కుల విద్వేషాలతో వైసీపీ రాజకీయ లబ్ది

– ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తోట
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. బుధవారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఆలమూరి రఫీ ఆధ్వర్యంలో కడప, బద్వేల్‌, జమ్మల మడుగు, కమలాపురం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియా పేట్రెగిపోతున్నా పట్టించుకున్న నాధుడేలేరని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నేతలు భౌతిక దాడులు చేయిస్తూ, అక్రమ కేసులతో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పేందుకు. రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ పాలనతో విసిగివేసారిన ప్రజానీకం బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ది ఏపీలో కూడా విస్తరించాలని ప్రజల ఆకాంక్షగా ఉన్నట్టు స్పష్టం చేశారు.