కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల– రేపు ఢిల్లీకి పయనం
– అక్కడేఅధికారిక ప్రకటన
– పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధిష్టానం
– వైఎస్‌ఆర్‌టీపీ విలీనంపై తెలంగాణ క్యాడర్‌ డైలమా
– సర్దుబాటు హామీతో సరి..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌ విలీనం చేసేందుకు మూహుర్తం ఖరారైంది. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల గురువారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీని కలువనున్నారు. ఆ తర్వాత పార్టీ విలీనంపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై బుధవారం వైఎస్‌ షర్మిల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విలీన ప్రక్రియపై చర్చలు జరిగాయి. ఆ సమయంలోనూ కాంగ్రెస్‌ పెద్దలను ఆమె కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉంటానంటూ షర్మిల ప్రకటించారు. తెలంగాణ కోడలిగా తనకు ఇక్కడే సర్వహక్కులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏఐసీసీ పెద్దలను ఒప్పించారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే కాంగ్రెస్‌లో ఆంధ్రా పెత్తనం అంశాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెరపైకి తెస్తారని హస్తం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అది ఎన్నికల అస్త్రంగా మారుతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అధిష్టానం వద్ద బలంగా వాదన వినిపించారు. దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడి, పార్టీ విలీనాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి వైఎస్‌ షర్మిల తన పార్టీని విలీనం చేసే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈసారి తెలంగాణ కాంగ్రెస్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో పని చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోది. ఏపీలో కాంగ్రెస్‌ బలహీ నంగా ఉండటం, అక్కడ నాయకత్వ కొరత ఉండటం తోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో తగిన స్థానాలను దక్కించు కోవాలంటే షర్మిల అవసరం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భా విస్తోంది. ఒకవైపు వైఎస్‌ఆర్‌ పార్టీ, మరోవైపు టీడీపీ, జనసేన కూటమి మధ్య ద్విముఖ పోటీ అనే వాతావరణం ఉన్నది. దీన్ని బ్రేక్‌ చేసేందుకు షర్మిలను రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే హస్తం పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరిన పార్టీ సీనియర్‌ నేతలు కూడా షర్మిల చేరితే, తాము సొంతింటికి వస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొవాలంటే, ఆంధ్రలో షర్మిల బాణాన్ని వదలాలని ఏఐసీసీ నిర్ణయించింది. దీనికి షర్మిల కూడా సమ్మతించడంతో విలీన మార్గం సుమగన మైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల యంలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపి కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతంపై అందులో చర్చించారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల గ్యారంటీలు ఇచ్చినట్టుగానే ఏపీ ప్రజలకు కొన్ని గ్యారెంటీలు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రకంగా ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సెక్యులర్‌ పార్టీ..అందుకే చేరుతున్నా..
‘దేశంలో కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ. ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తున్నది. అందుకే ఆ పార్టీలో చేరేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బుధవారం ఢిల్లీకి వెళ్తున్నాను. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది’ అని షర్మిల ప్రకటించారు.
ఏపీపీసీసీ పగ్గాలు షర్మిలకేనా?
వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఏఐసీసీలో ముఖ్యమైన స్థానంతోపాటు ఏపీలో పీసీసీ బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీని ఆమె కోరినట్టు తెలుస్తున్నది. అందుకు అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
తెలంగాణ క్యాడర్‌ డైలమా..
2021 జులై 8న వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని షర్మిల స్థాపించారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన తీసుకురావటమే తన లక్ష్యమని ప్రకటించారు. ప్రజా ప్రస్థానం పేరుతో 3,800 కిలోమీటర్లకు పైగా ఆమె సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ స్థాపించి రెండేండ్లు అయినప్పటికీ అది ఎంత మాత్రమూ ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన కరువైంది. అయితే షర్మిల కేసీఆర్‌ పాలనపై ఘాటుగా విమర్శలను సంధించారు. బీజేపీ, కాంగ్రెస్‌పై పదునైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పెంచారు. అయినప్పటికీ క్యాడర్‌లో జోష్‌ నింపలేకపోయారనే విమర్శలు సొంత పార్టీలోనే వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.