లు అందిన వారు గుప్పెడు మంది. ఇంకా రాని వారు గంపెడు మంది ఉన్నారు. ఇలాంటి స్కీంలు ఏదో ఒక పేరు మీద చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అయినా, తానే ‘సంక్షేమ చర్యల సామ్రాట్’గా చెప్పుకుంటూ అన్ని రాష్ట్రాల పత్రికల్లోను వాణిజ్య ప్రకటనలు గుప్పించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమ నించరా? రాష్ట్రంలో పదేపదే పోటీ పరీక్షలు వాయిదా, అనేక మంది ఆత్మహత్యలు, పేపర్ల లీకేజీలు, నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం వంటివి యువతను పెద్దఎత్తున ప్రభావితం చేశాయి. ఎన్నికల వేళ మేడిగడ్డ కుంగింది. ప్రభుత్వ అవినీతిపై విపక్షాల వాదనకు బలం చేకూరింది. కర్ణుడి చావుకి మించినన్ని కారణాలు బీఆర్‌ఎస్ ఓటమిలో ఉన్నాయి. అది గుర్తించకుండా ‘యూట్యూ బు’ల్లో కారణాలు వెతుక్కుంటే ఉపయోగ మేమిటి మహాశయా!